శ్రీలంక పరిస్థితి అస్సలు బాలేదు: జయసూర్య

శ్రీలంక క్రికెట్‌ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని కాపాడాలని మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య అభిప్రాయపడ్డాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను...

Published : 28 Jun 2021 01:11 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శ్రీలంక క్రికెట్‌ జట్టు పరిస్థితి మరీ దారుణంగా ఉందని, వెంటనే తగు చర్యలు తీసుకొని కాపాడాలని మాజీ కెప్టెన్‌ సనత్‌ జయసూర్య సూచించాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో పర్యటిస్తున్న లంక జట్టు మూడు టీ20ల సిరీస్‌ను ఒక్కటి కూడా గెలవకుండానే ఓటమిపాలైంది. మరీ ముఖ్యంగా శనివారం రాత్రి జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఆ జట్టు 181 పరుగుల లక్ష్య ఛేదనలో 91 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఇంగ్లాండ్‌ 89 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి తమ చరిత్రలో పరుగుల తేడా పరంగా నాలుగో అతిపెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే జయసూర్య ఆదివారం ట్విటర్‌లో ఇలా స్పందించాడు.

‘శ్రీలంక క్రికెట్‌కు ఇది చాలా బాధాకరమైన రోజు. ఇప్పుడున్న జట్టు పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఆటను కాపాడాలంటే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి’ అని విచారం వ్యక్తం చేశాడు. కాగా, ఈ పర్యటనలో శ్రీలంక ఏ మ్యాచ్‌లోనూ ఇంగ్లాండ్‌కు కనీస పోటీ ఇవ్వలేకపోయింది. తొలి టీ20లో 129/7 స్కోర్‌ చేసిన ఆ జట్టు రెండో టీ20లో 111/7 స్కోర్‌ సాధించింది. ఇక మూడో మ్యాచ్‌లో 91 పరుగులకే ఆలౌటవ్వడంతో అభిమానులు సైతం విమర్శలు చేస్తున్నారు. మరోవైపు ఇలాగే ఆడితే ఈ ఏడాది చివర్లో జరిగే పొట్టి ప్రపంచకప్‌లోనూ మరిన్ని ఘోర పరాజయాలు చూడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. కాగా, శ్రీలంక 2016లో ఒకసారి టీమ్‌ఇండియాపై 82 పరుగులకే ఆలౌటై అతి తక్కువ స్కోర్‌ నమోదు చేయడం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని