Spain: చరిత్ర మారలేదు

గత 36 ఏళ్లలో ప్రపంచకప్‌ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్‌ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్‌కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు.

Updated : 06 Jul 2024 04:03 IST

జర్మనీపై మళ్లీ స్పెయిన్‌దే పైచేయి
యూరో సెమీస్‌లోకి ప్రవేశం
119వ నిమిషంలో మెరినో మెరుపు గోల్‌
హాంబర్గ్‌

గత 36 ఏళ్లలో ప్రపంచకప్‌ సహా ఏ టోర్నీలోనూ జర్మనీ చేతిలో ఓటమే ఎరుగని చరిత్ర స్పెయిన్‌ది. కానీ ఈసారి యూరోలో జర్మనీ నిలకడ చూసి.. స్పెయిన్‌కు దీటుగానే నిలుస్తుందని, గెలిచినా ఆశ్చర్యం లేదని అన్నారు విశ్లేషకులు. అయితే పోటీ అయితే బాగానే ఇచ్చింది కానీ.. విజయాన్ని మాత్రం రుచి చూడలేకపోయింది జర్మనీ. ప్రత్యర్థిపై ఆధిపత్యాన్ని, టోర్నీలో అజేయ రికార్డును కొనసాగిస్తూ స్పెయిన్‌ యూరో సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది.

రెండు మేటి జట్ల మధ్య పోరు అంచనాలకు తగ్గట్లే సాగింది. ఇరు జట్లూ అత్యంత హోరాహోరీగా తలపడ్డాయి. ఆటగాళ్లు ప్రాణం పెట్టి పోరాడారు. అయితే చివరికి ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ స్పెయినే 2-1తో పైచేయి సాధించింది. సొంతగడ్డపై జర్మనీకి గుండెకోత తప్పలేదు. నిర్ణీత సమయంలో 1-1తో సమమై స్కోరు ఇంకో నిమిషంలో అదనపు సమయం ముగియనుండగా కూడా అలాగే ఉండడంతో..  ఫలితం షూటౌట్లోనే తేలుతుందని అంతా అనుకున్నారు. కానీ అదనపు సమయం ముగియబోతుండగా.. మైకెల్‌ మెరినో అద్భుతం చేశాడు. 119వ నిమిషంలో ఓల్మో అందించిన క్రాస్‌ను హెడర్‌తో అద్భుత రీతిలో గోల్‌ పోస్టులోకి నెట్టేసిన మెరినో స్పెయిన్‌ను సంబరాల్లో ముంచెత్తాడు. చివరి గోల్‌లో తన వంతు పాత్ర పోషించడమే కాక.. 51వ నిమిషంలో గోల్‌తో ఓల్మో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. స్టార్‌ ఆటగాడు పెడ్రి గాయంతో వైదొలగడంతో 8వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన ఓల్మో.. కుడి వైపు నుంచి యమాల్‌ అందించిన చక్కటి పాస్‌ను సద్వినియోగం చేస్తూ 15 మీటర్ల దూరం నుంచి మెరుపు వేగంతో కొట్టిన షాట్‌కు జర్మనీ గోల్‌ కీపర్‌ నుంచి సమాధానం లేకపోయింది. జర్మనీ తరఫున ఏకైక గోల్‌ను 89వ నిమిషంలో ఫ్లోరియన్‌ విజ్‌ సాధించాడు.

ఓటమి లేకుండా క్వార్టర్స్‌ చేరిన రెండు ఉత్తమ జట్ల మధ్య మ్యాచ్‌ అంచనాలకు తగ్గట్లే ఆరంభం నుంచి రసవత్తరంగా సాగింది. రెండో నిమిషంలోనే అవకాశం సృష్టించుకున్న స్పెయిన్‌ ఆధిక్యంలోకి వెళ్లేలా కనిపించింది కానీ.. పెడ్రి బాక్స్‌ అవతలి నుంచి కొట్టిన షాట్‌ను న్యూర్‌ అడ్డుకున్నాడు. ఆ తర్వాత ఇరు జట్లు గట్టిగానే గోల్‌ దాడులు చేశాయి. స్పెయిన్‌ ఎక్కువ అవకాశాలు సృష్టించుకున్నప్పటికీ.. జర్మనీ రక్షణ శ్రేణి గొప్ప నైపుణ్యం చూపించడంతో గోల్‌ నమోదు కాలేదు. 8వ నిమిషంలో క్రూస్‌ ఢీకొట్టడంతో కింద పడ్డ స్టార్‌ ఆటగాడు పెడ్రి.. నొప్పితో విలవిలలాడుతూ మైదానాన్ని వీడడం స్పెయిన్‌కు ఎదురు దెబ్బ తగిలినట్లయింది. కానీ అతడి స్థానంలో వచ్చిన ఓల్మో ఆ లోటును కనిపించనివ్వలేదు. 35వ నిమిషంలో అతను గోల్‌ కోసం గట్టి ప్రయత్నమే చేశాడు. 23 మీటర్ల నుంచి ఓల్మో కొట్టిన బలమైన షాట్‌ను న్యూర్‌ ఎడమ వైపు దూకుతూ అద్భుతంగా ఆపాడు. మరోవైపు ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై జర్మనీ తక్కువ దాడులే చేసినా.. ఆ జట్టే మొదట ఆధిక్యంలోకి వెళ్లేలా కనిపించింది. స్టార్‌ ఆటగాడు హార్వెట్జ్‌కు గోల్‌ చేయడానికి రెండు మంచి అవకాశాలు లభించాయి. 21, 35 నిమిషాల్లో అతడి షాట్లను స్పెయిన్‌ గోల్‌కీపర్‌ సైమన్‌ సమర్థంగా అడ్డుకున్నాడు. ప్రథమార్ధం గోల్‌ లేకుండా ముగిసిపోగా.. ద్వితీయార్ధం ఆరంభమైన కొన్ని నిమిషాలకే ఓల్మో గోల్‌తో స్పెయిన్‌ ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరు సమం చేసేందుకు జర్మనీ ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ జట్టు ఆశలు నీరుగారిపోతున్న సమయంలో ఫ్లోరియన్‌ విజ్‌ స్కోర్‌ చేశాడు. జట్టంతా సమష్టిగా కదిలి ఈ గోల్‌ సాధించింది. సహచరుడి నుంచి కుడివైపు బంతిని అందుకున్న కిమిచ్‌ తలతో దాన్ని ఫ్లోరియన్‌ విజ్‌ వైపు నెట్టగా.. అతను తన ముందున్న స్పెయిన్‌ డిఫెండర్లకు, గోల్‌ పోస్టు ముందున్న సైమన్‌కు చిక్కకుండా కళ్లు చెదిరే రీతిలో గోల్‌ కొట్టాడు. దీంతో మ్యాచ్‌ అదనపు సమయానికి వెళ్లక తప్పలేదు. ఆధిక్యం కోసం తర్వాత ఇరు జట్లూ తీవ్రంగా ప్రయత్నించినా.. ఫలితం లేకపోయింది. ఇక షూటౌట్‌ అనివార్యమనుకున్న సమయంలో మెరినో సంచలన గోల్‌తో జర్మనీ ఆశలపై నీళ్లు చల్లాడు. ఓ టోర్నీలో జర్మనీ చివరగా 1988 యూరో ఛాంపియన్‌షిప్‌లో స్పెయిన్‌పై నెగ్గింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని