Virat - Chamika: కొందరు అహంకారంగా భావిస్తుంటారు: చమిక కరుణరత్నె

శ్రీలంక క్రికెట్ (Sri Lanka) టీమ్‌లో దూకుడుగా ఉండే ఆటగాళ్లలో చమిక కరుణరత్నె (Chamika Karunaratne) ఒకడు. అయితే తాజాగా అతడు విరాట్ కోహ్లీ (Virat Kohli)తో కలిసిన ఫొటోను షేర్ చేసి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

Published : 15 Jan 2023 14:02 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మైదానంలో విజయం కోసం చివరి వరకు పోరాడినా.. వెలుపల మాత్రం తామంతా మంచి స్నేహితులమని క్రికెటర్లు చాలాసార్లు నిరూపించారు. తాజాగా శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నె కూడా తన అభిమాన ఆటగాడితో ఫొటో దిగి సోషల్‌ మీడియాలో పోస్టు చేశాడు. ఇంతకీ ఎవరితో దిగాడనేగా మీ డౌటు..? టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లీతో కలిసి దిగిన ఫొటోను చమిక షేర్‌ చేశాడు. భారత్ - శ్రీలంక జట్ల మధ్య తిరువనంతపురం వేదికగా మూడో వన్డే మ్యాచ్‌ జరగనుంది. ఈ క్రమంలో రెండో వన్డే వేదిక కోల్‌కతా నుంచి వచ్చేటప్పుడు ఫొటో దిగారు. దీంతోపాటు కోహ్లీని చాలామంది తప్పుగా అర్థం చేసుకొంటున్నారనే కోణంలో ఫొటోకు చమిక క్యాప్షన్‌ ఇచ్చాడు. 

‘‘ప్రజల్లో కొంతమంది అతడికి అహంకారం అని భావిస్తారు. ఇదంతా కెమెరా ముందు షో చేయడం కోసమే ప్రవర్తిస్తుంటాడని అపార్థం చేసుకొంటారు. అయితే ఆ దిగ్గజం మాత్రం పరుగుల దాహంతో ఉన్నట్లు చెప్పాడు. ఇలా ఉన్నంతకాలం అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలుగుతానని తెలిపాడు. అప్పుడే విజయం సొంతమవుతుంది’’ అని చమిక కరుణరత్నె క్యాప్షన్‌తో కూడిన ఫొటోను షేర్ చేశాడు. తొలి వన్డేలో విరాట్ కోహ్లీ (113)  సెంచరీ ఇన్నింగ్స్‌తో టీమ్‌ఇండియా భారీ స్కోరు సాధించిన విషయం తెలిసిందే. రెండుసార్లు శ్రీలంక ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేయడంతో వచ్చిన అవకాశాన్ని కోహ్లీ సద్వినియోగం చేసుకొని శతకం బాదాడు. దీంతో తన వన్డే కెరీర్‌లో 45 సెంచరీలను పూర్తి చేసుకొన్నాడు. శ్రీలంకపై అత్యధిక శతకాలను (9) సాధించిన బ్యాటర్‌గా అవతరించాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని