IPL 2023: భవిష్యత్తు సారథుల కార్ఖానా ఐపీఎల్‌: సౌరభ్ గంగూలీ

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL 2023) 16వ సీజన్‌ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. ఆటగాళ్లలోని ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పడానికి ఇదొక వేదిక. అలాగే నాయకత్వ లక్షణాలను ప్రదర్శించుకోవడానికి కూడా చక్కని ప్లాట్‌ఫామ్‌గా మారిందని టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ సౌరభ్ గంగూలీ అన్నాడు.

Published : 29 Mar 2023 22:40 IST

ఇంటర్నెట్ డెస్క్: సౌరభ్ గంగూలీ.. ఎంఎస్ ధోనీ.. విరాట్ కోహ్లీ.. భారత క్రికెట్‌ జట్టును నడిపించిన సారథులు. ఇప్పుడు రోహిత్ శర్మ టీమ్‌ఇండియా కెప్టెన్‌. మరి ఆ తర్వాత ఎవరు అన్నదే అందరిలోనూ తలెత్తే ప్రశ్న. ఇప్పటికే సారథిగా తన సత్తా ఏంటో హార్దిక్‌ పాండ్య నిరూపించుకున్నాడు. గతేడాది ఐపీఎల్‌లో (IPL 2023) గుజరాత్‌ టైటాన్స్‌ను విజేతగా నిలిపాడు. రోహిత్ గైర్హాజరీలో అడపాదడపా భారత జట్టు పగ్గాలను చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, ఐపీఎల్‌లో అద్భుత పనితీరును చూపించడం వల్లే టీమ్‌ఇండియా సారథ్య బాధ్యతలను హార్దిక్‌కు ఇవ్వడానికి కారణమని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఇప్పుడు బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా ఇలానే స్పందించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా ప్రతిభావంతులైన ఆటగాళ్లే కాకుండా నాయకత్వ సామర్థ్యం కలిగినవారు కూడా వెలుగులోకి వస్తున్నారని పేర్కొన్నాడు. 

‘‘ఆటగాళ్లలోని నాయకత్వ ప్రతిభను వెలికితీసే మెగా టోర్నీ ఐపీఎల్‌ అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే హార్దిక్‌ పాండ్యను చూశాం. గతేడాది గుజరాత్‌ను విజేతగా నిలిపాడు. భారత టీ20 జట్టుకు సారథిగా బాధ్యతలు చేపట్టాడు. ఐపీఎల్‌లో గెలుపోటములను విస్మరించలేం. ఇది చాలా క్లిష్టమైన టోర్నీ. కానీ, భారత టీ20 జట్టును ఎంపిక చేయడానికి మరీ అతిగా ఐపీఎల్‌ ప్రదర్శన మీదనే ఆధారపడకూడదు. ఓవరాల్‌గా ఆటగాళ్లు ఎలా ఆడారనేదానిని పరిగణనలోకి తీసుకోవాలి. టీమ్‌ఇండియా కోచ్, కెప్టెన్, సెలెక్టర్లు పరిణతితో ఆలోచించాల్సిన అవసరం ఉంది’’ అని గంగూలీ తెలిపాడు. రోహిత్ శర్మ కూడా తొలుత ముంబయి ఇండియన్స్‌కు సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాతనే టీమ్‌ఇండియా కెప్టెన్‌గా నియమితులు కావడం విశేషం. కేఎల్ రాహుల్‌, శ్రేయస్ అయ్యర్, రిషభ్‌ పంత్‌లోని నాయకత్వ పటిమ కూడా ఐపీఎల్‌ ద్వారానే బయటపడింది. తాజాగా కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు నితీశ్‌ రాణాను ఆ ఫ్రాంచైజీ కెప్టెన్‌గా నియమించింది. గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్ దూరం కావడంతో కేకేఆర్‌ ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని