
T20 World Cup 2021: బంగ్లాపై దక్షిణాఫ్రికా ఘన విజయం
ఇంటర్నెట్ డెస్క్: టీ20 ప్రపంచకప్ సూపర్-12 దశలో భాగంగా అబుదాబి వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. 85 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 13.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ టెంబా బావుమా (31) పరుగులతో రాణించాడు. బంగ్లా బౌలర్లలో టస్కిన్ అహ్మద్ రెండు, మెహెదీ హసన్, నసూమ్ అహ్మద్ తలో వికెట్ తీశారు.
ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా జట్టు.. పవర్ ప్లే పూర్తయ్యే సరికి మూడు వికెట్లు కోల్పోయి 33 పరుగులు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (4) ఎల్బీగా వెనుదిరిగాడు. మరో ఓపెనర్ క్వింటన్ డి కాక్ (16) ఐదో ఓవర్లో బౌల్డయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన ఐడెన్ మార్‌క్రమ్ (0) డకౌటయ్యాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కి వచ్చిన కెప్టెన్ టెంబా బావుమా (25).. వాండర్ డస్సెన్ (22)తో కలిసి నిలకడగా ఆడుతూ పరుగులు రాబట్టారు. ఈ క్రమంలోనే నసూమ్ అహ్మద్ వేసిన 13 ఓవర్లో డస్సెన్ క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన డేవిడ్ మిల్లర్ (5) పరుగులు చేశాడు.
అంతకు ముందు, దక్షిణాఫ్రికా బౌలర్లు విజృంభించడంతో.. బంగ్లాదేశ్ జట్టు కుప్పకూలింది. 18.2 ఓవర్లలోనే 84 పరుగులు చేసి ఆలౌటైంది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహెదీ హాసన్ (27) ఒక్కడే టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే వరుస షాకులు తగిలాయి. ఓపెనర్ మహమ్మద్ నయీమ్ (9), సౌమ్య సర్కార్ (0), ముష్ఫికర్ రహీమ్ (0) వరుసగా పెవిలియన్ చేరారు. కగిసో రబాడ వేసిన నాలుగో ఓవర్లో నయీమ్, సర్కార్ వరుస బంతుల్లో ఔట్ కాగా.. ఆరో ఓవర్లో రహీమ్.. క్యాచ్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ మహ్మదుల్లా (3), మరో ఓపెనర్ లిటన్ దాస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దుతాడని ఆశించినా నిరాశే ఎదురైంది. అన్రిచ్ నోర్జే వేసిన ఎనిమిదో ఓవర్లో అతడు మార్క్‌క్రమ్‌కి క్యాచ్ ఇచ్చి క్రీజు వీడాడు. డ్వేయిన్ ప్రిటోరియస్ వేసిన ఆ తర్వాతి ఓవర్లోనే అఫీఫ్ హోసైన్ (0) బౌల్డయ్యాడు. దీంతో పది ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ 40 పరుగులు చేసింది. ఓ వైపు వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ పరుగులు రాబడుతున్న లిటన్ దాస్ (24).. తబ్రెయిజ్ షంసి వేసిన 12వ ఓవర్లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఆఖర్లో మెహెదీ హాసన్ (27) వేగంగా ఆడుతున్న క్రమంలో నోర్జేకి రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. చివర్లో వచ్చిన షమీమ్ హోసైన్ (11), టస్కిన్ అహ్మద్ (3), నసూమ్ అహ్మద్ (0) విఫలమయ్యారు. షోరిఫుల్ ఇస్లామ్ (0) నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ, అన్రిచ్ నోర్జే మూడేసి, తబ్రెయిజ్ షంసి రెండు, డ్వేయిన్ ప్రిటోరియస్ ఒక వికెట్ తీశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.