భారత్‌ ఈ మ్యాచ్‌లో అద్భుతం చేయవచ్చు: మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌

 ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కి గెలిచే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నారు. విజయం సాధించాలంటే ఛేదించాలంటే ఆధిక్యం చాలానే ఉన్నా.. హెడింగ్లే మైదానంలో అద్భుతాలు జరుగవచ్చని వాన్ అన్నారు. 

Updated : 28 Aug 2021 15:23 IST

లీడ్స్‌: ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత్‌కి గెలిచే అవకాశాలు ఇంకా మిగిలే ఉన్నాయని ఇంగ్లాండ్‌ మాజీ క్రికెటర్‌ మైకేల్‌ వాన్‌ అన్నారు. విజయం సాధించాలంటే ఛేదించాలంటే ఆధిక్యం చాలానే ఉన్నా.. హెడింగ్లే మైదానంలో అద్భుతాలు జరుగవచ్చని వాన్ అన్నారు. భారత్‌ నాలుగో రోజు మొదటి సెషన్‌లో జాగ్రత్తగా ఆడాలని సూచించాడు. ‘ఇక్కడ ఉదయం మంచు కురుస్తుంది. కాబట్టి, పిచ్‌ మందకోడిగా ఉండటంతో పాటు బంతి గింగిరాలు తిరుగుతుంది.  దీంతో నాలుగో రోజు భారత బ్యాట్స్‌మెన్‌ మొదటి సెషన్‌లో కొద్ది సేపు ఇబ్బంది పడవచ్చు. ప్రత్యర్థి జట్టుకు వికెట్లు తీసేందుకు కూడా ఇదే అనువైన సమయం. భారత్‌ మొదటి సెషన్‌లో వికెట్లు కోల్పోకుండా ఆడితే బ్యాటింగ్‌కు అనుకూలిస్తుంది. అందుకే, మొదటి సెషన్‌ ఆట ఇరుజట్లకు చాలా కీలకం కానుంది’ అని మైకేల్‌ వాన్‌ అభిప్రాయపడ్డారు.

మూడో రోజు ఆట ముగిసిన అనంతరం మైకేల్‌ వాన్‌ మాట్లాడుతూ.. ‘భారత్‌ ఇంకా చాలా వెనుకబడి ఉంది. కానీ, ఉదయం సెషన్‌లో వారు కేవలం ఒక వికెట్‌ను మాత్రమే కోల్పోయి అద్భుతంగా రాణించారు. గతంలో ఇదే వేదికపై భారత్‌ 4 వికెట్లు కోల్పోయినా విజయం సాధించింది. ప్రస్తుతం భారత్ కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయింది. అందుకే ఈ మ్యాచ్‌లో అద్భుతాలు జరుగవచ్చనిపిస్తోంది’ అని అన్నాడు.  

మూడో రోజు ఆటలో భాగంగా ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ జో రూట్‌ అనుసరించిన వ్యూహాలను వాన్‌ ప్రశంసించారు. ఫాస్ట్‌ బౌలర్లకు వెలుతురు సహకరించకపోవడంతో స్పిన్నర్లతో బౌలింగ్‌ చేయించడం, కొత్త బంతితో వికెట్లు తీసేందుకు ప్రయత్నించడం వంటి ఎత్తుగడలను అభినందించారు. మూడో రోజు ఆట ముగిసేసరికి భారత్‌ 139 పరుగులు వెనుకబడి ఉంది. ఇంకా 8 వికెట్లు చేతిలో ఉన్నాయి. ఛెతేశ్వర్‌ పుజారా(180 బంతుల్లో 91), విరాట్‌ కోహ్లీ(94 బంతుల్లో 45) క్రీజులో ఉన్నారు. 

2019లో ఆసిస్‌తో ఇక్కడే జరిగిన యాషెస్‌ సిరీస్‌లో ఇంగ్లాండ్‌ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ అద్భుతంగా రాణించి జట్టుకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. 219 బంతుల్లో 135 పరుగులు చేసి అజేయంగా నిలిచి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అది గొప్ప ఛేదనల్లో ఒకటిగా చరిత్రలో మిగిలిపోయింది. గతంలో మరో దిగ్గజ బ్యాట్స్‌మెన్ ఇయాన్‌ బోథమ్‌ కూడా ఇదే పిచ్‌లో 149 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించాడు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని