T20 Wrold Cup: దక్షిణాఫ్రికా జైత్రయాత్ర.. ఉత్కంఠ పోరులో ఇంగ్లాండ్‌పై విజయం

టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-8లో దక్షిణాఫ్రికా వరుసగా రెండో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 7 పరుగుల తేడాతో నెగ్గింది.  

Updated : 22 Jun 2024 00:18 IST

గ్రాస్‌ ఐలెట్‌: టీ20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా జైత్రయాత్ర కొనసాగుతోంది. సూపర్‌-8లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆ జట్టు 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో దక్షిణాఫ్రికా గ్రూప్‌-2 నుంచి దాదాపు సెమీస్‌కు చేరుకున్నట్లే. తొలుత టాస్‌ ఓడి బ్యాటింగ్‌ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. డికాక్‌ (65: 38 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లు), డేవిడ్‌ మిల్లర్‌ (43: 28 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) దంచికొట్టారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్‌ 3 వికెట్లు తీయగా, మొయిన్‌ అలీ, ఆదిల్‌ రషీద్‌ ఒక్కో వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన ఇంగ్లాండ్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 156 పరుగులు చేసి ఓటమి పాలైంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, కేశవ్‌ మహరాజ్‌ చెరో 2 వికెట్లు తీయగా, ఒట్టోనేల్‌ బార్ట్‌మాన్‌, నోకియా ఒక్కో వికెట్‌ తీశారు.

ఆఖర్లో అదరగొట్టిన బౌలర్లు..

164 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లాండ్‌.. 61 పరుగులకే 4 కీలక వికెట్లు చేజార్చుకొని పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో హ్యారీ బ్రూక్‌, లివింగ్‌ స్టోన్‌ ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు వీరు 78 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పడంతో ఇంగ్లాండ్‌ విజయం దిశగా పయనించింది. చివరి మూడు ఓవర్లలో ఆజట్టు విజయానికి 25 పరుగులు అవసరం కాగా, చేతిలో 6 వికెట్లు ఉండడంతో ఇంగ్లాండ్‌దే విజయమని అంతా భావించారు. అయితే 18వ ఓవర్‌ వేసిన రబాడ కేవలం 4 పరుగులే ఇచ్చి లివింగ్‌ స్టోన్‌ను ఔట్‌ చేశాడు. 19వ ఓవర్‌లో జాన్‌సెన్‌ 7 పరుగులే ఇచ్చాడు. దీంతో సమీకరణం 6 బంతుల్లో 14 పరుగులుగా మారింది. 20వ ఓవర్‌ వేసిన నోకియా తొలి బంతికే వికెట్‌ తీశాడు. మార్‌క్రమ్‌ ఓ చక్కటి క్యాచ్‌ అందుకోవడంతో హ్యారీ బ్రూక్‌ ఔటయ్యాడు. రెండో బంతికి ఒక పరుగే వచ్చింది. మూడో బంతికి సామ్‌ కరన్‌ ఫోర్‌ బాదాడు. దీంతో ఇంగ్లాండ్‌ విజయ లక్ష్యం 3 బంతుల్లో 9 పరుగులుగా మారింది. దీంతో ఇరుజట్లలోనూ ఉత్కంఠ తారస్థాయికి చేరింది. ఈ సమయంలో ఒత్తిడిని అధిగమిస్తూ నోకియా అద్భతంగా బౌలింగ్‌ చేసి చివరి మూడు బంతుల్లో కేవలం ఒకే పరుగే ఇచ్చాడు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు సంబరాల్లో మునిగితేలింది. ఇంగ్లాండ్‌ జట్టులో ఫిలిప్‌ సాల్ట్‌ (11), జోస్‌ బట్లర్‌ (17), బెయిర్‌ స్టో (16), సామ్‌ కరన్‌ (10), మొయిన్‌ అలీ (9) విఫలమయ్యారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని