నాటి ఆసీస్‌ లాభం.. కోహ్లీసేనతో నష్టమైందా?

స్థానం ఒక్కరిదే. కానీ బరిలోకి దిగింది మాత్రం ఇద్దరు ఆటగాళ్లు! రవీంద్ర జడేజా బ్యాటుతో విధ్వంసం సృష్టిస్తే.. చాహల్‌ బంతితో మాయ చేశాడు. అయితే తుదిజట్టులో అధికారికంగా ఉన్నది జడేజానే. కానీ ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచింది చాహల్‌.

Updated : 05 Dec 2020 20:28 IST

కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌తో కంగారూలకు భారత్‌ షాక్‌

స్థానం ఒక్కరిదే. కానీ బరిలోకి దిగింది మాత్రం ఇద్దరు ఆటగాళ్లు! రవీంద్ర జడేజా బ్యాటుతో విధ్వంసం సృష్టిస్తే.. చాహల్‌ బంతితో మాయ చేశాడు. అయితే తుదిజట్టులో అధికారికంగా ఉన్నది జడేజానే. కానీ ‘మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిందేమో చాహల్‌. ఈ అనూహ్య సంఘటన భారత్‌×ఆస్ట్రేలియా తొలి టీ20లో జరిగింది. ఇప్పుడు క్రికెట్ ప్రపంచమంతా దీనిపైనే చర్చిస్తోంది. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా జట్టులోకి వచ్చి చాహల్ చేసిన ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. కాగా, తుదిజట్టులో లేకపోయినా కంకషన్‌ ఆటగాడు జట్టుకు వెన్నెముకగా నిలిచిన సందర్భం ఇదే తొలిసారి కాదు. గతంలో ఆస్ట్రేలియా ఇలానే ఓటమి కోరల్లోంచి బయటపడింది. ఇప్పుడదే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌తో ఆసీస్‌ను భారత్‌ ఎదురుదెబ్బ కొట్టింది.

మ్యాచ్‌లో ఆటగాడి తలకి బలమైన గాయమైతే, అతడు ఆటను కొనసాగించలేని స్థితిలో ఉంటే మరో క్రీడాకారుడు తుదిజట్టులోకి రావొచ్చు. అతడు బ్యాటింగ్‌/బౌలింగ్‌ కూడా చేయొచ్చు. అతడినే కంకషన్ సబ్‌స్టిట్యూట్‌ అంటారు. సాధారణంగా సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు కేవలం ఫీల్డింగ్‌కే పరిమితం. కానీ కంకషన్ సబ్‌స్ట్టిట్యూట్‌‌ తుదిజట్టులో సభ్యుడి మాదిరిగానే బంతి‌/బ్యాటుతో అలరించవచ్చు. ఐసీసీ ఈ నిబంధనలను గతేడాది తీసుకువచ్చింది. కాగా, వీటిని తొలిసారిగా ఉపయోగించింది మాత్రం ఆస్ట్రేలియానే. యాషెస్‌ సిరీస్‌లో కంకషన్ సబ్‌స్టిట్యూట్‌తో ఓ మ్యాచ్‌లో ఓటమి నుంచి తప్పించుకుంది.

యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లాండ్‌×ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టెస్టులో స్టీవ్‌ స్మిత్‌ కంకషన్‌కు గురయ్యాడు. పేసర్ జోఫ్రా ఆర్చర్‌ వేసిన బౌన్సర్‌ స్మిత్ మెడకు బలంగా తాకింది. దీంతో ఇబ్బంది పడిన స్మిత్ మైదానాన్ని వీడాడు. విశ్రాంతి తీసుకున్న అనంతరం క్రీజులోకి వచ్చి మరో 12 పరుగులు చేసి ఔటయ్యాడు. మొత్తంగా తొలి ఇన్నింగ్స్‌లో 92 పరుగులు చేశాడు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో అతడి స్థానంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా లబుషేన్ వచ్చాడు. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్‌ 47 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ‌ఈ దశలో లబుషేన్‌ (59) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌ ఆడాడు. హెడ్‌ (42)తో కలిసి వికెట్ల పడకుండా ఇన్నింగ్స్‌ చక్కదిద్ది జట్టును ఓటమి నుంచి తప్పించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తొలి కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా క్రీజులోకి వచ్చి మ్యాచ్ గమనాన్ని మార్చిన లబుషేన్‌పై అప్పట్లో ప్రశంసల జల్లు కురిసింది.


ఓకే మ్యాచ్‌లో ఇద్దరు కంకషన్‌ సబ్‌స్టిట్యూట్లు

ఆ తర్వాత భారత్×బంగ్లాదేశ్‌ డే/నైట్‌ టెస్టు సమయంలో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ గురించి అందరూ మాట్లాడుకున్నారు. ఈ మ్యాచ్‌లో ఇద్దరు బంగ్లాదేశీయులు  కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా మైదానంలోకి వచ్చారు. అది కూడా టెస్టు తొలి రోజే కావడం గమనార్హం. భారత బౌలర్లు వేసిన బౌన్సర్లు నయీమ్‌ హసన్‌, లిటన్‌ దాస్‌ హెల్మెట్లకు తగలడంతో వారి స్థానాల్లో తైజుల్ ఇస్లామ్‌, మెహిద్‌ హసన్‌ వచ్చారు. ఆ తర్వాత కంకషన్‌ సబ్‌స్టిట్యూట్ గురించి మరోసారి జోరుగా చర్చసాగింది భారత్‌×ఆస్ట్రేలియా వన్డేలో. ఈ ఏడాది జనవరిలో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో పంత్‌ కంకషన్‌కు గురవ్వడంతో కేఎల్ రాహుల్‌ వికెట్‌కీపింగ్‌ బాధ్యతలు అందుకున్నాడు. ఆ తర్వాత టీమిండియా పరిమిత ఓవర్ల వికెట్‌కీపర్‌గా రాహుల్ స్థిరపడ్డాడు.


జడేజా-చాహల్‌

తాజాగా కాన్‌బెర్రా వేదికగా శుక్రవారం జరిగిన తొలి టీ20లో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్ గురించి విస్తృతంగా చర్చ సాగుతోంది. భారత ఇన్నింగ్స్‌ ఆఖరి ఓవర్‌లో స్టార్క్‌ వేసిన బౌన్సర్‌ జడేజా హెల్మెట్‌కు తాకింది. అనంతరం అతడి స్థానంలో చాహల్‌ ఫీల్డింగ్‌కు వచ్చాడు. పవర్‌ప్లే అనంతరం బంతిని అందుకొని మూడు కీలక వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే ఆల్‌రౌండర్‌ జడేజా స్థానంలో నాణ్యమైన స్పిన్నర్‌ చాహల్ జట్టులోకి ఎలా వస్తాడని, అంతేగాక జడ్డూ తొడకండరాలు పట్టేడయడంతో బ్యాటింగ్‌ చేస్తూ బాధపడ్డాడని.. కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ నిర్ణయం సరికాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు బ్యాట్స్‌మెన్‌ను కట్టడిచేసే జడేజా స్థానంలో చాహల్‌ వస్తే తప్పేంటని మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు.

కాగా, భారత్‌ నిబంధనల ప్రకారమే కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌ను జట్టులోకి తీసుకుంది. పూర్తి ఓవర్లు బౌలింగ్‌ చేయగలిగే జడేజా స్థానంలో నిబంధనలకు లోబడే చాహల్‌ జట్టులోకి వచ్చాడు. మయాంక్ అగర్వాల్, శ్రేయస్‌ అయ్యర్‌, జస్ప్రీత్‌ బుమ్రా, నవదీప్‌ సైని, చాహల్‌ బెంచ్‌కు పరిమితమయ్యారు. వీరిలో నలుగురు ఆటగాళ్లను సబ్‌స్టిట్యూట్‌గా ఫీల్డర్లుగా టాస్‌ సమయంలో కోహ్లీ అంపైర్‌కు తెలిపాడు. అయితే మయాంక్‌, శ్రేయస్‌ బౌలింగ్ చేయలేరు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకొని బుమ్రా, సైనీకి విశ్రాంతినిచ్చారు. దీంతో కంకషన్‌ సబ్‌స్టిట్యూట్‌గా సరిపోయేది చాహల్ మాత్రమే. దీంతో అతడు జట్టులోకి వచ్చాడు. అయితే బంతి హెల్మెట్‌కు తాకిన తర్వాత జడేజా సాధారణంగా ఉన్నాడని కొందరు నెటిజన్లు కంకషన్‌ నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. అయితే తలకి సంబంధించిన గాయం తీవ్రత వెంటనే బయటపడదు. యాషెస్‌ సిరీస్‌లో స్మిత్‌ కంకషన్‌కు గురైన తర్వాత బ్యాటింగ్‌ చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్‌లో కంకషన్‌ ప్లేయర్‌గా లబుషేన్ వచ్చాడు. అందుకు డిలేయ్‌డ్‌ కంకషన్‌ కారణం.

- ఇంటర్నెట్‌డెస్క్‌

ఇవీ చదవండి: 
ఒక్కడు ఇద్దరై..

జడ్డూ బదులు చాహల్‌: ఆసీస్‌ కోచ్‌ చిందులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని