
Tokyo Olympics: కొంపముంచిన అత్యుత్సాహం
విమర్శలపాలైన దక్షిణకొరియా బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ
ఇంటర్నెట్‌డెస్క్: టోక్యో ఒలింపిక్స్ మొదలై ఐదు రోజులు అవుతున్నా.. ప్రారంభోత్సవ వేడుకలకు సంబంధించి అనేక విశేషాలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఆ వేడుకలో వివిధ దేశాలకు చెందిన అథ్లెట్లు పరేడ్‌లో పాల్గొంటారనే విషయం తెలిసిందే. అందులో ప్రధాన అథ్లెట్లు వారి దేశ పతాకాన్ని ప్రదర్శిస్తూ మార్చ్‌లో పాల్గొంటారు. వారిని బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీలు టీవీల ద్వారా ప్రసారం చేస్తుంటాయి. అలా దక్షిణకొరియాకు చెందిన ఓ బ్రాడ్‌కాస్టింగ్ సంస్థ పరేడ్‌ను చూపించడంలో అత్యుత్సాహం ప్రదర్శించి నెట్టింట విమర్శలపాలైంది. దీంతో బహిరంగ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇంతకీ ఏమైందంటే..!
ఒలింపిక్స్ ప్రారంభోత్సవ వేడుకల్ని దక్షిణకొరియాలో ఎంబీసీ అనే ఛానల్ ప్రసారం చేసింది. అయితే, పరేడ్‌లో పాల్గొనే దేశాల క్రీడాకారులు పెద్దగా ఎవరికి తెలియదు.. కాబట్టి దేశాలకు సంబంధించి గుర్తుండిపోయే ఘటనలను చూపించాలని నిర్ణయించింది. ఈ విధంగా ప్రపంచదేశాల గురించి అవగాహన కల్పించినట్లయితుందని భావించింది. ఈ క్రమంలో కొన్ని దేశాలకు ఆ ఛానెల్ ప్రదర్శించిన ఫొటోలు.. పెట్టిన కాప్షన్లే ఇబ్బందులు తెచ్చిపెట్టాయి.
ప్రారంభోత్సవ వేడుకలో భాగంగా హైతి దేశపు అథ్లెట్లు పరేడ్ చేస్తున్న సమయంలో ఎంబీసీ ఛానెల్ ‘‘ఆ దేశంలో అధ్యక్షుడు హత్యకు గురికావడంతో రాజకీయ సంక్షోభం ఏర్పడింది’’అని కాప్షన్ ఇచ్చింది. సిరియాకు చెందిన అథ్లెట్లు రాగానే ‘‘అక్కడ భూగర్భవనరులు ఎక్కువ. అలాగే పదేళ్లుగా అంతర్యుద్ధం జరుగుతోంది’’ అని పేర్కొంది. మార్షల్ఐలాండ్స్కు ‘‘ఒకప్పుడు ఈ ప్రాంతం యూఎస్ అణుపరీక్షలకు కేంద్రంగా ఉండేది’’అని, ఉక్రెయిన్‌కు ‘‘చెర్నోబిల్ విపత్తు-ప్రపంచంలోనే అతి దారుణమైన అణుప్రమాదం’’అని ఫొటోలను చూపిస్తూ కాప్షన్లు పెట్టింది. ఇటలీకి పిజ్జా, నార్వేకు సాల్మొన్ చేప, రొమానియాకు డ్రాకులా, ఎల్ సాల్విడర్కు బిట్‌కాయిన్(ఆ దేశంలో బిట్‌కాయిన్‌ను అధికారికం చేసిన నేపథ్యంలో) ఫొటోలు ప్రదర్శించింది.
దీంతో ఆ ఛానెల్‌పై నెట్టింట్లో విమర్శలు వెల్లువెత్తాయి. దేశాలకు సంబంధించి ఇలాంటి దుర్ఘటనలు, ఫొటోలే దొరికాయా అని మండిపడ్డారు. అవి అభ్యంతరకరంగా ఉన్నాయని ఆక్షేపించారు. దీంతో ఎంబీసీ ఛానెల్ క్షమాపణలు చెప్పక తప్పలేదు. కేవలం ఆయా దేశాలను సులభంగా గుర్తుపట్టొచ్చన్న ఉద్దేశంతోనే వాటిని వాడినట్లు వివరణ ఇచ్చింది. ఫొటోలు, కాప్షన్ల ఎంపికను సరిగా పరిశీలించలేదని.. ఇది క్షమించరాని పొరపాటేనని ఒప్పుకుంది. ఈ పొరపాటు ఎలా జరిగిందో అంతర్గత విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చింది.
ఇవీ చదవండి
Advertisement