సెమీస్‌లో దక్షిణాఫ్రికా

జట్టు ఎంత బలంగా ఉన్నా సరే.. అనవసరంగా ఒత్తిడికి గురికావడం, గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోవడం! దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ చరిత్ర ఇది. ముద్దుగా చోకర్స్‌ అన్న ముద్ర కూడా వేయించుకుంది.

Published : 25 Jun 2024 04:40 IST

ఉత్కంఠపోరులో విజయం
టీ20 ప్రపంచకప్‌ నుంచి వెస్టిండీస్‌ ఔట్‌ 
నార్త్‌సౌండ్‌

జట్టు ఎంత బలంగా ఉన్నా సరే.. అనవసరంగా ఒత్తిడికి గురికావడం, గెలవాల్సిన మ్యాచ్‌ల్లో ఓడిపోవడం! దక్షిణాఫ్రికా ప్రపంచకప్‌ చరిత్ర ఇది. ముద్దుగా చోకర్స్‌ అన్న ముద్ర కూడా వేయించుకుంది. ఈసారి మాత్రం భిన్నం. ఆ ముద్రనుచెరిపేసుకునే దిశగా దక్షిణాఫ్రికా గొప్ప ముందడుగు వేసింది. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడికి నిలుస్తూ వచ్చిన ఆ జట్టు.. తాజాగా సూపర్‌-8 మ్యాచ్‌లోనూ ఉత్కంఠలో నిలిచింది. వెస్టిండీస్‌ను ఓడించి సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. ఓటమితో విండీస్‌ ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

క్షిణాఫ్రికా జట్టు టీ20 ప్రపంచకప్‌ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. రసవత్తరంగా సాగిన వర్ష ప్రభావిత సూపర్‌-8 మ్యాచ్‌లో డక్‌వర్త్‌-లూయిస్‌ పద్ధతిలో 3 వికెట్ల తేడాతో వెస్టిండీస్‌పై గెలిచింది. షంసి (3/27) సూపర్‌ బౌలింగ్‌తో మొదట వెస్టిండీస్‌ 8 వికెట్లకు 135 పరుగులే చేయలిగింది. చేజ్‌ (52; 42 బంతుల్లో 3×4, 2×6) టాప్‌ స్కోరర్‌. మేయర్స్‌ (35; 34 బంతుల్లో 3×4, 2×6) రాణించాడు. యాన్సెన్‌ (1/17), మహరాజ్‌ (1/24), రబాడ (1/11), మార్‌క్రమ్‌ (1/28) కూడా కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేశారు. వర్షం కారణంగా దక్షిణాఫ్రికా లక్ష్యాన్ని 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్ణయించారు. స్వల్ప లక్ష్య ఛేదనలో తడబడిన దక్షిణాఫ్రికా 16.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయాన్నందుకుంది. స్టబ్స్‌ (29; 27 బంతుల్లో 4×4) టాప్‌ స్కోరర్‌. క్లాసెన్‌ (22; 10 బంతుల్లో 3×4, 1×6), యాన్సెన్‌ (21 నాటౌట్‌; 14 బంతుల్లో 1×4, 1×6) రాణించారు. షంసికి ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈ విజయంతో గ్రూప్‌-1లో దక్షిణాఫ్రికా అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లాండ్‌ రెండో స్థానంతో ముందంజ వేసింది. మూడు మ్యాచ్‌ల్లో ఒక్కటే నెగ్గిన వెస్టిండీస్‌ నిష్క్రమించింది.

ఉత్కంఠగా..: బ్యాటింగ్‌కు క్లిష్టంగా ఉన్న పిచ్‌పై మొదట వెస్టిండీస్‌ పరుగుల కోసం చెమటోడ్చింది. దక్షిణాఫ్రికా స్పిన్నర్లు షంసి, మహరాజ్, మార్‌క్రమ్‌ 12 ఓవర్లలో కేవలం 79 పరుగులే ఇచ్చి విండీస్‌ను దెబ్బతీయడంలో కీలక పాత్ర పోషించారు. విండీస్‌ 5 పరుగులకే హోప్, పూరన్‌ల వికెట్లు కోల్పోగా.. చేజ్, మేయర్స్‌ మూడో వికెట్‌కు 81 పరుగులు జోడించారు. ఈ భాగస్వామ్యం విడిపోయాక విండీస్‌ మళ్లీ... చకచకా వికెట్లు చేజార్చుకుని తక్కువ స్కోరుతో సరిపెట్టుకుంది. ఛేదనలో దక్షిణాఫ్రికా కూడా తడబడింది. 2 ఓవర్లలో 15 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. ఆ దశలో వర్షం కారణంగా గంట సేపు ఆట నిలిచిపోయింది. లక్ష్యాన్ని సవరించగా, మార్‌క్రమ్‌ (18)తో మూడో వికెట్‌కు 27 పరుగులు జోడించిన స్టబ్స్‌.. అతడు ఔటయ్యాక క్లాసెన్‌తో ఇన్నింగ్స్‌ను నడిపించాడు. క్లాసెన్‌ ఔటైనా ఆ జట్టు 12వ ఓవర్లో 93/4తో లక్ష్యం దిశగా సాఫీగానే సాగుతున్నట్లనిపించింది. కానీ ఏడు పరుగుల తేడాలో మిల్లర్‌ (4), స్టబ్స్‌ ఔట్‌ కావడంతో దక్షిణాఫ్రికా ఒత్తిడిలో పడింది. ఆ దశలో నిలబడ్డ యాన్సెన్‌.. మహరాజ్‌ (2)తో కలిసి స్ట్రైక్‌రొటేట్‌ చేశాడు. అయితే 16వ ఓవర్లో మహరాజ్‌ కూడా నిష్క్రమించడంతో దక్షిణాఫ్రికా 110/7తో నిలిచింది. చివరి ఏడు బంతుల్లో 9 పరుగులు చేయాల్సిన స్థితిలో రబాడ (5 నాటౌట్‌) ఫోర్‌ కొట్టడంతో దక్షిణాఫ్రికా ఊపిరిపీల్చుకుంది. 17వ ఓవర్‌ తొలి బంతికే మెకాయ్‌ బౌలింగ్‌లో యాన్సెన్‌ సిక్స్‌ బాదడంతో ఆ జట్టు విజయాన్నందుకుంది.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: మేయర్స్‌ (సి) స్టబ్స్‌ (బి) షంసి 35; హోప్‌ (సి) స్టబ్స్‌ (బి) యాన్సెన్‌ 0; పూరన్‌ (సి) యాన్సెన్‌ (బి) మార్‌క్రమ్‌ 1; చేజ్‌ (సి) రబాడ (బి) షంసి 52; పావెల్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) మహరాజ్‌ 1; రూథర్‌ఫోర్డ్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) షంసి 0; రసెల్‌ రనౌట్‌ 15; అకీల్‌ (సి) అండ్‌ (బి) రబాడ 6; అల్జారి జోసెఫ్‌ నాటౌట్‌ 11; మోటీ నాటౌట్‌ 4; ఎక్స్‌ట్రాలు 10 మొత్తం: (20 ఓవర్లలో 8 వికెట్లకు) 135; వికెట్ల పతనం: 1-2, 2-5, 3-86, 4-89, 5-94, 6-97, 7-117, 8-118; బౌలింగ్‌: యాన్సెన్‌ 2-0-17-1; మార్‌క్రమ్‌ 4-0-28-1; కేశవ్‌ మహరాజ్‌ 4-0-24-1; నోకియా 4-0-26-0; షంసి 4-0-27-3; రబాడ 2-0-11-1

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) రూథర్‌ఫోర్డ్‌ (బి) రసెల్‌ 12; హెండ్రిక్స్‌ (సి) పూరన్‌ (బి) రసెల్‌ 0; మార్‌క్రమ్‌ (సి) మేయర్స్‌ (బి) జోసెఫ్‌ 18; స్టబ్స్‌ (సి) మేయర్స్‌ (బి) చేజ్‌ 29; క్లాసెన్‌ (సి) పూరన్‌ (బి) జోసెఫ్‌ 22; మిల్లర్‌ (బి) చేజ్‌ 4; యాన్సెన్‌ నాటౌట్‌ 21; మహరాజ్‌ (సి) జోసెఫ్‌ (బి) చేజ్‌ 2; రబాడ నాటౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (16.1 ఓవర్లలో 7 వికెట్లకు) 124; వికెట్ల పతనం: 1-12,  2-15, 3-42, 4-77, 5-93, 6-100, 7-110; బౌలింగ్‌: అకీల్‌ 3-0-31-0; రసెల్‌ 4-0-19-2; అల్జారి 4-0-25-2; మోటీ 1-0-20-0; మెకాయ్‌ 1.1-0-15-0; చేజ్‌ 3-0-12-3

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని