IND vs SA: పోరాడిన సంజూ.. తొలి వన్డేలో భారత్‌ ఓటమి

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లఖ్‌నవూ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.

Updated : 06 Oct 2022 23:54 IST

లఖ్‌నవూ: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత్‌ పోరాడి ఓడింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా లఖ్‌నవూ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 9 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. 250 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమ్‌ ఇండియా నిర్ణీత 40 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బ్యాటర్లు హెన్రిచ్‌ క్లాసెన్‌ (74 నాటౌట్‌; 65 బంతుల్లో 6×4, 2×6), డేవిడ్ మిల్లర్ (75 నాటౌట్; 63 బంతుల్లో 5×4, 3×6) క్వింటన్ డికాక్ (48; 54 బంతుల్లో 5×5) విజృంభించడంతో భారీ స్కోరు చేసిన దక్షిణాఫ్రికా విజయం సాధించింది. జట్టును విజయతీరాలకు చేర్చేందుకు శ్రేయర్‌ అయ్యర్‌ (50; 8×4) సంజూ శాంసన్‌ (86 నాటౌట్‌; 63 బంతుల్లో 9×4,3×6) చేసిన పోరాటం వృథా అయ్యింది.

250 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్‌ ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది ఓపెనర్‌ శుబ్‌మన్‌ గిల్‌ (3) రబాడా వేసిన 2.4వ బంతికి బౌల్డయ్యాడు. కొద్దిసేపటికే వ్యాన్ పార్నెల్ బౌలింగ్‌లో కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ (4) పెవిలియన్‌ బాట పట్టాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (19) కూడా పెద్దగా పరుగులేమీ చేయకుండానే షంసీ బౌలింగ్‌లో స్టంపౌటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శ్రేయస్‌ అయ్యర్‌.. ఇషాన్‌ కిషన్‌(20)తో కలిసి ఇన్నింగ్స్‌ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే, ఈ జోడీని మహరాజ్‌ విడగొట్టాడు. జట్టు స్కోరు 51 పరుగుల వద్ద జెన్నేమన్‌కు క్యాచ్‌ ఇచ్చి ఇషాన్‌ వెనుదిరిగాడు. ఆ తర్వాత లుంగి ఎంగిడి వేసిన 26.4వ బంతికి శ్రేయస్‌ భారీ షాట్‌కు ప్రయత్నించి రబాడా చేతికి చిక్కాడు. దీంతో సంజూ శాంసన్‌ (86 నాటౌట్‌) ఒంటరి పోరాటం చేశాడు. ఆచితూచి ఆడుతూ వీలుచిక్కినప్పుడల్లా బౌండరీలు బాదుతూ స్కోరు బార్డును ముందుకు కదిలించాడు. అతడికి శార్థూల్‌ ఠాకూర్‌ (33; 31 బంతుల్లో 5×4) చక్కని సహకారం అందించాడు. కానీ, లుంగి ఎంగిడి బౌలింగ్‌లో జట్టు స్కోరు 211 పరుగుల వద్ద మహారాజ్‌ చేతికి చిక్కాడు. తర్వాత వచ్చిన కుల్దీప్‌ యాదవ్‌ (0), ఆవేశ్‌ ఖాన్‌ (3), రవి బిష్ణోయ్‌ (4) సింగిల్‌ డిజిట్‌కే పరిమితమవ్వడంతో ఫలితం దక్కలేదు. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీయగా, రబాడా 2,  వ్యాన్‌ పార్నెల్‌, కేశవ్‌ మహరాజ్‌, షంసీ తలో వికెట్ పడగొట్టారు.

అంతకుముందు టాస్ గెలిచిన భారత్‌ దక్షిణాఫ్రికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 40 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు విసిరినప్పటికీ క్యాచ్‌లు చేజార్చడం భారత్‌ పాలిట శాపమైంది. అవకాశాన్ని అందిపుచ్చుకున్న దక్షిణాఫ్రికా బ్యాటర్లు చెలరేగిపోయారు. మిల్లర్‌ (75 నాటౌట్‌), క్లాసెన్‌ (74 నాటౌట్‌), డికాక్‌ (48) బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించి భారత్‌ ముందుకు భారీ లక్ష్యాన్ని ఉంచారు. టీమ్‌ ఇండియా బౌలర్లలో శార్ధూల్‌ ఠాకూర్‌ 2 వికెట్లు తీయగా, రవి బిష్ణోయ్‌, కుల్దీప్‌ యాదవ్‌ చెరో వికెట్‌ తీశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని