ODI WC 2023: దమ్ముంది.. కానీ కలిసి రావాలి!

దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్‌.. దురదృష్టం.. ఈ మూడూ విడదీయలేని పదాలు.

Updated : 26 Sep 2023 09:57 IST

క్రికెట్‌ ప్రపంచకప్‌ మరో 9 రోజుల్లో
ఎవరి సత్తాఎంత?

దక్షిణాఫ్రికా.. ప్రపంచకప్‌.. దురదృష్టం.. ఈ మూడూ విడదీయలేని పదాలు. ద్వైపాక్షిక సిరీస్‌ల్లో అదరగొట్టి మంచి అంచనాలతో ప్రపంచకప్‌లో అడుగు పెట్టే ఆ జట్టు.. అక్కడ మాత్రం సత్తా చాటలేకపోతుంటుంది. కొన్నిసార్లు చేజేతులా ఓటమి కొనితెచ్చుకుంటుంది. కొన్నిసార్లు దురదృష్టం వెంటాడుతుంది. ఎలాగైనా సరే.. మధ్యలో ఆ జట్టు ప్రయాణం ఆగిపోవడం మామూలే! ఈసారి ఆ జట్టుపై మరీ అంచనాలేమీ లేవు.  అండర్‌డాగ్‌లా కప్పులో అడుగు పెడుతున్న సఫారీ జట్టు ఈసారి ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ఈనాడు క్రీడావిభాగం

అది 1992 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్‌-దక్షిణాఫ్రికా మధ్య సెమీస్‌ పోరు. 13 బంతుల్లో 22 పరుగులు చేస్తే దక్షిణాఫ్రికా గెలుస్తుంది. అప్పుడే వర్షం వల్ల మ్యాచ్‌ ఆగింది. తిరిగి ఆట మొదలవగానే తెరమీద గెలుపు సమీకరణం కనిపించింది. సఫారీ జట్టు 1 బంతిలో 22 పరుగులు చేయాలి. డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో సమీకరణం ఇలా మారిపోగానే అందరిలో విస్మయం. ఇంకేముంది.. దక్షిణాఫ్రికా దిగ్భ్రాంతికర రీతిలో ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది. ఆ తర్వాత కూడా ప్రపంచకప్‌ల్లో కొన్నిసార్లు ఆ జట్టును ఇలాగే దురదృష్టం వెంటాడింది. ప్రపంచకప్‌కు ముందు సఫారీలపై మంచి అంచనాలు ఏర్పడ్డా.. టోర్నీలో చతికిలపడటం ఆ జట్టుకు అలవాటే. అయితే కొంత కాలంగా సఫారీ జట్టు వరుసగా సిరీస్‌లు ఓడుతుండటంతో భారత్‌ ఆతిథ్యమిచ్చే 2023 ప్రపంచకప్‌లో దానిపై పెద్దగా అంచనాలు లేవు. అలా అని ఆ జట్టును తక్కువ అంచనా వేయలేం.

బలాలు: కాగితం మీద చూస్తే దక్షిణాఫ్రికా బలంగానే కనిపిస్తోంది. డికాక్‌ మేటి బ్యాటర్‌ అని అందరికీ తెలుసు. మార్‌క్రమ్‌ కూడా భారీ ఇన్నింగ్స్‌లు ఆడగలడు. బంతితోనూ ఉపయోగపడతాడు. ఇటీవలే ఆస్ట్రేలియాపై విధ్వంసక శతకం బాదిన క్లాసెన్‌ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపాడు. ఇంకా బ్యాటింగ్‌లో వాండర్‌డసెన్‌, మిల్లర్‌ లాంటి మ్యాచ్‌ విన్నర్లున్నారు. బౌలింగ్‌లో రబాడ, ఎంగిడి లాంటి ప్రపంచ స్థాయి బౌలర్లు సఫారీ జట్టు సొంతం. స్పిన్నర్లు షంసి, కేశవ్‌ భారత పిచ్‌లను బాగా ఉపయోగించుకోగల సమర్థులు. మార్కో జాన్సన్‌ లాంటి నాణ్యమైన ఆల్‌రౌండర్‌ కూడా ఆ జట్టులో ఉన్నాడు. ఆ జట్టు బలం తక్కువేమీ కాదు.

బలహీనతలు: ప్రపంచకప్‌ అనగానే దక్షిణాఫ్రికా ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. కీలక సమయాల్లో చేతులెత్తేసి మ్యాచ్‌లు చేజార్చుకుంటుంది. ప్రపంచకప్‌ భారత్‌లో జరగనుండటం ఆ జట్టుకు ప్రతికూలమే. గతంతో పోలిస్తే స్పిన్‌ ఆడటంలో ఆ జట్టు బ్యాటర్లు మెరుగు పడ్డప్పటికీ.. పూర్తిగా ఆ బలహీనతను అధిగమించలేదు. కెప్టెన్‌ బవుమా నిలకడ లేమి మరో సమస్య. ప్రపంచకప్‌లో అతనెలా ఆడతాడో చూడాలి. జట్టును సమష్టిగా నడిపించడంలో బవుమా విజయవంతం కాలేకపోతున్నాడు. మరి ఈ ప్రతికూలతల మధ్య సఫారీ జట్టు ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

ప్రపంచకప్‌ ప్రదర్శన: 1992, 1999, 2007, 2015లో సెమీస్‌

కీలక ఆటగాళ్లు: మార్‌క్రమ్‌, డికాక్‌, క్లాసెన్‌, షంసి, రబాడ.

జట్టు: బవుమా (కెప్టెన్‌), డికాక్‌, రీజా హెండ్రిక్స్‌, వాండర్‌డసెన్‌, మార్‌క్రమ్‌, క్లాసెన్‌, మిల్లర్‌, మార్కో జాన్సన్‌, లుక్వాయో, కొయెట్జీ, కేశవ్‌ మహరాజ్‌, షంసి, ఎంగిడి, రబాడ, లిజార్డ్‌ విలియమ్స్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని