
T20 World Cup: వెస్టిండీస్‌పై శ్రీలంక విజయం
కీలక మ్యాచ్‌లో విజయం సాధించి సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుందామనుకున్న వెస్టిండీస్ ఆశలు గల్లంతయ్యాయి. ఇక ఇప్పటికే సెమీస్ అవకాశాలు చేజార్చుకున్న శ్రీలంక జట్టు వెస్టిండీస్‌ను ఓడించి దాని సెమీస్ ఆశలను వమ్ముచేసింది. 5 మ్యాచ్‌ల్లో శ్రీలంక కేవలం రెండు విజయాలు సాధించి మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఇక సూపర్ 12 గ్రూప్ 1 నుంచి ఇప్పటికే ఇంగ్లాండ్ సెమీస్ బెర్త్ ఖరారు చేసుకోగా, రెండో స్థానం కోసం ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా పోటీపడుతున్నాయి. వెస్టిండీస్ 4 మ్యాచుల్లో కేవలం 1 మ్యాచ్ మాత్రమే గెలిచింది. ఈ మెగా టోర్నీలో ఇక తన చివరి మ్యాచ్‌లో విండీస్ జట్టు ఆస్ట్రేలియాతో పోటీపడనుంది.
అబుదాబి: టీ20 ప్రపంచకప్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక విజయంతో టోర్నీని ముగించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగుల భారీ స్కోరు సాధించింది. అసలంక (68: 41 బంతుల్లో 8X4, 1X6), నిస్సంక (51: 41 బంతుల్లో 5X4) అర్ధశతకాలతో చెలరేగారు. 190 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. దీంతో విండీస్ 20 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. చరిత్ అసలంకకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. ఇక ఈ మ్యాచ్‌తో శ్రీలంక సూపర్ 12 దశ ముగిసింది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో కేవలం రెండు విజయాలే సాధించి టోర్నీ నుంచి వైదొలిగింది.
హెట్‌మయర్ ఒంటరి పోరాటం..
190 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆదిలోనే దెబ్బపడింది. రెండో ఓవర్ రెండో బంతికి ఫెర్నాండో వేసిన అద్భుత బంతికి క్రిస్‌గేల్.. హసరంగకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. మరోవైపు ఇంకో ఓపెనర్ లూయిస్(8) సైతం రెండు ఫోర్లు కొట్టి జోరుమీదున్నా అదే ఓవర్ చివరి బంతికి పెవిలియన్ చేరాడు. దీంతో ఫెర్నాండో ఓకే ఓవర్‌లో 2 కీలక వికెట్లు తీసి విండీస్‌కు షాకిచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పూరన్(46: 34 బంతుల్లో 6X4, 1X6), రోస్టన్ చేజ్(9)తో జట్టు కట్టి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. బౌండరీలతో విరుచుకుపడిన పూరన్ మళ్లీ విండీస్ ఇన్నింగ్స్‌ను ఉత్సాహభరితంగా మార్చాడు. 4వ ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో మొత్తం 15 పరుగులు రాబట్టాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ కుదురుకుంటుండగా 5.3 ఓవర్ల వద్ద జట్టు స్కోర్ 47 పరుగులు ఉన్నప్పుడు కరుణరత్నె బౌలింగ్‌లో చేజ్ ఔటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన షిమ్రన్ హెట్‌మయర్(81*: 54 బంతుల్లో 8X4, 4X6), పూరన్‌తో జోడి కట్టాడు. అయితే రన్‌రేట్ పెరుగుతున్నప్పటికీ వీరిద్దరూ నిదానంగా ఆడడంతో ఆ జట్టుపై ఒత్తిడి పెరిగింది. దీంతో 10 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 72 పరుగులతో నిలిచింది. ఇక 11.1 ఓవర్‌లో 89 పరుగుల వద్ద పూరన్ చమీరాకు చిక్కి వెనుదిరిగాడు. ఆపై క్రీజులోకి వచ్చిన ఆండ్రూ రసెల్(2) జట్టు స్కోర్ 94 పరుగుల వద్ద.. పొలార్డ్(0) 107 పరుగుల వద్ద ఔటయ్యారు. మరోవైపు హెట్‌మయర్ క్రీజులో పాతుకుపోయి ఒంటరిపోరాటం చేశాడు. 14వ ఓవర్‌లో మూడు ఫోర్లు కొట్టాడు. అప్పటికే విండీస్ సాధించాల్సిన లక్ష్యం భారీగా ఉండడంతో ఆ జట్టు గెలుపుపై ఆశలు సన్నగిల్లాయి. ఇక చివరి ఓవర్‌లో ఆ జట్టుకు 34 పరగులు అవసరం కాగా 13 పరుగులు వచ్చాయి. అయితే హెట్‌మయర్ పోరాటం కేవలం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అసలంక అదరహో..
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. ఓపెనర్లు నిస్సంక, పెరీరా (29: 21 బంతుల్లో 2x4, 1x6) శుభారంభం చేశారు. తొలి వికెట్‌కు 42 పరుగులు అందించారు. ఈ క్రమంలోనే పెరీరా ఆరో ఓవర్‌లో తొలి వికెట్‌గా వెనుదిరిగాడు. ఆపై నిస్సంక, అసలంక విండీస్ బౌలర్లను ఆడుకున్నారు. ఇద్దరూ అర్ధశతకాలతో రాణించి రెండో వికెట్‌కు 91 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించారు. అయితే, 16వ ఓవర్‌లో నిస్సంక ఔటవ్వడంతో ఆ జట్టు 133 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత డాసెన్ శనక (25 నాటౌట్: 14 బంతుల్లో 2x4, 1x6) ధాటిగా ఆడాడు. ఇక 19వ ఓవర్‌లో అసలంక ఔటవ్వగా శనకతో కలిసి కరుణరత్నె(3) ఇన్నింగ్స్ పూర్తి చేశాడు. విండీస్ బౌలర్లలో రసెల్ 2, బ్రావో ఒక వికెట్ తీశారు. రవిరాంపాల్ (3-0-31-0), జాసన్ హోల్డర్ (4-0-37-0), అకీల్ హుస్సేన్ (2-0-22-0) పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. బ్రావో వికెట్ తీసినా (1/42) ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు.