Sourav Ganguly: వన్డేల్లో.. ఒకే ఒక్కడు!

పరుగులు చేయడంలో.. సిక్సర్లు దంచడంలో.. ప్రత్యర్థిని ఢీకొట్టడంలో కోల్‌కతా ప్రిన్స్‌ ఆధిపత్యం తెలియనిది ఎవరికి? మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కళంకంతో విశ్వాసం కోల్పోయిన భారత క్రికెట్‌కు ఊపిరులూదిన బెంగాల్‌...

Published : 29 May 2021 10:36 IST

ఇంతకు మించి దాదాగిరీ ఉంటుందా?

పరుగులు చేయడంలో.. సిక్సర్లు దంచడంలో.. ప్రత్యర్థిని ఢీకొట్టడంలో కోల్‌కతా ప్రిన్స్‌ ఆధిపత్యం తెలియనిది ఎవరికి? మ్యాచ్‌ ఫిక్సింగ్‌ కళంకంతో విశ్వాసం కోల్పోయిన భారత క్రికెట్‌కు ఊపిరులూదిన బెంగాల్‌ టైగర్‌ సంగతి తెలియనిది ఎవరికి? అయితే, అంతర్జాతీయ క్రికెట్లో వరుసగా నాలుగు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచులు గెలిచిన ఏకైక క్రికెటర్‌ సౌరవ్‌ గంగూలీ ఒక్కడేనని ఈ తరంలో ఎంతమందికి తెలుసు? అందుకే అప్పటి దాదాగిరిని మరొక్కసారి గుర్తు చేసుకుందాం!!


గణాంకాలన్నీ దాదావే

 1997, సెప్టెంబర్‌.. టీమ్‌ఇండియా కెనడాలో పర్యటించింది. దాయాది పాకిస్థాన్‌తో 5 వన్డేల్లో తలపడింది. 4-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకొంది. శత్రు దేశాన్ని చిత్తుచిత్తుగా ఓడించింది. ఆ ఘన విజయంలో కీలక పాత్ర పోషించాడు సౌరవ్‌ గంగూలీ. ఆ సిరీసు గణాంకాల్లో ఆధిపత్యం కోల్‌కతా ప్రిన్స్‌దే. అటు బ్యాటు.. ఇటు బంతితో దాదాగిరి చేశాడు. 5 ఇన్నింగ్సుల్లో 55.50 సగటుతో 62.01 స్ట్రైక్‌రేట్‌తో 222 పరుగులు చేశాడు. 2 అర్ధశతకాలతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. సక్లెయిన్‌ ముస్తాక్‌ వంటి దిగ్గజ బౌలర్‌ 9 వికెట్లు తీస్తే గంగూలీ ఏకంగా 15 వికెట్లు పడగొట్టాడు. 48.5 ఓవర్లు వేస్తే అందులో 9 మొయిడిన్‌. ఇక సగటు 10.66, ఎకానమీ 3.27. ఒక మ్యాచులో కేవలం 16 పరుగులిచ్చి 5 వికెట్లతో అత్యుత్తమ గణాంకాలు నమోదు చేశాడు. ఎక్కువ ఓవర్లు వేసి తక్కువ పరుగులు (160) ఇచ్చిందీ అతడే. అజయ్‌ జడేజా, మహ్మద్‌ అజహరుద్దీన్‌తో కలిసి 100+, సచిన్‌తో కలిసి 50+ భాగస్వామ్యాలు సాధించాడు. ఫీల్డింగ్‌లో 3 క్యాచులూ అందుకున్నాడు.


బ్యాటుతో పరుగులు

టీమ్‌ఇండియా 20 పరుగుల తేడాతో గెలిచిన తొలి వన్డేలో సౌరవ్‌ 17 పరుగులు చేసి 2 వికెట్లు తీశాడు. రెండో వన్డే నుంచి దాదాగిరి మొదలైంది. బౌలర్లు రాణించడంతో మొదట బ్యాటింగ్‌ చేసిన పాక్‌ 116 పరుగులకు ఆలౌటైంది. బంతితో 9 ఓవర్లు వేసిన గంగూలీ 2 ఓవర్లు మెయిడిన్‌ చేసి 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. ఛేదనలో ఓపెనర్‌గా దిగి 32 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. తొలి మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అందుకున్నాడు. వాతావరణం వల్ల మూడో వన్డే ఫలితం తేలలేదు. ఆట నిలిపేసే సమయానికి పాక్‌ 31.5 ఓవర్లకు 169/3 చేసింది. దాదా 7.5 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. మరుసటి రోజే 3 వన్డేను మళ్లీ నిర్వహించారు. మొదట భారత్‌ 182/6 స్కోరే చేసింది. గంగూలీ (2) బ్యాటుతో నిరాశపరిచినా బంతితో చెలరేగాడు. అత్యుత్తమ గణాంకాలు 10-3-16-5 నమోదు చేశాడు. 5 వికెట్లు తీసి మిడిలార్డర్‌ మొత్తం పడగొట్టాడు. ఐజాజ్‌ అహ్మద్‌, సలీమ్‌ మాలిక్‌, హసన్‌ రజా, మొయిన్‌ ఖాన్‌, ఆఖిబ్‌ జావెద్‌ను పెవిలియన్‌ పంపాడు. అతడి ధాటికి పాక్‌ 36.5 ఓవర్లకు 148కే ఆలౌటైంది. దాదాకు రెండో అవార్డు దక్కింది.


బంతితో వికెట్లు

నాలుగో వన్డేలోనూ మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ దాదాదే. 28 ఓవర్లే జరిగిన ఈ మ్యాచులో పాక్‌ మొదట 6 వికెట్ల నష్టానికి 159 పరుగులే చేసింది. గంగూలీ 6 ఓవర్లు వేసి 2 వికెట్లు తీశాడు. ఇక ఛేదనలో అదరగొట్టాడు. సచిన్‌ (6), రాబిన్‌ సింగ్‌ (16), అజ్జూ (7) విఫలమైనా ఒంటరిగా పోరాడాడు. 75 బంతుల్లో 75 పరుగులతో అజేయంగా నిలిచాడు. అజయ్‌ జడేజా (37*)తో కలిసి విజయ తీరాలకు తీర్చాడు. దాంతో భారత్‌ 4-0తో సిరీసులో క్లీన్‌స్వీప్‌ దిశగా సాగింది. ఆఖరి వన్డేలో గెలుపు పాక్‌దే అయినా అవార్డు మాత్రం గంగూలీకే దక్కింది. సచిన్‌ (51)తో కలిసి ఓపెనింగ్‌ చేసిన కోల్‌కతా ప్రిన్స్‌ (96; 136 బంతుల్లో 5×4, 2×6) త్రుటిలో శతకం చేజార్చుకున్నాడు. కానీ అజహర్‌ (50)తో కలిసి జట్టుకు 250/5 స్కోరు అందించాడు. బంతితో 2 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ఆఖరి మ్యాచులోనైనా పరువు కాపాడుకోవాలన్న ఉద్దేశంతో పాక్‌ దూకుడుగా ఛేదించింది. మరో 37 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలిచింది. మొత్తానికి బెంగాల్‌ టైగర్‌ కెరీర్లో గొప్ప గణాంకాలను నమోదు చేశాడు.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని