SA vs WI: ఆతిథ్య విండీస్‌ ఇంటికి.. దక్షిణాఫ్రికా సెమీస్‌కి

ఆతిథ్య దేశాలకు చుక్కెదురైంది. తొలుత యూఎస్‌ఏ ఇంటిముఖం పట్టగా.. తాజాగా విండీస్‌ కూడా టీ20 ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించింది.

Updated : 24 Jun 2024 11:05 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup 2024) సూపర్‌-8 గ్రూప్‌2 నుంచి సెమీస్‌కు చేరిన జట్లేవో తేలిపోయాయి. తొలుత యూఎస్‌ఏపై విజయం సాధించిన ఇంగ్లాండ్‌ ఒక బెర్తును దక్కించుకోగా.. తాజాగా ఆతిథ్య వెస్టిండీస్‌ను చిత్తు చేసి దక్షిణాఫ్రికా (SA vs WI) అగ్రస్థానంతో సెమీస్‌కు దూసుకెళ్లింది. దీంతో రెండు ఆతిథ్యదేశాలు ఇంటిముఖం పట్టడం గమనార్హం. సెమీస్‌లో (Semi Finals) ఏ జట్టు ఎవరితో ఢీకొట్టనుందనే విషయం ఇవాళ జరిగే భారత్‌-ఆసీస్‌, అఫ్గాన్‌-బంగ్లాదేశ్‌ మ్యాచులతో తేలనుంది.

స్వల్ప స్కోరే అయినా.. 

సెమీస్‌కు దూసుకెళ్లాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో విండీస్‌ (West Indies) చివరివరకూ పోరాడింది. కానీ, దక్షిణాఫ్రికా కూడా పట్టు వదలకుండా విజయం సాధించింది. విండీస్‌ నిర్దేశించిన 136 పరుగుల లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా ఇబ్బంది పడింది.  వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్‌ను 17 ఓవర్లకు కుదించి టార్గెట్‌ను 124 పరుగులుగా నిర్దేశించారు. చివరికి 16.1 ఓవర్లలో ఏడు వికెట్లను కోల్పోయి సఫారీల జట్టు విజయం సాధించింది. స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు డికాక్ (12), హెడ్రిక్స్ (0) వికెట్లను కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ (29), క్లాసెన్ (22), మార్కో ఎన్‌సెన్ (21*), మార్‌క్రమ్ (18) తలో చేయి వేసి లక్ష్యాన్ని ఛేదించారు. చివరి ఓవర్‌లో ఐదు పరుగులు అవసరమైన సమయంలో.. రబాడ సిక్స్‌తో మ్యాచ్‌ను ముగించాడు. రోస్టన్ ఛేజ్ బౌలింగ్‌లోనూ మెరిశాడు. మూడు వికెట్లు తీసి దక్షిణాఫ్రికాపై ఒత్తిడి తెచ్చాడు. ఆండ్రి రస్సెల్ (2/19), అల్జారీ జోసెఫ్‌ (2/25) కట్టుదిట్టంగా బంతులేశారు.

ఛేజ్‌ హాఫ్ సెంచరీ.. 

తొలుత బ్యాటింగ్‌ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. రోస్టన్ ఛేజ్‌ (52) హాఫ్ సెంచరీతోపాటు కేల్ మయేర్స్‌ (35) విలువైన పరుగులు సాధించాడు. దక్షిణాఫ్రికా (South Africa) బౌలర్లలో షంసీ 3 వికెట్లు తీయగా.. మార్కో ఎన్‌సెన్, మార్‌క్రమ్, కేశవ్ మహరాజ్‌, రబాడ తలో వికెట్ తీశారు. మిగతా బ్యాటర్లు పెద్దగా పరుగులు చేయకపోవడంతో విండీస్‌ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా షంసీ నిలిచాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని