Sourav Ganguly: దాదా కీలక వ్యాఖ్యలు.. ఐసీసీ ఛైర్మన్‌గిరీ వైపా..? రాజకీయాల్లోకా..?

బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ పదవి నుంచి దిగిపోవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ క్రమంలో తన భవిష్యత్‌ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. అలాగే తన కెప్టెన్సీపైనా స్పందించాడు.   

Published : 14 Oct 2022 01:42 IST

ఇంటర్నెట్ డెస్క్: వరుసగా రెండుసార్లు బీసీసీఐ అధ్యక్ష పదవిని చేపట్టే అవకాశం ఉన్నప్పటికీ.. ప్రస్తుత ప్రెసిడెంట్ సౌరభ్ గంగూలీ దిగిపోవడం ఖాయమైనట్లుగా తెలుస్తోంది. దాదా స్థానంలో అధ్యక్షుడిగా రోజర్‌ బిన్నీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి. బిన్నీ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేశారని, అక్టోబర్‌ 18న బాధ్యతలు స్వీకరిస్తాడని ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వెల్లడించిన విషయం తెలిసిందే.  ఈ క్రమంలో సౌరభ్ గంగూలీ బీసీసీఐ అత్యున్నత పదవిపై స్పందించాడు. ‘‘చాలా కాలంపాటు అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలోనే ఉన్నా. ఇప్పుడు వేరేదానికి వెళ్లాలని అనుకొంటున్నా’’ అని స్పష్టం చేశాడు. 

బీసీసీఐ అధ్యక్ష సహా ఇతర పదవులకు బుధవారమే నామినేషన్ల గడువు ముగిసింది. రోజర్‌ బిన్నీ మాత్రమే నామినేషన్‌ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. వీటిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ క్రమంలో గంగూలీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకొన్నాయి. ‘‘జీవితంలో ఇప్పటి వరకు చాలా మంచి రోజులు ఆస్వాదించాం. టీమ్‌ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం.. అలాగే బీసీసీఐ అధ్యక్షుడిగానూ చేయడం.. ఇంకా గొప్ప పనులు చేసేందుకు సిద్ధమవుతున్నా. మీరు ఎప్పటికీ ఆటగాడిగానూ.. పాలకుడిగానూ ఉండలేరు. ఈ రెండింటినీ చేయడం అద్భుతం. అయితే ఒక్క రోజులోనే అంబానీ లేదా నరేంద్ర మోదీ కాలేరు. సంవత్సరాలు కష్టపడితేనే ఆ స్థాయికి చేరుకొంటారు’’ అని వెల్లడించాడు. తన కెప్టెన్సీపైనా దాదా స్పందించాడు. ‘‘కేవలం నేను చేసిన పరుగులను మాత్రమే కాకుండా.. ఇతర విషయాలను కూడా అభిమానులు గుర్తు పెట్టుకొన్నారు. నాయకుడిగా జట్టును నడపించిన తీరు వారిని ఆకట్టుకొంది’’ అని గంగూలీ పేర్కొన్నాడు.  

టీమ్‌ఇండియాకు కెప్టెన్‌గా వ్యవహరించిన సౌరభ్ గంగూలీ.. ఆటకు వీడ్కోలు పలికిన తర్వాత పశ్చిమ్‌ బంగాల్‌ క్రికెట్ అసోషియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశాడు. ఆ తర్వాత ప్రపంచంలోనే అత్యంత విలువైన భారత క్రికెట్‌ బోర్డుకు ప్రెసిడెంట్‌గా వచ్చాడు. ఇప్పుడు అధ్యక్ష పదవి ముగిశాక గంగూలీ ఐసీసీ ఛైర్మన్‌గా వెళ్తాడని ప్రచారం సాగింది. లేకపోతే రెండోసారి బీసీసీఐ బాధ్యతలు స్వీకరిస్తాడని అంతా భావించారు. అనూహ్యంగా రోజర్‌ బిన్నీ బీసీసీఐ అధ్యక్ష రేసులో రావడం విశేషం. ఇప్పుడు మళ్లీ గంగూలీ వ్యాఖ్యల నేపథ్యంలో ఐసీసీ ఛైర్మన్‌గిరీ వైపు మళ్లతాడా..? రాజకీయాల్లోకి వస్తాడా..? అనేది చర్చనీయాంశంగా మారింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని