Sourav Ganguly: రూట్‌.. ఆల్‌ టైమ్‌ గ్రేట్‌.. అభినందించిన గంగూలీ

ఇంగ్లాండ్‌ టెస్టు టీమ్‌ మాజీ సారథి జోరూట్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రత్యేకంగా అభినందించాడు. అతడు ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అని పొగడ్తలు కురిపించాడు...

Published : 06 Jun 2022 10:47 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ టెస్టు టీమ్‌ మాజీ సారథి జోరూట్‌ను బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ ప్రత్యేకంగా అభినందించాడు. అతడు ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ అని పొగడ్తలు కురిపించాడు. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన లార్డ్స్‌ టెస్టులో ఇంగ్లాండ్‌ ఓటమిపాలయ్యేస్థితిలో నిలవగా.. రూట్‌ ‌(115 నాటౌట్‌; 170 బంతుల్లో 12x4) శతకంతో మెరవడమే కాకుండా జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో 10 వేల పరుగుల మైలురాయి చేరుకున్నాడు. దీంతో ఇంగ్లాండ్‌ తరఫున ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. అంతకుముందు కుక్‌ ఈ రికార్డు నమోదు చేశాడు.

ఈ నేపథ్యంలోనే గంగూలీ ప్రత్యేకంగా ట్వీట్‌ చేసి రూట్‌ ఆటతీరును మెచ్చుకున్నాడు. ‘జోరూట్‌ ఎంత మంచి ఆటగాడు.. ఒత్తిడిలో కూడా ఎంతో బాగా ఆడాడు. అతడు ఆల్‌ టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక మ్యాచ్‌ అనంతరం రూట్‌ మాట్లాడుతూ.. చాలా కాలం తర్వాత తమ జట్టు టెస్టు మ్యాచ్‌ గెలవడం గొప్పగా ఉందన్నాడు. తాను సారథిగా ఉన్నప్పుడు బెన్‌స్టోక్స్‌ పలు మ్యాచ్‌లు గెలిపించాడని, ఇప్పుడు తాను అదే విధంగా అతడికి మ్యాచ్‌లు గెలిపించడం మంచి అవకాశంగా భావిస్తున్నట్లు చెప్పాడు. స్టోక్స్‌కు మించిన సారథి లేడు అని అన్నాడు. అలాగే తనకు శక్తి ఉన్నంతవరకూ పరుగులు చేస్తానని తెలిపాడు. కాగా, ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ 277 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఇంగ్లాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 69 పరుగులకే నాలుగు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో రూట్, స్టోక్స్‌ (54; 110 బంతుల్లో 5x4, 3x6) నిలకడగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని