T20 Wolrd Cup 2024: శ్రీలంకకు షాక్‌ ఇచ్చిన వరుణుడు.. సూపర్‌-8కు చేరిన దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా

టీ20 ప్రపంచకప్‌ 2024లో గ్రూప్‌ డి నుంచి దక్షిణాఫ్రికా, గ్రూప్‌ బి నుంచి ఆస్ట్రేలియా సూపర్‌-8 దశకు అర్హత సాధించాయి. 

Updated : 12 Jun 2024 19:18 IST

ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్‌ 2024లో శ్రీలంక లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టనుంది! గ్రూప్‌ డిలో ఉన్న శ్రీలంక.. దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌తో జరిగిన మొదటి రెండు మ్యాచ్‌ల్లో  ఓడింది. నేడు నేపాల్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో నెగ్గి సూపర్‌-8 రేసులో నిలవాలనుకున్న శ్రీలంక ఆశలపై వరుణుడు నీళ్లు చల్లాడు. ఫ్లోరిడాలో జరగాల్సిన ఆ మ్యాచ్‌ వర్షం కారణంగా టాస్‌ పడకుండానే రద్దయింది. కనీసం ఐదు ఓవర్ల ఆటను నిర్వహించాలనుకున్నా సాధ్యపడలేదు. చివరకు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. దీంతో గ్రూప్‌ డిలో మూడు విజయాలు సాధించి 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్న దక్షిణాఫ్రికా సూపర్‌-8కు అర్హత సాధించింది. 

గ్రూప్‌ బిలో సూపర్‌-8కు అర్హత సాధించిన తొలి జట్టుగా ఆస్ట్రేలియా నిలిచింది. ఇవాళ ఆంటిగ్వాలోని నార్త్‌సౌండ్‌లో నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో ఆసీస్‌ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత కంగారుల బౌలింగ్ ధాటికి నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకే కుప్పకూలింది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36), మైఖేల్ వాన్ లింగేన్ (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. మిగతా బ్యాటర్లు ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా (4/12) అదరగొట్టగా.. హేజిల్ వుడ్ 2, స్టాయినిస్‌ 2, కమిన్స్‌, నాథన్ ఎలిస్ తలో వికెట్ పడగొట్టారు. ఈ లక్ష్యాన్ని ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి ఛేదించింది. దీంతో మరో మ్యాచ్‌ మిగిలుండగానే 6 పాయింట్లతో ఆస్ట్రేలియా సూపర్‌-8కు చేరింది. ఈ గ్రూప్‌లోని నమీబియా (3 మ్యాచ్‌లు ఒక విజయం), ఒమన్‌ (3 మ్యాచ్‌లు 3 ఓటములు) లీగ్‌ దశలోనే ఇంటిముఖం పట్టనున్నాయి. ఈ గ్రూప్‌ నుంచి  స్కాట్లాండ్‌ రెండో జట్టుగా సూపర్‌-8కు చేరే అవకాశముంది. ప్రస్తుతం ఆ జట్టు మూడు మ్యాచ్‌లు ఆడి ఐదు పాయింట్లతో ఉంది.

డిఫెండింగ్ ఛాంపియన్‌ లీగ్‌ దశలోనే? 

గ్రూప్‌ బిలో ఉన్న డిఫెండింగ్ ఛాంపియన్‌ ఇంగ్లాండ్‌ ఈసారి లీగ్‌ దశలోనే టోర్నీ నుంచి నిష్ర్కమించేలా కనిపిస్తోంది. ఇప్పటివరకు రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లిష్‌ జట్టు ఒక దాంట్లో పరాజయం పాలవగా.. మరో మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దయింది. ఇంగ్లాండ్ సూపర్‌-8కు చేరాలంటే తప్పకుండా మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో (ఒమన్, నమీబియాతో) భారీ తేడాతో గెలవాలి. దాంతోపాటు స్కాట్లాండ్ తన చివరి మ్యాచ్‌ (ఆస్ట్రేలియాతో) ఓడిపోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని