Published : 14 Jun 2021 01:38 IST

Concussion: పీఎస్‌ఎల్‌లో చెన్నై ఆటగాడికి కంకషన్‌

అబుదాబి: పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్‌)లో భాగంగా క్వెట్టా గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ బ్యాట్స్‌మెన్‌ ఫా డుప్లెసిస్‌ కంకషన్‌కు గురయ్యాడు. శనివారం రాత్రి పెషావర్‌ జాల్మీ జట్టుతో మ్యాచ్‌ ఆడుతుండగా సహచర ఆటగాడు మహ్మద్‌ హస్నేన్‌ను బలంగా ఢీకొని కిందపడిపోయాడు. దాంతో వెంటనే పరీక్షించిన అక్కడి ఫిజియోలు అతడిని మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, గ్లాడియేటర్స్‌ జట్టులో ఇలా రెండు రోజుల వ్యవధిలో ఆటగాళ్లు కంకషన్‌కు గురవ్వడం ఇది రెండోసారి.

అంతకుముందు ఇస్లామాబాద్‌ యునైటెడ్‌తో జరిగిన మ్యాచ్‌లో గ్లాడియేటర్స్‌ ఆటగాడు ఆండ్రీ రసెల్‌ బ్యాటింగ్‌ చేస్తూ కంకషన్‌కు గురయ్యాడు. ప్రత్యర్థి బౌలర్‌ మహ్మద్‌ ముసా వేసిన ఓ బౌన్సర్‌ అతడి హెల్మెట్‌కు తగలడంతో తలకు దెబ్బ తగిలింది. దాంతో రసెల్‌ను కూడా ఆ మ్యాచ్‌ నుంచి తప్పించారు. తాజాగా డుప్లెసిస్‌ గాయపడడంతో అతడి సతీమణి ఇమారి ఇన్‌స్టాగ్రామ్‌లో ఆందోళన వ్యక్తం చేసింది. అతడికి ఎలా ఉందోనని కంగారుపడింది. తనకు చాలా బాధగా ఉందని వ్యాఖ్యానించింది. డుప్లెసిస్‌ను ఆస్పత్రిలో చూపించాలని కోరింది.

కరోనా కారణంగా మార్చిలో వాయిదాపడిన పీఎస్‌ఎల్‌ నాలుగు రోజుల క్రితమే తిరిగి ప్రారంభమైంది. ఈ క్రమంలోనే డుప్లెసిస్‌ యూఏకి చేరుకొని గ్లాడియేటర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఇస్లామాబాద్‌తో జరిగిన గత మ్యాచ్‌లో 5 పరుగులు చేసిన అతడు ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌ చేయలేకపోయాడు. అంతకుముందు డుప్లెసిస్‌ ఐపీఎల్‌ 14వ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ తరఫున ఆడి అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఏడు మ్యాచ్‌ల్లో నాలుగు అర్ధశతకాలు సాధించి మొత్తం 320 పరుగులు చేశాడు. దాంతో సీఎస్కేను విజయపథంలో నడిపించాడు. ఈ క్రమంలోనే టోర్నీ నిలిచిపోయేసరికి ఆ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో నిలిచింది. ఈ నేపథ్యంలోనే బుడగలో పలు కరోనా కేసులు నమోదవ్వగా మే 4న టోర్నీని నిరవధికంగా వాయిదా వేశారు. దాంతో మిగిలిన మ్యాచ్‌లను సెప్టెంబర్‌లో యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts