Updated : 29/12/2020 15:46 IST

అ‘ద్వితీయ’ పోరాటం స్ఫూర్తిదాయకం!

విమర్శకుల నోళ్లు మూయించిన రహానెసేన

తొలి టెస్టులో చేదు జ్ఞాపకం, భారత్‌ క్రికెట్‌ చరిత్రలోనే అత్యల్ప స్కోరు. అంతేగాక ప్రధాన ఆటగాళ్ల గైర్హాజరీ, టాస్‌ ఆసీస్‌ గెలవడం, ఆట మధ్యలోనే ఉమేశ్‌ యాదవ్‌ దూరమవ్వడం... ఇన్ని ప్రతికూలాంశాలతో రహానెసేన ఎలా పోరాడుతుందోనని అందరిలోనూ అనుమానాలు! కానీ భారత్‌ బెబ్బులిలా చెలరేగింది. అద్వితీయ పోరాటంతో కంగారూలను చిత్తుచేస్తూ స్ఫూర్తిదాయక విజయం సాధించింది. కుడోస్‌ టీమిండియా! మీ పోరాటం అపూర్వం, అసమానం, అభినందనీయం.

మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 36 పరుగులకే కుప్పకూలి జీర్ణించుకోలేని పరాజయాన్ని చవిచూసింది. దానికి తోడు కెప్టెన్ విరాట్ కోహ్లీ పితృత్వసెలవులపై స్వదేశానికి వెళ్లాడు. ప్రధాన పేసర్లు ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి సేవలు లేవు. మరోవైపు రోహిత్‌ శర్మ క్వారంటైన్‌లో ఉన్నాడు. కెప్టెన్సీలో గొప్ప అనుభవం లేని రహానెకి సారథి బాధ్యతలు. శుభ్‌మన్‌ గిల్‌, మహ్మద్‌ సిరాజ్ అరంగేట్రం. పైగా తలపడేది కంగారుల గడ్డపై ఆస్ట్రేలియాతో.

దీంతో మాజీ క్రికెటర్లు భారత్‌ సిరీస్‌లో ఘోర పరాజయాన్ని చవిచూస్తుందని జోస్యం చెప్పారు. ‘విరాట్‌ కోహ్లీ లేకపోతే భారత్‌కు కష్టమే. 4-0తో ఆస్ట్రేలియాదే సిరీస్’ అని రికీ పాంటింగ్‌, మైకేల్‌ వాన్, మార్క్‌ వా పేర్కొన్నారు. మైకేల్ క్లార్క్‌ ఇంకాస్త తొందరపడి.. ‘కోహ్లీ లేకుండా టీమిండియా కంగారూల గడ్డపై గెలిస్తే ఏడాది పాటు సంబరాలు చేసుకోవచ్చు’ అని మితిమీరిన వ్యాఖ్యలు చేశాడు. కానీ సీన్‌ కట్‌ చేస్తే రెండో టెస్టులో టీమిండియాదే సంపూర్ణ ఆధిపత్యం. ఆతిథ్య జట్టుకు ఎలాంటి అవకాశం లేకుండా రహానెసేన విజయం సాధించింది. 2018 పర్యటనలో తమ ఓటమిని కప్పిపుచ్చుకోవడానికి స్మిత్‌, వార్నర్‌ లేరని చెప్పుకొచ్చిన ఆస్ట్రేలియా మాజీల వద్ద ఇప్పుడు ఎలాంటి సమాధానం లేదు. ప్రపంచ మేటి బ్యాట్స్‌మెన్‌ కోహ్లీ లేకపోయినా భారత్ గర్వించదగిన విజయాన్ని అందుకుంది.


నాయకుడై నడిపించాడు

విజయంలో రహానెదే ప్రధాన పాత్ర. తన ప్రశాంతతో ఆతిథ్యజట్టును దెబ్బతీశాడు. తన ఎత్తులకు కంగారూలు బిత్తెరపోయారు. 11వ ఓవర్‌లోనే స్పిన్నర్‌ అశ్విన్‌తో బౌలింగ్ చేయించడం, మహ్మద్‌ సిరాజ్‌కు తొలి సెషన్‌ అనంతరం బంతిని అందించిన వ్యూహాలు ఫలించాయి. అంతేగాక బౌలర్లతో లాంగ్ స్పెల్ వేయించాడు. బౌలింగ్‌ శైలిని బట్టి ఫీల్డర్లను మోహరించి బ్యాట్స్‌మెన్‌ను బోల్తా కొట్టించాడు. ఇక అతడు సాధించిన శతకం ఓ అద్భుతం. కెప్టెన్‌ ఇన్నింగ్స్‌తో సహచర ఆటగాళ్లలో స్ఫూర్తి రగిలించాడు. మైదానంలో ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ మంచి ఫలితాలు రాబట్టాడు. అంతకుముందు కేవలం రెండు మ్యాచ్‌ల కెప్టెన్సీ అనుభవమే ఉన్న రహానె.. బాక్సింగ్ డే టెస్టులో జట్టును నడిపించిన తీరుకు ఎవరైనా టేక్ ఏ బౌ అనాల్సిందే!


యాష్‌+జడ్డూ మాయ

ఇక అశ్విన్‌, జడేజా ఇద్దరూ కలిస్తే ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌కు ముప్పుతిప్పలు తప్పవు. తొలి టెస్టులో సత్తాచాటిన అశ్విన్‌ బాక్సింగ్‌ డే టెస్టులో అదరగొట్టాడు. కీలక ఆటగాళ్ల వికెట్లు తీస్తూ ఆసీస్‌ స్కోరుకు కళ్లెం వేశాడు. అయిదు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు జడేజా రాకతో జట్టు బలోపేతంగా మారింది. బంతితో, బ్యాటుతో అలరించి విజయంలో తన పాత్ర పోషించాడు. అర్ధశతకం, మూడు వికెట్లతో తాను అత్యుత్తమ ఆల్‌రౌండర్‌ అని జడ్డూ మరోసారి నిరూపించాడు.


బూమ్‌..బూమ్‌ బుమ్రా

ఉమేశ్‌ యాదవ్‌ గాయంతో ఆట మధ్యలో మైదానాన్ని వీడినా, యువపేసర్‌ సిరాజ్‌తో కలిసి బుమ్రా పేస్ బాధ్యతల్ని గొప్పగా మోశాడు. ఒకవైపు సిరాజ్‌కు మార్గనిర్దేశం చేస్తూనే మరోవైపు వికెట్లవేట కొనసాగించాడు. తొలి ఇన్నింగ్స్‌లో నాలుగు వికెట్లతో కంగారూల నడ్డివిరిచిన అతడు రెండో ఇన్నింగ్స్‌లోనూ రెండు వికెట్లు పడగొట్టాడు. స్మిత్‌ను తెలివిగా బౌల్ట్‌ చేయడం మ్యాచ్‌లోనే హైలైట్‌.


అరంగేట్రం అదిరింది!

హైదరాబాదీ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌, యువ బ్యాట్స్‌మన్‌ శుభ్‌మన్‌ గిల్‌కు బాక్సింగ్ డే టెస్టు ఎప్పటికీ జ్ఞాపకంగా నిలుస్తుంది. ప్రతికూలాంశాల మధ్య అరంగేట్రం చేసిన వారిద్దరు ఆత్మవిశ్వాసంతో మంచి ప్రదర్శన చేశారు. విజయంలో ముఖ్య భూమిక పోషించారు. సిరాజ్‌ అయిదు వికెట్లతో సత్తాచాటాడు. గిల్‌ దీటుగా ఆసీస్‌ భీకర పేసర్లను ఎదుర్కొన్నాడు. తొలి మ్యాచ్ ఆడుతున్నా వారిద్దరిలో ఎలాంటి తడబాటు కనిపించలేదు.

ఇక పుజారా, పంత్, విహారి ఈ మ్యాచ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయినా జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ ఆవేశంతో షాట్లు ఆడేలా వికెట్ల వెనుక పంత్ నవ్వుతూ‌ రెచ్చగొట్టాడు. అంతేగాక బ్యాటింగ్ చేస్తున్నంత సేపు ధాటిగా ఆడుతూ ఆసీస్‌ బౌలర్లు ఆత్మరక్షణతో బౌలింగ్ చేసేలా చేశాడు. కాగా, మూడో టెస్టులోనూ టీమిండియా ఇలాంటి సమష్టి ప్రదర్శన చేస్తే సిరీస్‌ మనదే!

- ఇంటర్నెట్‌డెస్క్

ఇదీ చదవండి

రెండో టెస్టులో విజయం మనదే

ఒక రేంజ్‌ క్రికెటర్లు బాబూ..!

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని