Kane Williamson: భారతీయులకు కోహ్లీసేన తర్వాత మేమే ఇష్టం!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవడం ఆనందంగా ఉందని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తన కెరీర్లో ఇదో ప్రత్యేక అనుభూతిగా పేర్కొన్నాడు. ఆటలో విజయాలు సాధించేందుకు  ఆటగాళ్లందరూ భాగమయ్యారని వివరించాడు. టీమ్‌ఇండియా తర్వాత భారత అభిమానులు..

Published : 24 Jun 2021 12:47 IST

కోహ్లీసేనపై గెలుపుతో క్రేజీ ఫీలింగ్‌: విలియమ్సన్‌

సౌథాంప్టన్‌: ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవడం ఆనందంగా ఉందని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. తన కెరీర్లో ఇదో ప్రత్యేక అనుభూతిగా పేర్కొన్నాడు. ఆటలో విజయాలు సాధించేందుకు ఆటగాళ్లందరూ భాగమయ్యారని వివరించాడు. టీమ్‌ఇండియా తర్వాత భారత అభిమానులు తమను రెండో ఫేవరెట్‌ జట్టుగా పరిగణిస్తారని వెల్లడించాడు.

న్యూజిలాండ్‌ గెలిచిన అతిపెద్ద ఐసీసీ టైటిల్‌ ఇదే. 2015, 2019 ప్రపంచకప్‌ టోర్నీల్లో ఆ జట్టు ఫైనల్లో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్లో టీమ్‌ఇండియా గెలవడం శిఖరస్థాయే అయినా న్యూజిలాండ్‌ సాధించిన అతిగొప్ప ఘనత మాత్రం ఇదే కాదని స్పష్టం చేశాడు.

‘కొంతకాలంగా నేనీ జట్టులో భాగమయ్యాను. చరిత్రలో తొలిసారి మేం ప్రపంచ టైటిల్‌ సాధించాం. ఇదో ప్రత్యేక అనుభూతి. రెండేళ్లుగా 22 మంది ఆటగాళ్లం ఆడాం. ఎవరి పాత్రకు వారు న్యాయం చేశారు. ఈ విజయంలో ఘనత సహాయ సిబ్బందికీ దక్కుతుంది. మా జట్టులో ఎప్పుడూ స్టార్లు ఉండరనే మేం భావిస్తాం. అందుకే మ్యాచులో పోటీనిచ్చేందుకు, నిలకడగా రాణించేందుకు అవకాశం ఉన్నవారినే ఉపయోగించుకుంటాం’ అని విలియమ్సన్‌ అన్నాడు.

‘అవును, ఇది శిఖర సమానమైన విజయమే. ఎవరు కాదనగలరు! టీమ్‌ఇండియాతో ఫైనల్‌ ఆడిన వ్యక్తిగా నేనది చెప్పగలను. 2019లోనూ మేం అద్భుతంగా క్రికెట్‌ ఆడాం. అయితే మాకిప్పుడు అనుకూలంగా ఫలితం రావడంతో కాస్త భిన్నమైన అనుభూతి కలుగుతోంది’ అని కేన్‌ తెలిపాడు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు ‘మంచోళ్లు’ అన్న మాటలపై అతడు స్పందించాడు.

‘ప్రజలు వారికిష్టమైన విధంగా వ్యాఖ్యలు చేస్తుంటారు. ఒక బృందంగా మేం నిజాయతీకి కట్టుబడతాం. మైదానంలో, బయటా మా ప్రవర్తన ఎలా ఉంటుందన్నదీ మాకు ముఖ్యమే. ఫైనల్లో టీమ్‌ఇండియాను ఓడించినంత మాత్రాన భారత అభిమానుల్లో మాపై ఇష్టం మారదనే అనుకుంటున్నా. బహుశా మేం వారి రెండో ఫేవరెట్‌ జట్టైనందుకు సంతోషిస్తున్నాం. ఇక మీదటా ఆ అభిమానం అలాగే ఉంటుందని భావిస్తున్నా’ అని కేన్‌ అన్నాడు.

చక్కని క్రీడా స్ఫూర్తి, పోటీతత్వంతో తాము నాణ్యమైన క్రికెట్‌ ఆడామని విలియమ్సన్‌ తెలిపాడు. గెలిచేందుకు, ఓడించేందుకు, డ్రా చేసుకొనేందుకు ఆఖరిరోజు పిచ్‌ అందరికీ సహకరించిందన్నాడు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ గెలవడం ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. సీనియర్‌ ఆటగాడైన రాస్‌టేలర్‌ తమతో ఉండటం అదృష్టమని వెల్లడించాడు. ఆటగాళ్లందరిపై ప్రశంసలు కురిపించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని