T20 World Cup : పసికూనపై శ్రీలంక చిత్తు.. సూపర్‌-12 భారత గ్రూప్‌పై ప్రభావం ఎంత..?

శ్రీలంక ఓటమి టీ20 ప్రపంచకప్‌ టోర్నీలోని సూపర్‌-12 గ్రూప్‌లపై ఏ మేరకు ప్రభావం చూపించనుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Updated : 17 Oct 2022 12:44 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌ : టీ20 ప్రపంచకప్‌ టోర్నీ సంచలన ఫలితంతోనే ప్రారంభమైంది. ఆదివారం జరిగిన తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో మాజీ ఛాంపియన్‌ శ్రీలంకను.. పసికూన నమీబియా చిత్తు చేసింది. దీంతో ఆసియా కప్‌ విజేత అయిన శ్రీలంక సూపర్‌-12 అవకాశాలకు ఈ పరాజయం పెద్ద ఎదురుదెబ్బే. భారీ తేడాతో ఓడటం నెట్‌ రన్‌రేట్‌పైనా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. అయితే.. శ్రీలంక ఓటమి సూపర్‌-12 గ్రూప్‌లపై ఏ మేరకు ప్రభావం చూపించనుందో ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

నిబంధనల ప్రకారం రెండు క్వాలిఫయర్‌ గ్రూప్‌ల నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్‌-12కు అర్హత సాధిస్తాయి. టీమ్‌ ఇండియా ఉన్న సూపర్‌ 12 గ్రూప్‌లో పాక్‌, బంగ్లాదేశ్‌, దక్షణాఫ్రికా ఉన్నాయి. క్వాలిఫయర్‌ మ్యాచ్‌ల అనంతరం గ్రూప్‌ ‘బి’ విజేత, గ్రూప్‌ ‘ఎ’ రన్నరప్‌ జట్లు ఇందులో చేరనున్నాయి.

లంక రన్నరప్‌గా నిలిస్తే..

ఇక గ్రూప్‌ ‘బి’లో ఫేవరెట్‌గా ఉన్న వెస్టిండీస్‌ విజేతగా నిలిచే అవకాశాలున్నాయి. నమీబియా భారీ షాక్‌ ఇవ్వడంతో గ్రూప్‌ ‘ఎ’లో శ్రీలంక పరిస్థితి ఏంటో తెలియాల్సి ఉంది. నెదర్లాండ్స్, యూఏఈ కూడా ఉన్న గ్రూప్‌-ఎ నుంచి సూపర్‌ 12కు అర్హత సాధించాలంటే శ్రీలంక తన తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో తప్పక గెలవాలి. అయినా మిగతా మ్యాచ్‌ల ఫలితాలపై శ్రీలంక భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతానికి గ్రూప్‌ నుంచి నమీబియా రేసులో ముందుంది. ఒకవేళ లంక రన్నరప్‌గా నిలిస్తే.. భారత్‌ ఉన్న సూపర్‌ 12 గ్రూప్‌లో చేరుతుంది. అప్పుడు ఈ గ్రూప్‌ నుంచి టాప్‌ స్థానాల కోసం.. భారత్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికాతోపాటు కొత్తగా వచ్చే లంక, వెస్టిండీస్‌ జట్ల మధ్య హోరాహోరీ పోరు నెలకొనే అవకాశం ఉంటుంది. ఇటీవల జరిగిన ఆసియా కప్‌లో భారత్‌ను ఓడించి లంక ఫైనల్‌ చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ జట్ల సమీకరణాలపై ఆసక్తి నెలకొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని