Hasaranga: టెస్టు క్రికెట్‌కు వనిందు హసరంగ గుడ్‌బై!

శ్రీలంక స్టార్‌ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడిన అతడు తన పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెరీర్‌ను పొడిగించుకోవడానికిఈ మేరకు నిర్ణయం తీసుకున్నాడు.

Published : 15 Aug 2023 14:12 IST

ఇంటర్నెట్ డెస్క్: శ్రీలంక ఆల్‌రౌండర్‌ వనిందు హసరంగ (Wanindu Hasaranga) కీలక నిర్ణయం తీసుకున్నాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ కెరీర్‌ను కొనసాగించడానికి వీలుగా టెస్టు ఫార్మాట్‌కు వీడ్కోలు చెబుతున్నట్లు ప్రకటించాడు. దక్షిణాఫ్రికాతో డిసెంబర్ 2020లో సుదీర్ఘ ఫార్మాట్‌లోకి అరంగేట్రం చేసిన హసరంగ కేవలం నాలుగు టెస్టులు మాత్రమే ఆడాడు. తన రిటైర్‌మెంట్‌ నిర్ణయాన్ని ఇప్పటికే శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు తెలియజేయగా.. ఆమోదం తెలిపింది. ఈ మేరకు బోర్డు ప్రకటన విడుదల చేసింది. ‘‘శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయాన్ని మేం గౌరవిస్తున్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌ను పొడిగించడానికే అతడు ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. బోర్డు కూడా ఆమోదం తెలిపింది’’ అని సీఈవో ఆష్లే డిసిల్వా తెలిపారు. హసరంగా ఇప్పటి వరకు శ్రీలంక తరఫున 48 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఆసియా కప్, వన్డే ప్రపంచ కప్‌లో హసరంగ కీలకమవుతాడని శ్రీలంక అభిమానులు ఆశిస్తున్నారు.


భారత్‌తో వన్డే సిరీస్‌కు కమిన్స్‌!

ఎడమ మోచేతి గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్న ఆసీస్‌ కెప్టెన్ ప్యాట్‌ కమిన్స్‌ (Pat Cummins) సెప్టెంబర్‌లో భారత్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు అందుబాటులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆరువారాల విశ్రాంతి తీసుకుంటాడని ఆసీస్‌ కోచ్‌ ఇదివరకు వెల్లడించాడు. అయితే, భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్‌ వంటి మెగా టోర్నీకి ముందు టీమ్‌ఇండియాతో సిరీస్‌ ఆడటం కలిసొచ్చే అంశమని, దానిని సద్వినియోగం చేసుకోవడానికే కమిన్స్‌ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా పేర్కొంది. ‘‘దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు అందుబాటులో ఉండటం కష్టమే. కానీ భారత్‌తో ఆడేందుకు సిద్ధమవుతా. గాయం మరీ పెద్దది కాలేదు. కొన్ని వారాల్లో కోలుకుని వచ్చేస్తా’’ అంటూ కమిన్స్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని