T20 Worldcup 2024: ఒక్క పరుగుతో ఓటమి.. నేపాల్‌ ఆశలను కూల్చేసిన సఫారీలు

T20 Worldcup 2024: టీ20 ప్రపంచకప్‌ నుంచి నేపాల్ నిష్క్రమించింది. నరాలు తెగే ఉత్కంఠ పోరులో కేవలం ఒకే ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో ఆ జట్టు ఓటమిపాలైంది. 

Updated : 15 Jun 2024 10:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సంచలనాలకు వేదికైన పొట్టి ప్రపంచకప్‌ టోర్నీ (T20 Worldcup 2024)లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌ జరిగింది. నేపాల్‌ ‘సూపర్‌-8’ ఆశలను దక్షిణాఫ్రికా (NEP vs SA) కేవలం ఒకే ఒక్క పరుగుతో కూల్చేసింది. చివరివరకు ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో ఒక్క పరుగు తేడాతో సఫారీ జట్టు విజయం సాధించింది. దీంతో ముక్కలైన హృదయంతో నేపాల్‌ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా (South Africa) 20 ఓవర్లకు 7 వికెట్లు నష్టపోయి 115 పరుగులు సాధించింది. స్వల్ప లక్ష్యంతో ఛేదనకు దిగిన నేపాల్‌ (Nepal) ఇన్నింగ్స్‌ను దూకుడుగానే ఆరంభించింది. 8వ ఓవర్‌లో సఫారీ బౌలర్‌ షంసీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి ఆ జట్టును దెబ్బకొట్టాడు. ఆ తర్వాత నేపాల్‌ పటిష్టస్థితిలోనే ఉండి విజయానికి చేరువైనట్లే కన్పించింది. అప్పుడు మళ్లీ బంతి అందుకున్న షంసీ.. 18వ ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు.

కోహ్లి జోరు అందుకునేనా..

చివరి ఓవర్‌లో 8 పరుగులు అవసరం కాగా మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. తీవ్ర ఒత్తిడిలోనూ దక్షిణాఫ్రికా బౌలర్‌ బార్ట్‌మన్‌ నేపాల్‌ బ్యాటర్లను కట్టడి చేశాడు. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. గుల్సాన్‌ ఝాను ఔట్‌ చేశాడు. దీంతో ఒక్క పరుగు తేడాతో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో నేపాల్‌ గెలిస్తే సూపర్‌-8 రేసులో నిలబడేది. ఓటమి పాలవడంతో టోర్నీ నుంచి తిరుగుముఖం పట్టింది. సఫారీ బౌలర్‌ షంసీ ‘మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’గా నిలిచాడు.

న్యూజిలాండ్‌కు తొలి గెలుపు..

ఇక ఈ టోర్నీలో న్యూజిలాండ్‌కు తొలి విజయం లభించింది. గ్రూప్‌ దశలో పసికూన ఉగాండాతో జరిగిన మ్యాచ్‌లో కివీస్‌ సేన 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఉగాండా 40 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఈ అత్యల్ప లక్ష్యాన్ని న్యూజిలాండ్‌ జట్టు 5 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి ఛేదించింది. అయితే, ఈ మ్యాచ్‌లో గెలుపొందినా కివీస్‌ సూపర్‌-8 చేరుకునే అవకాశాలు లేవు. గ్రూప్‌-సిలో అఫ్గానిస్థాన్‌, వెస్టిండీస్‌ ఆరు పాయింట్లతో ముందుండటంతో కివీస్‌ ఇంటిదారి పట్టింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని