వారికి జాతీయ జట్టులో స్థానం దక్కుతుందో లేదో నేనైతే చెప్పలేను: డీన్‌ ఎల్గర్‌

టీ20 లీగ్‌లో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై ఆ జట్టు టెస్టు సారథి...

Published : 12 Apr 2022 16:55 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 లీగ్‌లో ఆడుతున్న దక్షిణాఫ్రికా ఆటగాళ్లపై ఆ జట్టు టెస్టు సారథి డీన్‌ ఎల్గర్‌ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. బంగ్లాదేశ్‌తో రెండో టెస్టులో విజయం అనంతరం ఎల్గర్‌ మాట్లాడుతూ.. ‘‘వారంతా (టీ20 లీగ్‌లో పాల్గొన్న ఆటగాళ్లు) మళ్లీ జాతీయ జట్టులోకి వస్తారో లేదో నేనైతే చెప్పలేను. అది నా చేతుల్లో లేదు. ఉత్తమ క్రికెట్‌ను ఆడితే ఫలితం ఎప్పుడూ పాజిటివ్‌గానే ఉంటుంది. అంతేకాకుండా కెప్టెన్సీ కూడా చాలా సులువుగా మారుతుంది. గతేడాది (భారత్‌తో సిరీస్‌) నన్ను అర్థం చేసుకునే అద్భుతమైన ఆటగాళ్లు ఉండటంతో విజయం సాధించగలిగాం. అయితే ఈసారి సీనియర్లు టీ20 లీగ్‌ కోసం వెళ్లిపోయారు. అందుకే బంగ్లాదేశ్‌తో జరిగిన సిరీస్ ప్రత్యేకమైందిగా భావిస్తున్నా’’ అని పేర్కొన్నాడు. ఆగస్టులో ఇంగ్లాండ్‌ పర్యటనకు దక్షిణాఫ్రికా వెళ్లనుంది. ఈ క్రమంలో ఎల్గర్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

దక్షిణాఫ్రికాకు చెందిన కగిసో రబాడ, మార్కో జాన్‌సెన్‌, లుంగి ఎంగిడి, ఆన్రిచ్‌ నోకియా, రస్సీ వాన్‌ డర్‌ డస్సెన్, ఐదెన్‌ మార్‌క్రమ్‌ టీ20 లీగ్‌లో వేర్వేరు జట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ‘‘టీ20 లీగ్‌ కోసం వారంతా వెళ్లిపోయారు. దీంతో ఖాళీలు ఏర్పడ్డాయి. వారిని మళ్లీ తీసుకుంటారో లేదో వేచి చూడాలి’’ అని తెలిపాడు. కీలక ఆటగాళ్లు లేకపోయినప్పటికీ బంగ్లాతో రెండు టెస్టుల సిరీస్‌ను సౌతాఫ్రికా 2-0 తేడాతో కైవసం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని