Dhinidhi Desinghu: వయసు 13.. పతకాల వేటలో ముందంజ..

ఆ అమ్మాయి వయసు 13 ఏళ్లే.. కానీ మూడు జాతీయ రికార్డులు ఖాతాలో ఉన్నాయి. అంతేకాదు ఆసియా క్రీడల్లోనూ (Asian Games 2022) పోటీపడుతోంది. నమ్మశక్యంగా లేదు కదా..! కానీ దైనంది దేసింగు (Dhinidhi Desinghu) ఘనత ఇది.

Updated : 27 Sep 2023 15:14 IST

ఆ అమ్మాయి వయసు 13 ఏళ్లే.. కానీ మూడు జాతీయ రికార్డులు ఖాతాలో ఉన్నాయి. అంతేకాదు ఆసియా క్రీడల్లోనూ (Asian Games 2022) పోటీపడుతోంది. నమ్మశక్యంగా లేదు కదా..! కానీ దైనంది దేసింగు (Dhinidhi Desinghu) ఘనత ఇది. బెంగళూరుకు చెందిన ఈ బాలిక ఇటీవలే స్విమ్మింగ్‌ (Swimming)లోకి వచ్చినా సీనియర్లను వెనక్కి నెట్టి అసాధారణంగా రాణిస్తోంది. 

రికార్డులే రికార్డులు

ఈ ఏడాది మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ ఈవెంట్లో 2 నిమిషాల 4.24 సెకన్ల టైమింగ్‌తో దైనంది జాతీయ రికార్డు నెలకొల్పింది. అంతేకాదు 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో 57.67 సెకన్లలో పూర్తి చేసి మన్నా పటేల్‌ పేరిట తొమ్మిదేళ్లుగా ఉన్న రికార్డును తిరగరాసింది. 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్లో 2 నిమిషాల 23.67 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసి మరో రికార్డు ఖాతాలో వేసుకుంది. ఇలా పూల్‌లో దిగితే చాలు రికార్డులు కొల్లగొడుతున్న దైనంది.. చైనాలోని హాంగ్‌జౌలో జరుగుతున్న ఆసియా క్రీడల్లోనూ తన ముద్ర వేసింది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో హీట్స్‌లో 12వ స్థానంలో నిలిచి సత్తా చాటింది. ఎంతో అనుభవం ఉన్న, గట్టిపోటీ ఇచ్చే స్విమ్మర్లు బరిలో దిగే ఆసియా క్రీడల్లో ఈ స్థానంలో నిలవడమే 13 ఏళ్ల దైనందికి గోల్డ్‌ మెడల్‌ గెలిచినంత ఆనందాన్ని ఇస్తోంది. 

8 ఏళ్లకి పూల్‌లో దిగి

నిజానికి దైనంది స్విమ్మింగ్‌ చాలా ఆలస్యంగా నేర్చుకుంది. ఎనిమిదేళ్ల వయసులో పూల్‌లోకి వచ్చింది. డాల్ఫిన్‌ అక్వాటిక్‌ సెంటర్‌లో కోచ్‌ మధు కుమార్‌ శిక్షణలో మెరుగైన దైనంది అయిదేళ్ల వ్యవధిలోనే ఆసియా క్రీడల్లో పాల్గొనే స్థాయికి వెళ్లింది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్, 200 మీటర్ల బటర్‌ఫ్లైలో దినింది మెరుగైన ప్రదర్శన చేస్తోంది. 

14 ఏళ్ల హషిక కూడా..

ఆసియా క్రీడలకు వెళ్లిన భారత బృందంలో మరో బెంగళూరు బాలిక హషిక రామచంద్ర కూడా స్విమ్మింగ్‌లో సత్తా చాటుతోంది. దైనంది మాదిరిగానే ఆలస్యంగానే స్విమ్మింగ్‌ నేర్చుకున్నా పూల్‌లో అదరగొడుతోంది. ఆరంభంలో మిగిలిన పిల్లల్లాగే సరదాగా స్విమ్‌ చేసిన ఈ టీనేజర్‌.. ఆ తర్వాత పతకాల కోసం పోటీపడే స్థాయికి ఎదిగింది. కోచ్‌ విక్రమ్‌ ట్రైనింగ్‌లో స్విమ్మింగ్‌లో పట్టు సాధించిన ఆమె పతకాల వేట మొదలుపెట్టింది. అయితే 2017లో నాన్న రామచంద్ర క్యాన్సర్‌తో చనిపోవడం హషికకు శరాఘాతంలా తగిలింది. కానీ నెమ్మదిగా కోలుకుని నాన్న ఎంతో ఇష్టపడే స్విమ్మింగ్‌లో రాణించాలనే పట్టుదలతో ముందుకెళ్తోంది. గతేడాది అక్టోబర్‌లో జాతీయ క్రీడల్లో ఉత్తమ స్విమ్మర్‌గా పురస్కారాన్ని గెలుచుకుంది. ఈ ఏడాది జులైలో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ అక్వాటిక్స్‌లో హషిక 200 మీటర్ల మెడ్లేలో 2 నిమిషాల 21.15 సె టైమింగ్‌తో 2010లో రిచా మిశ్రా (2 నిమిషాల 23.62 సె) నెలకొల్పిన జాతీయ రికార్డును బద్దలు కొట్టింది. ఆసియా క్రీడల్లో 200 మీటర్ల మెడ్లేలో 16వ స్థానంలో నిలిచింది హషిక. పిన్న వయసులోనే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన దైనంది, హషికలకు ఒలింపిక్స్‌లో సత్తా చాటాలనేది కల.

- ఈనాడు క్రీడా విభాగం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని