T20 World Cup: సఫారీలు.. కొద్దిలో!

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌. అమెరికా ముందు 195 పరుగుల లక్ష్యం. అవతల బలమైన బౌలింగ్‌ దళమున్న దక్షిణాఫ్రికా. మ్యాచ్‌ ఏకపక్షమే అనుకుంటారు ఎవరైనా. కానీ అమెరికా గొప్పగా పోరాడింది.

Updated : 20 Jun 2024 09:36 IST

అమెరికాపై కష్టంగా గెలిచిన దక్షిణాఫ్రికా
గౌస్‌ శ్రమ వృథా
మెరిసిన డికాక్, రబాడ
నార్త్‌సౌండ్‌

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో తొలి మ్యాచ్‌. అమెరికా ముందు 195 పరుగుల లక్ష్యం. అవతల బలమైన బౌలింగ్‌ దళమున్న దక్షిణాఫ్రికా. మ్యాచ్‌ ఏకపక్షమే అనుకుంటారు ఎవరైనా. కానీ అమెరికా గొప్పగా పోరాడింది. ఓ దశలో సఫారీలకు ఓటమి భయమూ కలిగించింది. సంచలన విజయంతో టోర్నీలో ప్రపంచకప్‌లో మరోసారి ప్రకంపనలు రేపేలా కనిపించింది. కానీ ఆఖర్లో అమెరికాకు కళ్లెం వేసిన సఫారీ జట్టు ఊపిరి పీల్చుకుంది.

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8 దశలో దక్షిణాఫ్రికా శుభారంభం చేసింది. బుధవారం ఆ జట్టు 18 పరుగుల తేడాతో అమెరికాను ఓడించింది. మొదట క్వింటన్‌ డికాక్‌ (74; 40 బంతుల్లో 7×4, 5×6)తో పాటు మార్‌క్రమ్‌ (46; 32 బంతుల్లో 4×4, 1×6), క్లాసెన్‌ (36 నాటౌట్‌; 22 బంతుల్లో 3×6) రాణించడంతో దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 194 పరుగుల భారీ స్కోరు సాధించింది. అమెరికా బౌలర్లలో సౌరభ్‌ నేత్రావల్కర్‌ (2/21), హర్మీత్‌ సింగ్‌ (2/24) ఆకట్టుకున్నారు. అనంతరం ఛేదనలో అమెరికా గట్టిగా పోరాడినప్పటికీ.. చివరికి 176/6కు పరిమితమైంది. ఓపెనర్‌ అండ్రీస్‌ గౌస్‌ (80; 47 బంతుల్లో 5×4, 5×6) సంచలన ఇన్నింగ్స్‌ ఆడాడు. హర్మీత్‌ (38; 22 బంతుల్లో 2×4, 3×6) కూడా మెరుపులు మెరిపించాడు. రబాడ (3/18) యుఎస్‌కు కళ్లెం వేశాడు.

ఆశలు రేపిన ఆ ఇద్దరు..: దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ఒక దశ వరకు సాగిన తీరు చూస్తే.. ఆ జట్టు గౌరవప్రదంగా ఓడుతుందని కూడా ఎవరికి అనిపించి ఉండదు. ఉన్నంతసేపు ధాటిగా ఆడిన స్టీవెన్‌ టేలర్‌ (24; 14 బంతుల్లో 4×4, 1×6)ను నాలుగో ఓవర్లో రబాడ ఔట్‌ చేయగానే అమెరికా ఇన్నింగ్స్‌ గాడి తప్పింది. నితీశ్‌ కుమార్‌ (8), ఆరోన్‌ జోన్స్‌ (0), కోరీ అండర్సన్‌ (12), జహంగీర్‌ (3) పెవిలియన్‌కు క్యూ కట్టేయడంతో 12వ ఓవర్లో 76/5తో అమెరికా కష్టాల్లో పడింది. ఇక మ్యాచ్‌ ఏకపక్షమే అనుకున్న దశలో అప్పటికే క్రీజులో కుదురుకున్న గౌస్‌.. ఆల్‌రౌండర్‌ హర్మీత్‌ సింగ్‌ కలిసి మ్యాచ్‌ గమనాన్నే మార్చేశారు. ఇద్దరూ పోటీ పడి సిక్సర్లు బాదడంతో దక్షిణాఫ్రికాలో గుబులు మొదలైంది. 15-18 మధ్య 4 ఓవర్లలో ఏకంగా 64 పరుగులు రావడంతో మ్యాచ్‌ రసవత్తరంగా మారింది. 2 ఓవర్లలో 28 పరుగులు అవసరమవడంతో అమెరికా సంచలనం సృష్టిస్తుందేమో అనిపించింది. కానీ 19వ ఓవర్‌ తొలి బంతికే హర్మీత్‌ను ఔట్‌ చేసిన రబాడ.. అమెరికాకు బ్రేక్‌ వేశాడు. ఈ ఓవర్లో 2 పరుగులే వచ్చాయి. చివరి ఓవర్లో నోకియా 7 పరుగులే ఇవ్వడంతో అమెరికాకు ఓటమి తప్పలేదు.

దంచేసిన డికాక్‌: మొదట టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా.. గ్రూప్‌ దశకు భిన్నంగా రెచ్చిపోయింది. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండడంతో ఓపెనర్‌ డికాక్‌ భారీ షాట్లతో అమెరికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఓ సిక్స్‌ బాది ఊపు మీద కనిపించిన రీజా హెండ్రిక్స్‌ (11).. నేత్రావల్కర్‌ బౌలింగ్‌లో వెనుదిరిగినా దక్షిణాఫ్రికాకు ఇబ్బంది లేకపోయింది. కెప్టెన్‌ మార్‌క్రమ్‌ అండతో డికాక్‌ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. జస్‌దీప్‌ వేసిన నాలుగో ఓవర్లో డికాక్‌ వరుసగా 4, 6, 6, 6 బాదేయగా మొత్తం 28 పరుగులొచ్చాయి. పవర్‌ప్లేలో 64/1తో నిలిచిన సఫారీ జట్టు.. 10 ఓవర్లకే వంద దాటేసింది. డికాక్‌ 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. అయితే స్పిన్నర్‌ హర్మీత్‌ సింగ్‌ 13వ ఓవర్లో వరుస బంతుల్లో డికాక్, మిల్లర్‌ (0)లను ఔట్‌ చేశాడు. కాసేపటికే మార్‌క్రమ్‌ కూడా వెనుదిరగడంతో 14 ఓవర్లకు 141/4తో దక్షిణాఫ్రికా కొంచెం ఇబ్బందుల్లో పడింది. కానీ చివరి ఓవర్లలో క్లాసెన్, స్టబ్స్‌ (20 నాటౌట్‌) ధాటిగా ఆడి జట్టు స్కోరును 200కు చేరువ చేశారు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: డికాక్‌ (సి) జహంగీర్‌ (బి) హర్మీత్‌ 74; రీజా హెండ్రిక్స్‌ (సి) అండర్సన్‌ (బి) నేత్రావల్కర్‌ 11; మార్‌క్రమ్‌ (సి) అలీ ఖాన్‌ (బి) నేత్రావల్కర్‌ 46; మిల్లర్‌ (సి) అండ్‌ (బి) హర్మీత్‌ 0; క్లాసెన్‌ నాటౌట్‌ 36; స్టబ్స్‌ నాటౌట్‌ 20; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 194; వికెట్ల పతనం: 1-16, 2-126, 3-126, 4-141; బౌలింగ్‌: సౌరభ్‌ నేత్రావల్కర్‌ 4-0-21-2; అలీ ఖాన్‌ 4-0-45-0; జస్‌దీప్‌ 2-0-36-0; కెంజిగి 3-0-29-0; హర్మీత్‌ సింగ్‌ 4-0-24-2; స్టీవెన్‌ టేలర్‌ 2-0-21-0; కోరీ అండర్సన్‌ 1-0-17-0

అమెరికా ఇన్నింగ్స్‌: టేలర్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 24; గౌస్‌ నాటౌట్‌ 80; నితీశ్‌ కుమార్‌ (సి) స్టబ్స్‌ (బి) రబాడ 8; ఆరోన్‌ జోన్స్‌ (సి) డికాక్‌ (బి) మహరాజ్‌ 0; కోరి అండర్సన్‌ (బి) నోకియా 12; జహంగీర్‌ ఎల్బీ (బి) షంసి 3; హర్మీత్‌ సింగ్‌ (సి) స్టబ్స్‌ (బి) రబాడ 38; జస్‌దీప్‌ సింగ్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 176; వికెట్ల పతనం: 1-33, 2-53, 3-56, 4-71, 5-76, 6-167; బౌలింగ్‌: యాన్సెన్‌ 3-0-32-0; మార్‌క్రమ్‌ 1-0-13-0; రబాడ 4-0-18-3; కేశవ్‌ మహరాజ్‌ 4-0-24-1; నోకియా 4-0-37-1; షంసి 4-0-50-1


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు