Sourav Ganguly: రాజకీయాల్లోకి సౌరవ్‌ గంగూలీ..? దాదా ట్వీట్‌ వైరల్‌!

బీసీసీఐ అధ్యక్షుడు తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ రాజకీయ ఎంట్రీకి సంబంధించిందేనని వార్తలు గుప్పుముంటున్నాయి.......

Updated : 01 Jun 2022 18:26 IST

కోల్‌కతా: ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ రాజకీయాల్లోకి రాబోతున్నట్లు ఎప్పటినుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. కొద్దిరోజుల క్రితం భాజపాకు చెందిన కీలక నేతలు గంగూలీ ఇంటికి వెళ్లి ఆయనతో మంతనాలు జరపడం ఈ వార్తలకు బలం చేకూర్చాయి. పశ్చిమ బెంగాల్‌లోని అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ (టీఎంసీ) నేతలు సైతం గంగూలీతో టచ్‌లో ఉన్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. బీసీసీఐ అధ్యక్షుడు తాజాగా చేసిన ఓ ట్వీట్‌ వైరల్‌గా మారింది. ఆ ట్వీట్‌ రాజకీయ ఎంట్రీకి సంబంధించిందేనని వార్తలు గుప్పుముంటున్నాయి.

క్రీడా జీవితాన్ని ప్రారంభించి 30 ఏళ్లు గడిచాయని, ఇప్పుడు మరో కొత్త మార్గంలో నడవాలని ప్లాన్‌ చేసుకుంటున్నట్లు గంగూలీ ట్వీట్‌ చేశారు. ‘1992లో క్రీడా జీవితాన్ని ప్రారంభించాను. 2022 నాటికి 30 ఏళ్లు గడిచాయి. క్రికెట్‌ నాకు ఎంతో అందించింది. ముఖ్యంగా మీ ఆదరాభిమానాలు పొందగలిగాను. ఈరోజు ఈ స్థానంలో ఉండేందుకు నా వెన్నుతట్టిన, నాకు అండగా నిలిచిన, నాతోపాటు ఉన్న ప్రతిఒక్కరికి ధన్యవాదాలు. ప్రజలకు సహాయపడేలా ఇకపై ఏదైనా చేయాలని భావిస్తున్నా. ఈ కొత్త ప్రయాణంలో కూడా మీరు నాకు ఇలాగే మద్దతు ఇస్తారని భావిస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్‌గా వైరల్‌గా మారింది. గంగూలీ రాజకీయ ఎంట్రీ ఇవ్వనున్నట్లు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గంగూలీ రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ ఊహాగానాలు రావడంపై బీసీసీఐ సెక్రటరీ జై షా స్పందించారు. బీసీసీఐ అధ్యక్షుడిగా గంగూలీ ఇంకా రాజీనామా చేయలేదని వెల్లడించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని