సౌరవ్‌ గంగూలీ ప్రేమలోనూ దాదానే!

ఈరోజు మాజీ టీమ్‌ ఇండియా కెప్టెన్‌, బీసీసీఐ  అధ్యక్షులు గంగూలి 49వ పుట్టినరోజు. అతడు జులై 8, 1972లో పుట్టాడు. రెండు దశాబ్దాల కింద గంగూలీ భారత క్రికెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపాడు.సాహసోపేతంగా భారత జట్టును నడిపిన గంగూలీ తన ప్రేమనావనూ ధైర్యంగా ఒడ్డుకు లాక్కొచ్చాడు.

Updated : 08 Jul 2021 22:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రెండు దశాబ్దాల కింద భారత క్రికెట్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపిన మాజీ టీమ్‌ ఇండియా కెప్టెన్‌, బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్‌ గంగూలీ 49వ పుట్టినరోజు నేడు. అతడు జులై 8, 1972లో పుట్టాడు. ఎంతో సాహసోపేతంగా భారత జట్టును నడిపిన గంగూలీ, వ్యక్తిగత జీవితంలో.. తన ప్రేమనావనూ ధైర్యంగా ఒడ్డుకు లాక్కొచ్చాడు. అతడు తన కలలరాకుమారి దోనాను 1997లో పెళ్లి చేసుకున్నాడు. ఈ పెళ్లికి ఓ ప్రత్యేకత ఉంది. మరి ఇది ముమ్మాటికీ అన్ని పెళ్లిళ్లలాంటిది కానే కాదు. దీనికి ముందు చందమామ కథలాంటి ఆకట్టుకునే ప్రేమగాధ నడిచింది వారి మధ్యలో. ఇంతకీ దాదా ప్రేమ కథేంటి?
చిన్ననాటి స్నేహమే ప్రేమగా మారింది!
 సౌరవ్‌ గంగూలీ, అతని భార్య దోనా రాయ్‌ చిన్నప్పటి నుంచి ఇరుగుపొరుగునే ఉండేవారు. అయితే ఇరు కుటుంబాల మధ్య అంతగా సత్సంబంధాలేమీ లేవు. పెద్దలు ముభావంగా ఉండేవారు. అయినా అది గంగూలీ-దీనా దగ్గరవ్వకుండా అడ్డుకోలేకపోయింది. చిన్నప్పుడు ఫుట్‌బాల్‌ ప్రాక్టీస్‌ కోసం వెళ్లేటప్పుడు ఆమె ముఖారవిందాన్ని ప్రతిరోజూ చూసేవాడు. కొన్నిసార్లు ఆమె చదువుతున్న స్కూల్‌ ముందునుంచీ వెళ్లేవాడు.. కేవలం ఆమె దర్శనంకోసమే.  అతడు షటిల్‌ ఆడేటప్పుడు షటిల్‌కాక్‌ తమ ఇంటి కాంపౌండులో ఎప్పుడెప్పుడు పడుతుందా అని ఆమె వేచి చూసేది. పరస్పరం మట్లాడుకుంటూ, ఇచ్చిపుచ్చుకునేవారు.
అలా ఇద్దరూ ఒకరి మీద ఒకరికి ఆరాధన భావంతో పెరిగారు. ఇద్దరూ కలిసి కోల్‌కతాలోని  చైనీస్‌ రెస్టారెంట్‌కు వెళ్లేవారు. అతడు చాలా ఆహారం ఆర్డర్‌ చేయడం చూసి ఆమె ఆశ్చర్యపోయేది. కానీ అంతా తిని ముగించేవాడు.  డోనా ఒడిస్సీ నృత్యకారిణి. ఆమె ఇచ్చే ప్రదర్శనలకు గంగూలీ ఠంచనుగా హాజరయ్యేవాడు. ఆమె కూడా అతడు మ్యాచులకు తప్పకుండా వచ్చేది. పెద్దల మధ్య అపార్థాలు ఉన్నా వారిద్దరూ స్నేహంగానే ఉండేవారు. ఆ స్నేహబంధమే ప్రేమగా మారి పెళ్లి పీటల దాకా నడిపించింది.
 వారిద్దరిదీ మొదట రహస్య వివాహమే!
డోనా  మెచ్చిన రాకుమారుడు అప్పటికింకా  భారత క్రికెట్‌ టీమ్‌ కెప్టెన్‌ కాదు. అయితే అప్పటికే అతను భారత క్రికెట్‌లో మంచి ఆటగాడిగా ఎదుగుతున్నాడు.1996లో ఇంగ్లాండుకు టెస్ట్‌ మ్యాచ్‌కు వెళ్లే ముందు తను తిరిగొచ్చాక ఆమెను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు.  తీరా వారు ఒకరోజు రిజిస్ట్రార్‌ ఆఫీసుకు వెళ్లేసరికి అక్కడంతా జనాలతో కోలాహలంగా ఉంది. అది చూసి వెనుదిరిగి వచ్చేశారు.  తర్వాత తమ స్నేహితుడి ఇంటికి వెళ్లారు. అతడి సమక్షంలోనే వారిద్దరూ 1996 ఆగస్టులో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. అయితే ఇరు కుటుంబాల్లోని పెద్దలకు ఈ విషయం తెలీదు. 
కుటుంబ ఆశీస్సులతో మళ్లీ పెళ్లి క్రతువు!
ఇదిలా ఉంటే ఓ ఆరునెలలు గడిచాయి. ఇరువైపులా ఇంట్లో పెళ్లి సంబంధాలు చూడసాగారు. అంతలోనే ఓ స్థానిక వార్తాపత్రికలో వారిద్దరికీ రహస్యంగా పెళ్లి జరిగినట్లు వార్త ప్రచురితమైంది. ఈ విషయం తెలిసి పెద్దలు అగ్గమీద గుగ్గిలమయ్యారు. అయితే ఎలాగోలా తమ తల్లిదండ్రులను ఒప్పించి, శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య, బంధుమిత్రుల సమక్షంలో..  అందరి ఆశీస్సులతో 1997 ఫిబ్రవరిలో వారు మళ్లీ పెళ్లి చేసుకున్నారు.  
వారికి 2001లో సనా అనే ఓ కూతురు పుట్టింది. ఇదండీ.. బెంగాలీ దాదా ప్రేమ-పెళ్లి కథ! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని