Updated : 23 May 2022 10:29 IST

Umran Malik: ఉమ్రాన్‌ వచ్చేశాడు

టీ20 జట్టులో చోటు.. అర్ష్‌దీప్‌కూ ఛాన్స్‌

దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు కెప్టెన్‌గా రాహుల్‌

టెస్టుల్లోకి పుజారా పునరాగమనం 

దిల్లీ

జమ్ముకశ్మీర్‌ యువ పేస్‌ బౌలింగ్‌ సంచలనం ఉమ్రాన్‌ మాలిక్‌కు ఊహించినట్లే జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికాతో అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎంపిక చేసిన 18 మంది జట్టులో అతడితో పాటు మరో యువ పేసర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌కూ చోటు దక్కింది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ ఈ సిరీస్‌కు విశ్రాంతి తీసుకోవడంతో కేఎల్‌ రాహుల్‌ జట్టును నడిపించనున్నాడు. దీంతో పాటు ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ కోసం సెలక్టర్లు జట్టును ప్రకటించారు.

భారత్‌ క్రికెట్‌ లీగ్‌లో అదరగొట్టి టీమ్‌ఇండియాలో చోటు దక్కించుకున్న కుర్రాళ్ల జాబితాలో ఉమ్రాన్‌ మాలిక్, అర్ష్‌దీప్‌ సింగ్‌ కూడా చేరారు. ఈ సీజన్లో హైదరాబాద్‌ తరఫున మెరుపు వేగంతో బౌలింగ్‌ చేస్తూ వికెట్ల పంట పండించిన ఉమ్రాన్, కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పంజాబ్‌ జట్టులో కీలక బౌలర్‌గా మారిన అర్ష్‌దీప్‌ సింగ్‌లను దక్షిణాఫ్రికాతో అయిదు టీ20ల సిరీస్‌లో తలపడే భారత జట్టుకు సెలక్టర్లు ఎంపిక చేశారు. టీమ్‌ఇండియాలో చోటు దక్కడం వీరికి ఇదే తొలిసారి. ఈ సీజన్‌లో ఉమ్రాన్‌ 13 మ్యాచ్‌ల్లో 21 వికెట్లు చేజిక్కించుకున్నాడు. అర్ష్‌దీప్‌ 13 మ్యాచ్‌ల్లో 10 వికెట్లే పడగొట్టినా ఆఖరి ఓవర్లలో అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. చాలా మంది మాజీ క్రికెటర్లు, క్రికెట్‌ పండితులు ఉమ్రాన్‌ ఎంపిక చేయాలని ముక్త కంఠంతో అన్నారు. కానీ లఖ్‌నవూ ఎడమచేతి వాటం పేసర్‌ మోసిన్‌ ఖాన్‌ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండి ఉంటే ఉమ్రాన్‌ ఎంపిక తేలికయ్యేది కాదు. 8 మ్యాచ్‌ల్లో 5.93 ఎకానమీతో 13 వికెట్లు పడగొట్టడం ద్వారా మోసిన్‌ కూడా సెలక్టర్లను ఆకట్టుకున్నాడు. కానీ అతడు తొడకండరాల గాయంతో ఇబ్బందిపడుతుండడం సెలక్టర్ల పనిని తేలిక చేసింది. ముందే అనుకున్నట్లు సీనియర్‌ ఆటగాళ్లు కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, బుమ్రా, షమిలకు విశ్రాంతినిచ్చారు. గాయాలతో బాధపడుతుండడం వల్ల జడేజా, దీపక్‌ చాహర్, సూర్యకుమార్‌ యాదవ్‌లను ఎంపిక చేయలేదు. సిరాజ్, సంజు శాంసన్‌లకు ఈసారి అవకాశం దక్కలేదు. పూర్తి ఫిట్‌నెస్‌ సాధించి ఐపీఎల్‌లో రాణిస్తోన్న ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య తిరిగి జట్టులోకి వచ్చాడు. ఈ సీజన్‌లో తన ఫినిషింగ్‌ నైపుణ్యంతో ఆకట్టుకున్న వెటరన్‌ ఆటగాడు దినేశ్‌ కార్తీక్‌ 36 ఏళ్ల వయసులో పునరాగమనం చేశాడు. కార్తీక్‌ను రెండో వికెట్‌కీపర్‌గా, ఇషాన్‌ కిషన్‌ను ఓపెనర్‌గా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రోహిత్‌ గైర్హాజరీ నేపథ్యంలో ఈ సిరీస్‌ కోసం కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. పంత్‌ ఉపసారథి. ఈ సిరీస్‌ జూన్‌ 9న ఆరంభం కానుంది.

కొత్త ముఖాలు లేవు..: సెలక్షన్‌ కమిటీ ఇంగ్లాండ్‌తో టెస్టు మ్యాచ్‌ (వాయిదా పడ్డ అయిదో టెస్టు)కు కూడా జట్టును ప్రకటించింది. సీనియర్‌ ఆటగాడు చెతేశ్వర్‌ పుజారా పునరాగమనం చేయడం ఈ ఎంపికలో విశేషం. కౌంటీ క్రికెట్లో పరుగుల వరద పారించడం అతడికి కలిసొచ్చింది. ససెక్స్‌ తరఫున పుజారా అయిదు మ్యాచ్‌ల్లో రెండు డబుల్‌ సెంచరీలు, రెండు సెంచరీలు చేయడంతో సెలక్టర్లకు అతణ్ని ఎంపిక చేయక తప్పలేదు. జట్టులో కొత్త ముఖాలేమీ లేవు. భరత్‌ ఇక అధికారికంగా రెండో వికెట్‌కీపర్‌. సీనియర్‌ వికెట్‌కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాకు సెలక్టర్లు ఇంతకుముందే ఉద్వాసన పలికిన సంగతి తెలిసిందే. భారత్, ఇంగ్లాండ్‌ అయిదో టెస్టు జులై 1న ఆరంభమవుతుంది. రోహిత్, కోహ్లి, అశ్విన్, జడేజా, బుమ్రా జూన్‌ 15న ఇంగ్లాండ్‌ బయల్దేరతారు. అక్కడ పుజారా వారితో కలుస్తాడు.

టీ20 జట్టు: రాహుల్, రుతురాజ్, ఇషాన్‌ కిషన్, దీపక్‌ హుడా, శ్రేయస్‌ అయ్యర్, పంత్, దినేశ్‌ కార్తీక్, హార్దిక్‌ పాండ్య, వెంకటేశ్‌ అయ్యర్, చాహల్, కుల్‌దీప్‌ యాదవ్, అక్షర్‌ పటేల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్, హర్షల్‌ పటేల్, అవేష్‌ ఖాన్, అర్ష్‌దీప్‌ సింగ్, ఉమ్రాన్‌ మాలిక్‌.

టెస్టు జట్టు: రోహిత్, రాహుల్, గిల్, కోహ్లి, శ్రేయస్‌ అయ్యర్, హనుమ విహారి, పుజారా, పంత్, భరత్, జడేజా, అశ్విన్, శార్దూల్, షమి, బుమ్రా, సిరాజ్, ఉమేశ్‌ యాదవ్, ప్రసిద్ధ్‌ కృష్ణ.

Read latest Sports News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని