T20 World Cup 2024: మ్యాచ్‌ను ‘బ్రాడ్‌కాస్టింగ్‌’ గెలిపించదు కదా..: మైకెల్‌ వాన్‌కు గంగూలీ కౌంటర్

టీ20 ప్రపంచ కప్‌లో భారత్‌ చేతిలో ఇంగ్లాండ్ ఓడిపోవడంతో ఆ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ తట్టుకోలేకపోతున్నాడు. టీమ్‌ఇండియా విజయాన్ని తక్కువ చేసేలా వ్యాఖ్యలు చేస్తున్నాడు. దానికి మాజీ క్రికెటర్లు గట్టిగా బదులిచ్చారు.

Published : 29 Jun 2024 16:45 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌ ఫైనల్‌లో తలపడేందుకు భారత్-దక్షిణాఫ్రికా (IND vs SA) జట్లు సిద్ధంగా ఉన్నాయి. మెగా టోర్నీలో తొలిసారి సౌతాఫ్రికా తుదిపోరుకు అర్హత సాధించగా.. టీమ్‌ఇండియాకిది మూడోసారి. 2007లో ధోనీ నాయకత్వంలో భారత్‌ విజేతగా నిలిచింది. ఇప్పుడు రోహిత్‌ కెప్టెన్సీలో మరోసారి ఛాంపియన్‌ కావాలనే లక్ష్యంతో బరిలోకి దిగింది. సెమీస్‌లో పటిష్ఠమైన ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి మరీ ఫైనల్‌కు దూసుకొచ్చింది. అయితే, ఇంగ్లిష్‌ జట్టు మాజీ కెప్టెన్ మైకెల్‌ వాన్‌ నోటిదురుసు మాత్రం తగ్గలేదు. రెండో సెమీ ఫైనల్‌ జరిగిన గయానా పిచ్‌ స్పిన్‌కు సహకరించేలా భారత్‌ కోసం మార్చారని వాన్‌ విమర్శించాడు. అలాగే టీమ్‌ఇండియాకు అనుకూలంగా ఉండే 8పీఎం స్లాట్‌ను ఐసీసీ కేటాయించడం సరైంది కాదని వ్యాఖ్యానించాడు. ఇప్పటికే వాన్‌కు అశ్విన్‌, హర్భజన్‌ చురకలు అంటించారు. తాజాగా భారత మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourabh Ganguly) కూడా వాన్‌ వ్యాఖ్యలపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. 

‘‘మైకెల్ వాన్‌ నాకు స్నేహితుడే. అతడు ఇలాంటి వ్యాఖ్యలు ఎందుకు చేశాడో తెలియదు. ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత మ్యాచ్‌లను ఇక్కడి కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు నిర్వహించడం వల్ల ఐసీసీ మాకు ఏం సాయం చేసినట్లు అవుతుందో తెలియడం లేదు. బ్రాడ్‌కాస్టింగ్‌ వల్ల మ్యాచులు గెలుస్తారని నాకు తెలియదు. ఎప్పుడైనా సరే, ఎలాంటి పిచ్‌పైనైనా ఆడితేనే విజయాలు దక్కుతాయి. ఇక ప్రపంచంలోని అన్ని చోట్లా గెలిచినప్పుడు.. గయానాలో మాత్రం విజయం సాధించలేకపోతున్నారనేది ఎందుకో మీకే తెలియాలి. 

చాలామంది చెబుతున్నట్లు ప్రపంచ క్రికెట్‌పై భారత్‌ (Team India) ఆధిపత్యం ఉంది. అది ప్రదర్శన చేయడం, బ్రాడ్‌కాస్టింగ్‌, ఆదాయం వల్ల మాత్రమే. అంతేకానీ, ఇతర అంశాలను ప్రభావితం చేయాల్సిన అవసరం లేదు. మీకు ఓ కంపెనీలో 80 శాతం వాటా ఉందనుకోండి.. మీకు వచ్చే డివిడెండ్లు, లాభాలు ఇతరుల కంటే ఎక్కువే వస్తాయి. ఇది జీవిత నియమం. భారత జట్టు కూడా అంతే. అత్యుత్తమ ప్రదర్శనతో ఫైనల్‌కు చేరింది. కెప్టెన్ రోహిత్ శర్మను (Rohit Sharma) ఇలా చూడటం ఆనందంగా ఉంది. ఆరు నెలల కిందట అతడిని ముంబయి కెప్టెన్సీ నుంచి తీసేసినా.. ఇప్పుడు టీమ్‌ఇండియాను వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు తీసుకెళ్లాడు’’ అని గంగూలీ ప్రశంసించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని