Published : 10 Feb 2022 20:12 IST

Ajinkya Rahane : ఆస్ట్రేలియా పర్యటనలో నా నిర్ణయాలకు.. వేరెవరో క్రెడిట్ తీసుకున్నారు : అజింక్య రహానె

ఇంటర్నెట్ డెస్క్‌ : టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు అజింక్య రహానె సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఆస్ట్రేలియా పర్యటనలో తాను తీసుకున్న నిర్ణయాలకు వేరెవరో క్రెడిట్ తీసుకున్నారని ఆరోపించాడు. 2020-21 ఆస్ట్రేలియా పర్యటనలో రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ గైర్హాజరీతో అజింక్య రహానె తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. తొలి టెస్టులో ఘోర పరాజయం తర్వాత కోహ్లీ పితృత్వ సెలవుపై భారత్‌కి తిరిగొచ్చాడు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టిన రహానె.. జట్టుని విజయపథంలో నడిపించాడు. ఆ తర్వాత జరిగిన మూడు టెస్టులకు సారథ్యం వహించిన రహానె.. 2-1తో టెస్టు సిరీస్‌ను సొంతం చేసుకుని భారత్‌ని విజేతగా నిలిపాడు. అప్పటి పర్యటనపై తాజాగా అతడు స్పందించాడు. ‘బ్యాక్‌స్టేజ్‌ విత్‌ బొరియా’ అనే కార్యక్రమంలో మాట్లాడిన అతడు ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘ఆస్ట్రేలియా పర్యటనలో నేను ఏం చేశానో అందరికీ తెలుసు. ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ విజయం గురించి చెప్పుకుని.. క్రెడిట్ కొట్టేయాలనుకోవడం నా స్వభావం కాదు. మైదానంలో నేను తీసుకున్న నిర్ణయాల వల్లే భారత్‌ గొప్ప విజయాలు సాధించింది. కానీ, వాటికి క్రెడిట్ వేరెవరో తీసుకున్నారు. ఏదేమైనా, మా జట్టు సిరీస్‌ గెలవడం చాలా ముఖ్యం. ఆస్ట్రేలియా గడ్డపై సాధించిన చారిత్రక టెస్టు సిరీస్‌ నాకు చాలా ప్రత్యేకమైనది. ఆ విజయం తర్వాత ‘నా వల్లే ఇది సాధ్యమైంది.. నేను తీసుకున్న నిర్ణయాలే విజయానికి ప్రధాన కారణం’ అని కొందరు మీడియాలో చెప్పుకున్నారు. మైదానంలో పరిస్థితులను బట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నానో నాకు తెలుసు. వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం లేదు. కానీ, అవన్నీ నా సొంతంగా తీసుకున్నవే. అలా చెయ్‌, ఇలా చెయ్‌ అని నాకెవరూ చెప్పలేదు’ అని అజింక్య రహానె పేర్కొన్నాడు.

రహానె ప్రత్యేకించి ఎవరి పేరును ప్రస్తావించలేదు. అయితే, అప్పటి హెడ్ కోచ్‌ రవిశాస్త్రిని లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆస్ట్రేలియా పర్యటన తర్వాత రవిశాస్త్రి ఇచ్చిన పలు ఇంటర్వ్యూల్లో పదే పదే ఈ విజయం గురించి చెప్పుకున్న విషయం తెలిసిందే. క్లిష్ట పరిస్థితుల్లో పగ్గాలు చేపట్టి.. సమర్థంగా జట్టుని నడిపించిన రహానెపై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. 

* నా సామర్థ్యంపై నమ్మకం ఉంది..

‘నా ఫామ్‌పై వస్తున్న విమర్శలను చూసి నవ్వుకుంటాను. ఆట గురించి తెలియని వాళ్లే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటారు. వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్ట్రేలియా పర్యటనకు ముందు, ఆ తర్వాత టెస్టుల్లో నేను రాణించిన తీరు గురించి మాట్లాడాలనుకోవడం లేదు. కానీ, ఆస్ట్రేలియా పర్యటన నా కెరీర్లో మరిచిపోలేనిది. ఆట గురించి తెలిసిన వాళ్లు, ఆట పట్ల అభిమానం ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడుతారు. నా సామర్థ్యంపై పూర్తి నమ్మకముంది. మునుపటి ఫామ్‌ అందుకుని బ్యాటుతో సత్తా చాటగలను. నాలో ఇంకా చాలా క్రికెట్ మిగిలి ఉంది’ అని అజింక్య రహానె చెప్పాడు.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని