INDw Vs SAw: భారత్‌ జోరుకు కళ్లెం

దక్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్‌ఇండియాను ఓడించింది.

Updated : 06 Jul 2024 03:59 IST

తొలి టీ20 దక్షిణాఫ్రికా సొంతం
రాణించిన బ్రిట్స్, కాప్‌ రాణించిన బ్రిట్స్, కాప్‌ 
చెన్నై

దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. ఏకైక టెస్టులో ఘన విజయం సాధించిన భారత మహిళల జట్టుకు మూడు టీ20ల సిరీస్‌లో ఊహించని ఆరంభం. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టిన సఫారీ జట్టు హర్మన్‌ప్రీత్‌ బృందానికి ఝలక్‌ ఇచ్చింది. అదిరే ఆటతో తొలి టీ20 గెలిచి సిరీస్‌లో ఆధిక్యంలో నిలిచింది. 

క్షిణాఫ్రికా మహిళల జట్టు సత్తా చాటింది. దూకుడుగా ఆడి భారత పర్యటనలో తొలి విజయాన్ని అందుకుంది. శుక్రవారం మొదటి టీ20లో సఫారీ జట్టు 12 పరుగుల తేడాతో టీమ్‌ఇండియాను ఓడించింది. మొదట దక్షిణాఫ్రికా 189/4 స్కోరు చేసింది. టాజ్మిన్‌ బ్రిట్స్‌ (81; 56 బంతుల్లో 10×4, 3×6) టాప్‌ స్కోరర్‌. మరిజేన్‌ కాప్‌ (57; 33 బంతుల్లో 8×4, 1×6) సత్తా చాటింది. ఛేదనలో జెమిమా రోడ్రిగ్స్‌ (53 నాటౌట్‌; 30 బంతుల్లో 7×4, 1×6), స్మృతి మంధాన (46; 30 బంతుల్లో 7×4, 2×6) రాణించినా జట్టును గెలిపించలేకపోయారు. టీమ్‌ఇండియా 177/4కే పరిమితమైంది.

మెరుపులా ఆరంభించినా..: ఛేదనలో భారత్‌ ఇన్నింగ్స్‌ ఆరంభమైన తీరు చూస్తే తేలిగ్గా గెలుస్తుందేమో అనిపించింది. షెఫాలివర్మ (14 బంతుల్లో 18)తో కలిసి స్మృతి మంధాన దూకుడుగా ఆడింది. ఈ సిరీస్‌లో టాప్‌ ఫామ్‌లో ఉన్న స్మృతి.. పవర్‌ప్లేలో చక్కని షాట్లతో స్కోరు పెంచింది. ఈ జోడీ తొలి వికెట్‌కు 5.2 ఓవర్లలోనే 56 పరుగులు జత చేసి బలమైన ఆరంభాన్ని ఇచ్చింది. అయితే 9.5 ఓవర్లకు 87/1తో ఉన్న టీమ్‌ఇండియా తడబడి 87/3తో ఇబ్బందుల్లో పడింది. ఈ స్థితిలో కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (35; 29 బంతుల్లో 5×4)తో కలిసి జెమీమా స్కోరు పెంచింది. కానీ మధ్య ఓవర్లలో కట్టుదిట్టంగా బంతులు వేసిన దక్షిణాఫ్రికా బౌలర్లు భారత బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. సాధించాల్సిన రన్‌రేట్‌ పెరిగిపోయింది. 15 ఓవర్లకు భారత్‌ స్కోరు 125/3. ఈ దశలో జెమీమా, హర్మన్‌ప్రీత్‌ కొన్ని షాట్లు ఆడినా సాధించాల్సిన రన్‌రేట్‌ను అదుపులో ఉంచలేకపోయారు. చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి రాగా.. హర్మన్‌ప్రీత్‌ వికెట్‌ కోల్పోయిన భారత్‌ 8 పరుగులే సాధించింది. ఖకా (1/39), ట్రయాన్‌ (1/32), డిక్లెర్క్‌ (1/30), ఎంలబా (1/32) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అంతకుముందు దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో బ్రిట్స్‌ ఆటే హైలైట్‌. ఇన్నింగ్స్‌కు ఇరుసులా నిలిచిన ఆమె.. మరిజేన్‌ కాప్, వోల్వార్డ్‌ (33) సాయంతో జట్టుకు భారీ స్కోరు అందించింది. బ్రిట్స్‌ అందించిన సులభమైన క్యాచ్‌ను రిచా ఘోష్‌ వదిలేయడం దక్షిణాప్రికాకు మేలు చేసింది. భారత బౌలర్లలో పూజ (2/23), రాధ (2/40) రాణించారు.

సంక్షిప్త స్కోర్లు...

దక్షిణాఫ్రికా: 189/4 (బ్రిట్స్‌ 81, కాప్‌ 57, లారా వోల్వార్డ్‌ 33; పూజ 2/23, రాధ 2/40)
భారత్‌: 177/4 (జెమీమా 53 నాటౌట్, స్మృతి 46, హర్మన్‌ప్రీత్‌ 35; డిక్లెర్క్‌ 1/30, ట్రయాన్‌ 1/32)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని