icc mens t20 world cup: నేపాల్‌ ఒక్క పరుగు తేడాతో..

టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్‌ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్‌పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది.

Updated : 16 Jun 2024 05:09 IST

దక్షిణాఫ్రికాపై పోరాడి ఓడిన పసికూన

టీ20 ప్రపంచకప్‌లో మరో సంచలనం కొద్దిలో తప్పింది. కూనల చేతిలో షాక్‌ తిన్న జట్ల జాబితాలో దక్షిణాఫ్రికా కూడా చేరేదే. నేపాల్‌పై ఆ జట్టు ఒక్క పరుగు తేడాతో అతికష్టంగా గట్టెక్కింది. స్ఫూర్తిదాయక ప్రదర్శన చేసిన నేపాల్‌.. ఓ గొప్ప అవకాశాన్ని చేజార్చుకుంది. ఆఖరి బంతికి రెండు పరుగులు చేయాల్సివుండగా.. ఒక్క పరుగూ తీయలేకపోయింది. 

కింగ్స్‌టౌన్‌

నేపాల్‌ టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాను ఓడించినంత పని చేసింది. శనివారం ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ (గ్రూప్‌-డి)లో దక్షిణాఫ్రికా ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న టర్నింగ్‌ పిచ్‌పై మొదట దక్షిణాఫ్రికా పరుగుల కోసం చెమటోడ్చింది. 7 వికెట్లకు 115 పరుగులే చేయగలిగింది. హెండ్రిక్స్‌ (43; 49 బంతుల్లో 5×4, 1×6) టాప్‌ స్కోరర్‌. స్టబ్స్‌ (27 నాటౌట్‌; 18 బంతుల్లో 2×4, 1×6) రాణించాడు. కుశాల్‌ భుర్తెల్‌ (4/19), దీపేంద్ర సింగ్‌ (3/21) దక్షిణాఫ్రికాకు కళ్లెం వేశారు. స్వల్ప లక్ష్య ఛేదనలో నేపాల్‌ 7 వికెట్లకు 114 పరుగులే చేసింది. ఆసిఫ్‌ షేక్‌ (42; 49 బంతుల్లో 4×4, 1×6) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. అనిల్‌ సాహ్‌ (27) రాణించాడు. షంసి (4/19) నేపాల్‌ పతనాన్ని శాసించాడు. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన దక్షిణాఫ్రికా, అగ్రస్థానంతో గ్రూప్‌ దశను ముగించింది. నేపాల్‌ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ పరాజయంపాలైంది.

విజయం నేపాల్‌ చేజారిందిలా..: ఛేదనను జాగ్రత్తగా ఆరంభించిన నేపాల్‌ పవర్‌ ప్లే ముగిసేసరికి వికెట్‌ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. ఆ తర్వాత వెంటవెంటనే రెండు వికెట్లు పడ్డా.. అనిల్‌ షాతో కలిసి ఆసిఫ్‌ షేక్‌ ఇన్నింగ్స్‌ను నడిపించడంతో 13 ఓవర్లు ముగిసే సరికి 82/2తో నిలిచింది. షా ఔటైనా.. చివరి నాలుగు ఓవర్లలో 21 పరుగులు చేయాల్సిన స్థితిలో దక్షిణాఫ్రికాకు షాకిచ్చేలా కనిపించింది నేపాల్‌. గెలిస్తే ఓ ఐసీసీ శాశ్వత సభ్య దేశంపై ఆ జట్టుకు ఇది తొలి విజయమయ్యేది. ఆ జట్టు సమీకరణం 18 బంతుల్లో 18 పరుగులకు మారింది. కానీ 18వ ఓవర్లో రెండు పరుగులే ఇచ్చిన షంసి.. దీపేంద్ర (6), ఆసిఫ్‌ షేక్‌లను ఔట్‌ చేయడం, ఆ తర్వాతి ఓవర్లో నోకియా తొలి నాలుగు బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వకుండా ఒక వికెట్‌ పడగొట్టడంతో సమీకరణం మారిపోయింది. నేపాల్‌ లక్ష్యం క్లిష్టమైంది. కానీ 19వ ఓవర్‌ చివరి రెండు బంతుల్లో సోంపాల్‌ కమి (8 నాటౌట్‌) వరుసగా 6, 2తో ఆ జట్టును వేటలో నిలిపాడు. ఆఖరి ఓవర్లో (బార్ట్‌మన్‌) ఎనిమిది పరుగులు చేయాల్సిన స్థితిలో నేపాల్‌కు మంచి అవకాశమే ఉంది. కానీ తొలి రెండు బంతుల్లో గుల్షాన్‌ పరుగులు తీయలేకపోయాడు. కానీ మూడో బంతికి ఫోర్‌ కొట్టాడు. ఆ తర్వాతి బంతికి రెండు తీశాడు. ఆఖరి రెండు బంతుల్లో నేపాల్‌కు రెండు పరుగులు అవసరం కాగా.. అయిదో బంతికి ఒక్క పరుగూ రాలేదు. ఆఖరి బంతికి గుల్షాన్‌ రనౌట్‌ కావడంతో నేపాల్‌ గుండె పగిలింది. ఆ జట్టు ఆటగాళ్లు, అభిమానులు కన్నీటిపర్యంతమయ్యారు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: హెండ్రిక్స్‌ (సి) అండ్‌ (బి) దీపేంద్ర 43; డికాక్‌ (సి) అండ్‌ (బి) దీపేంద్ర 10; మార్‌క్రమ్‌ (బి) భుర్తెల్‌ 15; క్లాసెన్‌ (సి) కరణ్‌ (బి) భుర్తెల్‌ 3; మిల్లర్‌ (సి) లమిచానె (బి) దీపేంద్ర 7; స్టబ్స్‌ నాటౌట్‌ 27; యాన్సెన్‌ (సి) సాహ్‌ (బి) భుర్తెల్‌ 1; రబాడ (స్టంప్డ్‌) ఆసిఫ్‌ (బి) భుర్తెల్‌ 0; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు) 115; వికెట్ల పతనం: 1-22, 2-68,  3-74, 4-82, 5-97, 6-115, 7-115; బౌలింగ్‌: సోంపాల్‌ 2-1-6-0; దీపేంద్ర 4-0-21-3; కరణ్‌ 1-0-9-0; కుశాల్‌ మల్లా 2-0-17-0; లమిచానె 4-0-18-0; కుశాల్‌ భుర్తెల్‌ 4-0-19-4; అబినాష్‌ 3-0-19-0

నేపాల్‌ ఇన్నింగ్స్‌: కుశాల్‌ భుర్తెల్‌ (బి) షంసి 13; ఆసిఫ్‌ షేక్‌ (బి) షంసి 42; రోహిత్‌ (బి) షంసి 0; అనిల్‌ సాహ్‌ (సి) యాన్సెన్‌ (బి) మార్‌క్రమ్‌ 27; దీపేంద్ర (సి) డికాక్‌ (బి) షంసి 6; కుశాల్‌ మల్లా (బి) నోకియా 1; గుల్షన్‌ ఝా రనౌట్‌ 6; సోంపాల్‌ కమి నాటౌట్‌ 8; ఎక్స్‌ట్రాలు 11 మొత్తం: (20 ఓవర్లలో 7 వికెట్లకు 114; వికెట్ల పతనం: 1-35, 2-35, 3-85, 4-99, 5-100, 6-100, 7-114; బౌలింగ్‌: యాన్సెన్‌ 4-0-16-0; రబాడ 2-0-17-0; బార్ట్‌మన్‌ 4-0-20-0; నోకియా 4-0-27-1; షంసి 4-0-19-4; మార్‌క్రమ్‌ 2-0-8-1

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని