Team India: కోహ్లీసేన లాగే ధావన్‌ సేన..!

ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లేముందు టీమ్‌ఇండియా ప్రధాన బృందం ముంబయిలో ఎలాగైతే 14 రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉందో ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లబోయే యువ బృందం కూడా అలాగే ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి తాజాగా...

Published : 13 Jun 2021 01:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లేముందు టీమ్‌ఇండియా ప్రధాన బృందం ముంబయిలో ఎలాగైతే 14 రోజులు ప్రత్యేకంగా క్వారంటైన్‌లో ఉందో ఇప్పుడు శ్రీలంక పర్యటనకు వెళ్లబోయే యువ బృందం కూడా అలాగే ఉంటుందని ఓ బీసీసీఐ అధికారి తాజాగా వెల్లడించారు. జూన్‌ 14 నుంచి 28 వరకు ఆటగాళ్లంతా ఓ హోటల్లో ఉంటారని, వారికి రోజు విడిచి రోజు మొత్తం ఆరుసార్లు  ఆర్టీ-పీసీఆర్‌ కరోనా పరీక్షలు జరుపుతారని ఆయన చెప్పారు.

‘ఇంగ్లాండ్‌కు బయలుదేరి వెళ్లేముందు కోహ్లీసేన ఇక్కడ ఎలాగైతే క్వారంటైన్‌లో గడిపిందో ఇప్పుడు ధావన్‌ జట్టుకు కూడా అవే నియమాలు వర్తిస్తాయి. ఈ పర్యటనకు ఎంపిక చేసిన ఆటగాళ్లు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్లు ప్రత్యేక ఛార్టర్‌ విమానాల్లో వస్తారు. మరి కొందరు ప్యాసింజర్‌ విమానాల్లో రానున్నారు. ముంబయికి చేరుకున్నాక ఏడు రోజులు తమ గదుల నుంచి బయటకు రాకుండా ఉంటారు. ఆపై హోటల్లోనే ఒకరినొకరు కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఇక అక్కడే జిమ్‌లో సాధన చేస్తూ ఫిట్‌నెస్‌ సాధిస్తారు. ఇక కొలంబోకి చేరుకున్నాక ఆటగాళ్లు మరో మూడు రోజులు హోటల్‌ గదులకే పరిమితమవుతారు. ఆపై ఇంగ్లాండ్‌లో కోహ్లీసేన ఎలా సాధన చేస్తుందో ఈ జట్టు కూడా అక్కడ అలాగే ప్రాక్టీస్‌ చేస్తుంది. జట్టు రెండు గ్రూపులుగా విడిపోయి ప్రాక్టీస్‌ మ్యాచ్‌లు ఆడుతుంది’ అని ఆ అధికారి వివరించారు.

కాగా, ధావన్‌ నేతృత్వంలోని టీమ్‌ఇండియా జులై 13 నుంచి 18 వరకు వన్డే సిరీస్‌లో తలపడనుండగా.. 21 నుంచి 25 వరకు పొట్టి సిరీస్‌లో ఆడనుంది. ఈ మ్యాచ్‌లన్నీ కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో జరగనున్నాయి. ఇక ఈ పర్యటనకు బీసీసీఐ రెండు రోజుల క్రితమే 20 మంది ఆటగాళ్లతో జాబితా విడుదల చేసింది. అదనంగా ఐదుగురిని నెట్‌ బౌలర్లుగా ఎంపిక చేసింది.

శ్రీలంక పర్యటనకు టీమ్‌ఇండియా:

శిఖర్‌ ధావన్‌(కెప్టెన్‌), భువనేశ్వర్‌ కుమార్‌(వైస్‌ కెప్టెన్‌), పృథ్వీ షా, దేవ్‌దత్‌ పడిక్కల్‌, రుతురాజ్‌ గైక్వాడ్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, మనీశ్‌ పాండే, హార్దిక్‌ పాండ్య, నితీశ్‌ రాణా, ఇషాన్‌ కిషన్‌(కీపర్‌), సంజూ శాంసన్‌ (కీపర్‌), యుజువేంద్ర చాహల్‌, రాహుల్‌ చాహర్‌, కృష్ణప్ప గౌతమ్‌, కృనాల్‌ పాండ్య, కుల్‌దీప్‌ యాదవ్‌, వరుణ్‌ చక్రవర్తి, దీపక్‌ చాహర్‌, నవ్‌దీప్‌ సైని, చేతన్‌ సకారియా.

నెట్‌ బౌలర్లు: ఇషాన్‌ పోరెల్‌, సందీప్‌ వారియర్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌, సాయి కిషోర్‌, సిమర్జీత్‌ సింగ్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని