
T20 World Cup 2021: ఆ జట్టే ఛాంపియన్‌గా నిలుస్తుంది: సౌరభ్ గంగూలీ
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్‌లో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. వన్డే ప్రపంచకప్‌లో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన ఆస్ట్రేలియా, 2021 టెస్టు ఛాంపియన్ షిప్ విజేత న్యూజిలాండ్ టైటిల్ పోరులో తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రికెట్ ప్రపంచం ఆతృతగా ఎదురుచూస్తోంది. ఇందులో ఏ జట్టు గెలిచినా కొత్త ఛాంపియన్‌గా అవతరిస్తుంది. రెండు బలమైన జట్లే కావడంతో మ్యాచ్ రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది మాజీ క్రికెటర్లు, క్రికెట్ విశ్లేషకులు ఛాంపియన్‌గా నిలిచే జట్టుపై తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. ఆస్ట్రేలియానే ఫేవరెట్ అని మాజీ ఆటగాళ్లు సునీల్ గవాస్కర్, కెవిన్ పీటర్సన్, వసీమ్ అక్రమ్ పేర్కొన్నారు. భారత మాజీ సారథి, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. ఈ సారి న్యూజిలాండ్ ఛాంపియన్‌గా అవతరించే అవకాశముందని గంగూలీ పేర్కొన్నాడు.
‘ప్రపంచ క్రికెట్‌లో ఇది న్యూజిలాండ్ సమయమని భావిస్తున్నా. ఆస్ట్రేలియా గొప్ప దేశం. క్రికెట్‌లో ఆ దేశం ఎంతో ఉన్నతస్థాయికి చేరింది. కానీ, ఆ జట్టు కొంతకాలంగా ఒడుదొడుకులను ఎదుర్కొంటోంది. న్యూజిలాండ్ చాలా ధైర్యంగా ఆడుతోంది. కొన్ని నెలల క్రితం కివీస్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ విజేతగా నిలిచింది. అది చిన్న దేశమే అయినా చాలా బలమైన దేశం. న్యూజిలాండ్ కప్ గెలుస్తుందని భావిస్తున్నా ” అని గంగూలీ అన్నాడు. ఈ టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియా వైఫల్యం కావడంపై గంగూలీ స్పందించాడు. మొదటి రెండు మ్యాచ్‌ల్లో పేలవమైన ప్రదర్శనల వల్ల సెమీస్‌కు చేరకుండానే నిష్క్రమించిందని చెప్పాడు. రాబోయే సిరీస్‌లలో పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశాడు.
► Read latest Sports News and Telugu News