WTC Final: మూడో రోజు ఆట కొనసాగేనా?

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ కుదర్లేదు.....

Updated : 20 Jun 2021 10:38 IST

సౌథాంప్టన్‌లో వర్షం.. తొలి సెషన్‌ కష్టం!

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ మూడో రోజుకు చేరుకుంది. ఎడతెరపి లేకుండా వర్షం కురవడంతో శుక్రవారం కనీసం బంతి పడకుండానే ఆట ముగిసింది. రెండోరోజైన శనివారం రెండు సెషన్ల మేర ఆట కొనసాగింది. వెలుతురు లేమి కారణంగా మూడో సెషన్‌ కుదర్లేదు. మూడో రోజైన ఆదివారమూ పరిస్థితులు మెరుగ్గా ఏం లేవు.

సౌథాంప్టన్‌ కాలమానం ప్రకారం ఉదయం 5 గంటలకు అక్కడ వర్షం కురుస్తూనే ఉంది. ఆకాశం మేఘావృతమైంది. ఈ లెక్కన తొలిసెషన్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. మధ్యాహ్నం సైతం 80% వరకు వర్షం కురుస్తుందని వాతావరణ వెబ్‌సైట్లు అంచనా వేశాయి. ‘ఉదయం భారీ వర్షం కొనసాగుతుంది. మధ్యాహ్నం తర్వాత కొంత తగ్గొచ్చు. అప్పుడప్పుడు ఎండ వస్తుంది. సాయంత్రానికి వాతావరణం పొడిగా మారే అవకాశం ఉంది. గరిష్ఠ ఉష్ణోగ్రత 21 డిగ్రీలు ఉంటుంది’ అని బ్రిటన్‌ వాతావరణ శాఖ తెలిపింది.

మొదటి రోజు ఆట రద్దు కావడంతో రెండోరోజు టాస్‌ వేశారు. టాస్ గెలిచిన కేన్‌ విలియమ్సన్‌ భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. వెలుతురు లేమితో ఆట ముగించే సరికి టీమ్‌ఇండియా 3 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. విరాట్‌ కోహ్లీ (44 బ్యాటింగ్‌; 124 బంతుల్లో 1×4) అర్ధశతకానికి చేరువయ్యాడు. అజింక్య రహానె (29 బ్యాటింగ్‌; 79 బంతుల్లో 4×4) అతడికి తోడుగా ఉన్నాడు. వీరిద్దరూ 147 బంతుల్లో 58 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. రోహిత్‌ శర్మ (34; 68 బంతుల్లో 6×4), శుభ్‌మన్‌ గిల్‌ (28; 64 బంతుల్లో 3×4) ఫర్వాలేదనిపించారు. మొత్తంగా 64.4 ఓవర్ల ఆట మాత్రమే సాగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని