INDvsSL: భారత్‌తో ఆట.. లంకకు కాసుల పంట

టీమ్‌ఇండియాతో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లతో శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ ఆదాయం సమకూరనుంది. ఈ విషయాన్ని ఆ జట్టు బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు...

Published : 10 Jul 2021 01:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టీమ్‌ఇండియాతో ఆడే పరిమిత ఓవర్ల సిరీస్‌లతో శ్రీలంక క్రికెట్‌ బోర్డుకు భారీ ఆదాయం సమకూరనుంది. ఈ విషయాన్ని ఆ జట్టు బోర్డు అధ్యక్షుడు షమ్మి సిల్వ తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు అంతర్జాతీయ సిరీస్‌లు జరగకపోవడంతో శ్రీలంక బోర్డుకు భారీ నష్టం వాటిల్లిందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బీసీసీఐతో చర్చించి మూడు వన్డేలు, మూడు టీ20లు ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

తొలుత భారత్‌తో మూడు మ్యాచ్‌లకే తాము ఒప్పందం చేసుకున్నామని, ఆపై మళ్లీ బీసీసీఐతో చర్చలు జరిపి ఇంకో మూడు మ్యాచ్‌ల నిర్వహణకు ఒప్పించామని షమ్మి చెప్పుకొచ్చారు. దాంతో తమకు అదనంగా మరో ఆరు మిలియన్‌ డాలర్ల ఆదాయం (సుమారు రూ.45 కోట్లు) సమకూరుతుందని ఆయన వివరించారు. ఈ క్రమంలోనే కరోనా వైరస్‌ నేపథ్యంలో పలు అంతర్జాతీయ సిరీస్‌లు కోల్పోయినట్లు వెల్లడించారు. దాంతో తమ బోర్డుకు ఆర్థిక నష్టాలు ఎక్కువయ్యాయని.. అయినా, తమ ఆటగాళ్లకు చెల్లించే వేతనాల్లో లేదా ఇతర విషయాల్లో ఎలాంటి లోటూ లేకుండా చూసుకుంటున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో లంక ఆటగాళ్లు కూడా మ్యాచ్‌లు గెలిచి దేశ గౌరవాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు శ్రీలంక జట్టు వచ్చే వారం నుంచే టీమ్‌ఇండియాతో వన్డే సిరీస్‌, ఆపై టీ20 సిరీస్‌ ఆడాల్సి ఉంది. అయితే, ఇంగ్లాండ్‌ పర్యటన నుంచి వచ్చిన తర్వాత ఆ జట్టులో కొత్తగా కరోనా వైరస్‌ కలవరం రేపుతోంది. ఇప్పటికే సహాయక బృందంలోని ఇద్దరు వైరస్‌ బారినపడ్డారు. గురువారం బ్యాటింగ్‌ కోచ్‌ గ్రాంట్‌ ఫ్లవర్‌కు తొలుత వైరస్‌ లక్షణాలు కనిపించడంతో ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేశారు. అతడికి పాజిటివ్‌గా తేలడంతో శుక్రవారం మరోసారి ఆటగాళ్లందరికీ, సహాయక సిబ్బందికి పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలోనే తాజాగా ఆ జట్టు డేటా అనలిస్టు నిరోషన్‌కు సైతం పాజిటివ్‌గా తేలింది. దాంతో టీమ్‌ఇండియా సిరీస్‌లపై నీలినీడలు కమ్ముకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని