సాధనలో ఆటగాళ్లు.. సానియాకు శుభాకాంక్షల వెల్లువ

ఆస్ట్రేలియాతో పోరుకు భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, నటరాజన్‌ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టెన్నిస్‌ స్టార్‌ సానియా

Updated : 16 Nov 2020 05:30 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఆస్ట్రేలియాతో పోరుకు భారత ఆటగాళ్లు సాధన మొదలుపెట్టారు. నెట్స్‌లో విపరీతంగా శ్రమిస్తున్నారు. రవిచంద్రన్‌ అశ్విన్‌, నటరాజన్‌ బౌలింగ్ చేస్తున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో ఆకట్టుకుంటున్నాయి. మరోవైపు టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా పుట్టినరోజు సందర్భంగా క్రీడాకారులు, అభిమానులు ఆమెకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అలాంటి క్రీడాకారుల ఆసక్తికర పోస్టులు మీ కోసం..

* నెట్స్‌లో బౌలింగ్‌ చేస్తున్న నటరాజన్‌ వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్ట్ చేసింది. ‘‘ఐపీఎల్‌లో విజయవంతమైన నటరాజన్‌ను చూశాం. ఇప్పుడు టీమిండియాకు తొలిసారిగా ఎంపికై అతడు నెట్స్‌లో సాధన చేస్తున్నాడు. అతడి కల నిజమైంది’’ అని వ్యాఖ్య జత చేసింది. దీన్ని బ్యాటింగ్ దిగ్గజం వీవీఎస్‌ లక్ష్మణ్‌ రీట్వీట్‌ చేశాడు. నటరాజన్‌ది స్ఫూర్తిదాయక ప్రయాణమని అన్నాడు.

* అశ్విన్‌ నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్నాడు. బౌలింగ్ చేస్తున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. మయాంక్‌ అగర్వాల్‌ కూడా తన చిత్రాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. ‘‘నీలిరంగు జెర్సీ ధరించినప్పుడు కలిగే భావన వివరించలేనిది. వచ్చే మూడు నెలలు కోసం ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నా’’ అని మయాంక్‌ దానికి వ్యాఖ్య జత చేశాడు.

* టీమిండియా శారీరక కసరత్తులు చేస్తోంది. పోటీలు నిర్వహించి ఫిట్‌నెస్‌ను పొందుతున్నారు. మయాంక్‌ అగర్వాల్, శుభ్‌మన్‌ గిల్, మనీష్‌ పాండే ప్లాక్‌ ఛాలెంజ్‌ చేస్తున్న ఫొటోని బీసీసీఐ పోస్ట్ చేసింది.

* బెంగాలీ నట దిగ్గజం సౌమిత్ర ఛటర్జీ మరణవార్త యావత్తు భారతదేశాన్ని విషాదంలో ముంచెత్తింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం తుదిశ్వాస విడిచారు. సౌమిత్ర మరణంపై బీసీసీఐ అధ్యక్షుడు సంతాపం వ్యక్తం చేశారు. ‘‘మీరు ఎంతో చేశారు. ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా’’ అని గంగూలీ ట్వీట్ చేశాడు.

* సానియా మీర్జాకు జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. టీమిండియా మాజీ క్రికెటర్లు యువరాజ్‌ సింగ్, హర్భజన్‌ సింగ్, సురేశ్‌ రైనా శుభాకాంక్షలు తెలిపారు. ‘‘మిర్చి మమ్మీ సానియాకు జన్మదిన శుభాకాంక్షలు. ఈ ఏడాది మీకు ‘ఏస్‌’లా కలిసిరావాలని కోరుకుంటున్నా’’ అని యువరాజ్‌ ట్వీట్ చేశాడు. టెన్నిస్‌లో ఏస్‌ సర్వీస్‌ షాట్‌ అందరికీ తెలిసిందే. ప్రత్యర్థికి బంతి అందకుండా ఆడే షాట్ ఇది.









Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని