
IPL 2021:సన్‌రైజర్స్ గెలవడానికి ఆడాలి.. అతడికి వీడ్కోలు పలకడానికి కాదు: గంభీర్
ఇంటర్నెట్ డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) ఈ ఐపీఎల్ సీజన్‌లో అత్యంత పేలవ ప్రదర్శనను కనబరుస్తూ అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడిన ఎస్‌ఆర్‌హెచ్ కేవలం మూడు మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. శుక్రవారం రాత్రి ముంబయి ఇండియన్స్‌తో తమ చివరి మ్యాచ్‌ను ఆడనుంది. కాగా, ఈ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్న డేవిడ్ వార్నర్ ఈ సీజన్‌లో అంతగా రాణించలేకపోయాడు. దీంతో అతడిని కొన్ని మ్యాచ్‌ల నుంచి తుది జట్టులోకి కూడా తీసుకోలేదు.
ఈ నేపథ్యంలో డేవిడ్ వార్నర్ గురించి ఆసక్తికర చర్చ నడుస్తోంది. వచ్చే సీజన్‌లో వార్నర్ ఆరెంజ్ ఆర్మీకి దూరమవుతాడనే వార్తలు వస్తున్నాయి. 2016లో సన్‌రైజర్స్ ఛాంపియన్‌గా నిలిపిన వార్నర్‌కి చివరి మ్యాచ్‌లోనైనా అవకాశం ఇచ్చి వీడ్కోలు పలకాలని అభిమానులు సామాజిక మాధ్యమాల వేదికగా కోరుతున్నారు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. గెలవడానికే మ్యాచ్‌లు ఆడాలి తప్ప వ్యక్తులకు వీడ్కోలు పలకడానికి కాదు అని ఘాటుగా స్పందించాడు.
‘చాలా మంది గొప్ప గొప్ప ఆటగాళ్లకే వీడ్కోలు మ్యాచ్‌లు ఆడే అవకాశం రాలేదు. కొంతమంది దిగ్గజ ఆటగాళ్లకు కూడా ఈ అవకాశం మిస్సయింది. ఈ విషయం మనందరికీ తెలుసు. అసలు వీడ్కోలు మ్యాచ్ వ్యవస్థ ఏమిటో నాకైతే ఏమీ అర్థం కావడం లేదు. ఎవరైనా గెలుపే అంతిమ లక్ష్యంగా మ్యాచ్ ఆడతారు. తుదిజట్టులో అత్యుత్తమ ఫామ్‌లో ఉన్న పదకొండు మంది ఆటగాళ్లలో అతడూ ఒకడైతే కచ్చితంగా ఆడతాడు. అంతేగానీ.. అతడికి తుదిజట్టులో చోటు ఇవ్వాలనే నిబంధనేం లేదు కదా. కాబట్టి సన్‌రైజర్స్ మ్యాచ్ గెలవాలి. కానీ, వీడ్కోలు పలకడానికి పరిమితం కాకూడదు’ అని వార్నర్‌ని ఉద్దేశించి గంభీర్ పరోక్షంగా వ్యాఖ్యలు చేశాడు.