T20 World Cup: సఫారీలకు సవాల్‌

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 సమరానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ నేడే. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కానీ అనూహ్య ప్రదర్శనతో ముందంజ వేసిన అమెరికా కూడా ఆసక్తిరేపుతోంది.

Published : 19 Jun 2024 04:23 IST

నేడు అమెరికాతో సూపర్‌-8 పోరు
రాత్రి 8 నుంచి

టీ20 ప్రపంచకప్‌లో సూపర్‌-8 సమరానికి వేళైంది. తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాతో అమెరికా ఢీ నేడే. గ్రూప్‌ దశలో అజేయంగా నిలిచిన దక్షిణాఫ్రికా ఫేవరెట్‌ అనడంలో సందేహం లేదు. కానీ అనూహ్య ప్రదర్శనతో ముందంజ వేసిన అమెరికా కూడా ఆసక్తిరేపుతోంది.

నార్త్‌సౌండ్‌ (అంటిగ్వా): టీ20 ప్రపంచకప్‌లో బుధవారం జరిగే తొలి సూపర్‌-8 మ్యాచ్‌లో అమెరికాతో దక్షిణాఫ్రికా తలపడనుంది. పసికూన అమెరికా సత్తా చాటుకున్నప్పటికీ మార్‌క్రమ్‌ నేతృత్వంలోని దక్షిణాఫ్రికాను ఆపడం ఆ జట్టుకు అంత తేలిక కాదు. ఈ మ్యాచ్‌లో దృష్టంతా దక్షిణాఫ్రికా బ్యాటర్లపైనే. టోర్నీలో ఇప్పటివరకు ఆ జట్టు అజేయంగా ఉన్నప్పటికీ.. భారాన్ని చాలా వరకు బౌలర్లే మోశారు. డికాక్, క్లాసెన్, స్టబ్స్, మిల్లర్‌ వంటి హిట్టర్లున్నప్పటికీ కఠినమైన పిచ్‌లపై గ్రూప్‌ దశలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా 120 దాటలేకపోయింది. గత మ్యాచ్‌లో పసికూన నేపాల్‌పై ఒక్క పరుగు తేడాతో అతి కష్టంగా గెలిచింది. గ్రూప్‌-2లో ఇంగ్లాండ్, వెస్టిండీస్‌ వంటి జట్లతో తలపడాల్సివున్నందున బ్యాటింగ్‌లో బలంగా పుంజుకుని ఘనవిజయంతో సూపర్‌-8 పోరును ఆరంభించాలని దక్షిణాఫ్రికా ఆశిస్తోంది. ఇక బౌలింగ్‌ విభాగంలో నోకియా సూపర్‌ ఫామ్‌లో ఉండడం ఆ జట్టుకు గొప్ప సానుకూలాంశం. అతడితోపాటు బార్ట్‌మన్, రబాడ, యాన్సెన్‌లను ఎదుర్కోవడం అనుభవం లేని అమెరికా బ్యాటర్లకు పెద్ద సవాలే. అయితే పాకిస్థాన్‌ వంటి మేటి జట్టును మట్టికరిపించిన అమెరికా.. రెట్టించిన ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతోంది. ఎలాంటి ఒత్తిడి లేని ఆ జట్టు దక్షిణాఫ్రికాకు గట్టి సవాలు విసరడానికి సిద్ధమవుతోంది. బ్యాటర్లు ఆరోన్‌ జోన్స్, గౌస్‌.. బౌలర్లు హర్మీత్‌ సింగ్, కెంజిగె, నేత్రావల్కర్‌ల ప్రదర్శన అమెరికాకు కీలకం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని