WTC Final: అదేం ఫీల్డింగ్‌.. రోహిత్ కెప్టెన్సీపై దాదా విసుర్లు!

ట్రావిస్‌ హెడ్ - స్టీవ్‌ స్మిత్ నాలుగో వికెట్‌కు 251 పరుగులను జోడించడంతో డబ్ల్యూటీసీ ఫైనల్‌ (WTC Final 2023) తొలి రోజు ఆటలో ఆసీస్‌ ఆధిక్యం సాధించింది. ట్రావిస్‌ హెడ్ సెంచరీతో దూసుకుపోతున్నాడు.

Updated : 08 Jun 2023 15:51 IST

ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్ (WTC Final 2023) తొలి రోజు ఆటలో భారత్‌పై ఆస్ట్రేలియా పైచేయి సాధించడానికి ఫీల్డింగ్‌ కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచింది. తొలి సెషన్‌లో మాత్రం మన బౌలర్లు ఆధిక్యత ప్రదర్శించారు. కానీ, ట్రావిస్‌ హెడ్ (146*) దూకుడుగా ఆడేశాడో భారత ఆటగాళ్లు నిరుత్సాహానికి గురయ్యారు. ఫీల్డింగ్‌ మోహరింపు కూడా ఏమాత్రం బాగోలేదనే వాదనా వచ్చింది. ఈ క్రమంలో టీమ్‌ఇండియా సారథి రోహిత్ శర్మ (Rohit Sharma) కెప్టెన్సీపైనా మరోసారి విమర్శలు వచ్చాయి. ఆసీస్‌ బ్యాటర్లు సునాయాసంగా పరుగులు సాధించినా... ఫీల్డింగ్ కూర్పు బాగాలేదని మాజీ కెప్టెన్ సౌరభ్‌ గంగూలీ (Sourav Ganguly) ఆక్షేపించాడు. అలాగే తుది జట్టు ఎంపికపైనా బాలీవుడ్ నటుడు హర్ష్‌వర్థన్ కపూర్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. 

‘‘టీమ్‌ఇండియా తీవ్రంగా నిరుత్సాహపరిచింది. ఆసీస్‌ 76/3 స్కోరుతో ఉన్నప్పుడు పైచేయి సాధించాల్సిన సమయంలో చేతులెత్తేసింది. ప్రత్యర్థి బ్యాటర్లు అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పారు. లంచ్‌ బ్రేక్‌ తర్వాత రెండోఓవర్‌లోనే వికెట్‌ సాధించిన భారత్‌ అనంతరం లయను కోల్పోయింది. ట్రావిస్‌ హెడ్ పరుగులు చేసేలా మన ఫీల్డింగ్‌ ఉంది. అలవోకగా హుక్‌ షాట్లు కొట్టాడు. అతడు మంచి ఫామ్‌లో ఉన్నాడని తెలుసు. మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. కానీ, కీలకమైన ఫైనల్‌లో 76/3 స్కోరు ఉన్నప్పుడు క్రీజ్‌లోకి వచ్చిన హెడ్‌ సులువుగా పరుగులు రాబట్టాడు. అతడు అలా చేసేలా కెప్టెన్ రోహిత్ శర్మ ఫీల్డింగ్‌ ప్లేస్‌మెంట్‌ సరిగా లేకపోవడమే కారణం’’ అని గంగూలీ వ్యాఖ్యానించాడు. 

పాజిటివ్‌ మైండ్‌ సెట్ ఉండుండే..: రవిశాస్త్రి

‘‘మన దృక్పథం పాజిటివ్‌గా ఉండుంటే టాస్‌ నెగ్గగానే బ్యాటింగ్‌ ఎంచుకునే వాళ్లం. అప్పుడు తొలి సెషన్‌ను జాగ్రత్తగా ఆడి మొదటి రోజు బోర్డు మీద 250 పరుగులు ఉంచినా చాలు మంచి స్థితిలో ఉండేవాళ్లం. అయితే, ఇప్పుడు ఆసీస్‌ పైచేయి సాధించింది. వారు అద్భుతంగా బ్యాటింగ్‌ చేశారు. తొలి రోజు మొదటి సెషన్‌లో ఇబ్బంది పడినా.. పుంజుకుని ఆడిన తీరు అభినందనీయం’’ అని రవిశాస్త్రి వ్యాఖ్యానించాడు.

టీమ్‌ సెలెక్షన్‌ దారుణం: బాలీవుడ్ నటుడు

‘‘డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌కు విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా లేకపోవడం తీవ్ర నిరుత్సాహం కలిగించింది. అతడు సారథిగా ఉన్నప్పుడు కనిపించిన దూకుడు ఇప్పుడు లేదు. రోహిత్ నాయకత్వంలో కనిపించడం లేదు. తుది జట్టు ఎంపిక కూడా దారుణంగా ఉంది. అశ్విన్‌ లేకపోవడం సరైంది కాదు. అలాగే, గాయం కారణంగా బుమ్రా దూరం కావడం కూడా భారీ నష్టమే’’ అని హర్ష్‌ వర్థన్‌ ట్వీట్ చేశాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని