WTC Final: వారి ఆటతీరు.. టాప్‌ఆర్డర్‌కు గుణపాఠం: సౌరభ్‌ గంగూలీ

ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్ (WTC Final) మ్యాచ్‌లో భారత్‌కు సానుకూల ఫలితం రావాలంటే తప్పనిసరిగా బ్యాటర్లు రాణించాల్సిందే. భారీ లక్ష్యం నిర్దేశించినా ఏమాత్రం బెదరకుండా ఆడాలి.

Published : 10 Jun 2023 17:12 IST

ఇంటర్నెట్ డెస్క్: కీలకమైన ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) తొలి ఇన్నింగ్స్‌లో భారత టాప్‌ ఆర్డర్‌ ఘోరంగా విఫలమైంది. రవీంద్ర జడేజా (48), అజింక్య రహానె (89), శార్దూల్ ఠాకూర్ (51) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. శుభ్‌మన్‌ గిల్, రోహిత్ శర్మ, పుజారా, విరాట్ తక్కువ స్కోరుకే పెవిలియన్‌కు చేరారు. ఈ క్రమంలో భారత టాప్‌ ఆర్డర్‌ బ్యాటింగ్‌ తీరుపై మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఏడో వికెట్‌కు 109 పరుగులను జోడించిన రహానె, శార్దూల్‌ను చూసి టాప్‌ - 4 బ్యాటర్లు చూసి నేర్చుకోవాలని సూచించాడు. ఇది వారికి గుణపాఠంలాంటిదని పేర్కొన్నాడు. 

‘‘రహానె, శార్దూల్ ఆడిన తీరు అభినందనీయం. ఇలాంటి వికెట్‌ మీద ఎలా ఆడాలో భారత డ్రెస్సింగ్‌ రూమ్‌ తప్పనిసరిగా నేర్చుకోవాలి. రహానె సూపర్బ్‌గా ఆడాడు. శార్దూల్ గతంలోనూ ఇంగ్లాండ్, ఆసీస్‌పైనా అద్భుతంగా బ్యాటింగ్‌ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ 296 పరుగులు చేయడం వల్ల తిరిగి పోటీలో నిలబడేందుకు అవకాశం దక్కింది. అందుకే, రెండో ఇన్నింగ్స్‌లోనైనా భారత టాప్‌ ఆర్డర్‌ రాణించాలి’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

మూడో రోజు ఆట అద్భుతం: రవిశాస్త్రి

‘‘తొలి రెండు రోజులు ఇబ్బంది పడిన భారత ఆటగాళ్లు.. మూడో రోజు మాత్రం మంచి ప్రదర్శన చేశారు. తొలుత బ్యాటింగ్‌లో రహానె - శార్దూల్ భాగస్వామ్యం అద్భుతం. దీంతో భారత్‌ కూడా మెరుగైన తొలి ఇన్నింగ్స్‌ స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించారు. ఆసీస్‌ బ్యాటర్లను మరిన్ని పరుగులు చేయకుండా అడ్డుకోగలిగారు. ఇప్పటికైతే ఆసీస్‌ను ఆపినా.. భారత్‌ ఇంకాస్త కష్టపడాలి’’ అని రవిశాస్త్రి సూచించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని