IND vs SA : మంచి ప్రదర్శన ఇవ్వకపోతే.. ఇషాంత్‌కూ అదే చివరి సిరీస్!

 రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనతో పలువురి టీమ్ఇండియా సీనియర్‌ ఆటగాళ్ల ...

Published : 12 Dec 2021 01:27 IST

రహానె, పుజారాతోపాటు లంబుకు తప్పని గండం

ఇంటర్నెట్‌ డెస్క్: రాబోయే దక్షిణాఫ్రికా పర్యటనతో పలువురి టీమ్ఇండియా సీనియర్‌ ఆటగాళ్ల భవితవ్యం తేలనుంది. ఇప్పటికే ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అజింక్య రహానె, ఛెతేశ్వర్‌ పుజారాలకు ఇంకో అవకాశం వచ్చింది. అయితే వీరిద్దరితోపాటు మరొక  క్రికెటర్‌ ఇబ్బంది పడుతున్నాడు. అతడే పొడగరి బౌలర్‌ ఇషాంత్‌ శర్మ. అందరూ ముద్దుగా లంబు అని పిలుచుకునే ఇషాంత్‌ గత కొంతకాలంగా బౌలింగ్‌లో సరైన లయను దొరకబుచ్చుకోవడంలో విఫలమవుతున్నాడు. మరోవైపు యువ బౌలర్ల నుంచి విపరీతమైన పోటీ నెలకొంది. కివీస్‌తో టెస్టు సిరీస్‌ సందర్భంగానూ రాణించని ఇషాంత్‌కు దక్షిణాఫ్రికా సిరీస్‌కు అవకాశం దక్కదని చాలా మంది అంచనా వేశారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ సెలెక్షన్‌ కమిటీ ఇషాంత్‌కు చోటు కల్పించింది. ఈ సారైనా రాణించకపోతే మాత్రం జట్టులో స్థానం గల్లంతే.

ఇప్పటికే అజింక్య రహానెను వైస్ కెప్టెన్సీ నుంచి తప్పించిన బీసీసీఐ.. సీనియర్లకు గట్టి హెచ్చరిక జారీ చేసినట్లేనని క్రీడా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి వచ్చే దక్షిణాఫ్రికా సిరీస్‌లో తుది జట్టులో స్థానం దక్కితే మాత్రం ఇషాంత్‌ శర్మ మంచి ప్రదర్శన ఇవ్వాలి. మహమ్మద్‌ షమీ, జస్ఫ్రీత్‌ బుమ్రా, ఉమేశ్ యాదవ్‌ స్థానాలకు ప్రస్తుతానికైతే ఎలాంటి ఢోకా లేదు. మహమ్మద్‌ సిరాజ్‌, సైని, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్‌ ఠాకూర్‌, దీపక్‌ చాహర్, హర్షల్‌ పటేల్‌, అవేశ్‌ ఖాన్‌ వంటి కుర్రాళ్లు సిద్ధంగా ఉన్నారు. దేశవాళీలో అత్యంత వేగవంతమైన బౌలర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాడు. దక్షిణాఫ్రికా పర్యటన అనంతరం స్వదేశంలో లంకతో సిరీస్‌ ఉంటుంది. దక్షిణాఫ్రికాలో చూపిన ప్రదర్శన ఆధారంగానే ఎంపిక చేస్తారనేది కాదనలేని సత్యం.  అయితే సొంత పిచ్‌ల మీద స్పిన్నర్ల వైపే మొగ్గు చూపే సెలెక్టర్లు.. జట్టులోకి ఇద్దరు లేదా ముగ్గురు కంటే ఎక్కువ మంది ఫాస్ట్‌బౌలర్లను తీసుకోకపోవచ్చు. కాబట్టి  దక్షిణాఫ్రికా పర్యటనలో ఉండే ఫాస్ట్‌ పిచ్‌ల మీద ఇషాంత్‌  చెలరేగి నిరూపించుకోవాల్సి ఉంటుంది.  

గత సంవత్సరకాలంగా ఇషాంత్‌ ప్రదర్శనను పరిశీలిస్తే గొప్పగా ఏమీ లేదు. ఎనిమిది టెస్టుల్లో కేవలం 14 వికెట్లను మాత్రమే పడగొట్టాడు. ఒకటి రెండు ఇన్నింగ్స్‌ల్లో రాణించడం తప్ప ఆసాంతం ఆకట్టుకోలేకపోయాడు. ఫిట్‌నెస్‌ సమస్యలు, గాయాలు పాలుకావడం కూడానూ ఇషాంత్‌ పాలిట శాపంగా మారింది. వందకుపైగా టెస్టు మ్యాచ్‌లు ఆడిన ఇషాంత్ 311 వికెట్లను తీశాడు. అయితే బౌలింగ్‌ యావరేజ్‌ (34.40) కాస్త ఎక్కువే. దాదాపు పద్నాలుగేళ్ల నుంచి జట్టులో కొనసాగుతున్నా.. తురుపుముక్కగా మారలేకపోవడం లంబూకే చెల్లింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని