Kohli-Pant: ‘కోహ్లీ అలా చేస్తే రిషభ్‌ పంత్‌ సంతోషిస్తాడు’

టీ20 ప్రపంచ కప్ 2024లో ఓపెనర్‌గా దిగి విఫలమవుతున్న విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే రిషభ్‌ పంత్ సంతోషిస్తాడని భారత మాజీ పేసర్ శ్రీశాంత్‌ పేర్కొన్నాడు. 

Published : 15 Jun 2024 18:20 IST

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ముగిసిన ఐపీఎల్-17 సీజన్‌లో అదరగొట్టిన విరాట్ కోహ్లీ (Virat Kohli).. టీ20 ప్రపంచ కప్‌లో మాత్రం విఫలమవుతున్నాడు. రోహిత్‌తో కలిసి ఓపెనింగ్‌ చేస్తున్న విరాట్‌ తొలి మూడు మ్యాచ్‌ల్లో కలిపి 5 పరుగులే చేశాడు. న్యూయార్క్‌లోని కఠినమైన పిచ్‌పై కొత్త బంతిని అంచనా వేయడంలో కోహ్లీ తడబడ్డాడు. అక్కడ మ్యాచ్‌లు ముగియడం, సూపర్‌-8కు సమయం దగ్గరపడటంతో ఇకనుంచైనా ‘కింగ్’ ఫామ్‌ అందుకోవాలని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు. మరోవైపు, మూడో స్థానంలో వస్తున్న రిషభ్ పంత్ (Rishabh Pant) అదరగొడుతున్నాడు. మూడు మ్యాచ్‌ల్లో కలిపి 96 పరుగులు చేశాడు. ఒకవేళ కోహ్లీ తిరిగి మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా రిషభ్ పంత్‌కు ఏ ఇబ్బంది ఉండదని భారత మాజీ పేసర్ శ్రీశాంత్ అభిప్రాయపడ్డాడు. విరాట్ మూడో స్థానంలో ఆడి పరుగులు రాబడితే పంత్ సంతోషిస్తాడని పేర్కొన్నాడు. రిషభ్‌ పంత్‌ ఏ స్థానంలోనైనా ఆడే సత్తా ఉన్న ఆటగాడని, కాబట్టి స్థానం మారినా అతడు ఫామ్‌ కొనసాగిస్తాడని శ్రీశాంత్ వివరించాడు. 

‘‘పంత్ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనే ఆటగాడు. అతడు వివిధ స్థానాల్లో బ్యాటింగ్ చేయడం మనం చూశాం. పంత్‌ అద్భుతమైన ఆటగాడు. విరాట్ కోహ్లీ తిరిగి మూడో స్థానంలోకి వస్తే పంత్ సంతోషిస్తాడని భావిస్తున్నా. పంత్ పరిస్థితుల్ని, పిచ్‌, బౌలర్‌ని చూడటం లేదు. అతడు బంతిని మాత్రమే చూస్తూ ధనాధన్ ఆటతో అలరిస్తున్నాడు. ఒకవేళ కోహ్లీ మూడో స్థానంలో వచ్చి భారీగా పరుగులు చేస్తే పంత్ సంతోషిస్తాడు. కోహ్లీ వన్‌డౌన్‌లో వస్తే తర్వాత వచ్చే పంత్‌ స్వేచ్ఛగా బ్యాట్ ఝుళిపిస్తాడు’’ అని శ్రీశాంత్ పేర్కొన్నాడు. 

ఈ టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా ప్రదర్శన బాగుందని, బుమ్రాతో ఇతర బౌలర్లు అదరగొడుతున్నారని భారత మాజీ పేసర్ అన్నాడు. ఫైనల్‌లో భారత్, ఆస్ట్రేలియా తలపడే అవకాశముందన్నాడు. వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఓటమికి ఈసారి భారత్‌ బదులు తీర్చుకుంటుందని భావిస్తున్నానని శ్రీశాంత్ పేర్కొన్నాడు. గతేడాది వన్డే వరల్డ్ కప్‌ ఫైనల్‌లో ఆసీస్‌ చేతిలో భారత్ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని