Kidambi Srikanth: సంబరాలకు సమయం లేదు

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. మంగళవారం హైదరాబాద్‌ తిరిగొచ్చిన శ్రీకాంత్‌కు పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలోని చిన్నారులు

Updated : 22 Dec 2021 07:25 IST

గోపీచంద్‌ అకాడమీని వీడను
భారత స్టార్‌ షట్లర్‌ శ్రీకాంత్‌
ఈనాడు - హైదరాబాద్‌

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో రజత పతకంతో మెరిసిన తెలుగు తేజం కిదాంబి శ్రీకాంత్‌కు సొంతగడ్డపై ఘన స్వాగతం లభించింది. మంగళవారం హైదరాబాద్‌ తిరిగొచ్చిన శ్రీకాంత్‌కు పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీలోని చిన్నారులు కేరింతలతో స్వాగతం పలికారు. జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ గోపీచంద్‌, అతని తల్లి సుబ్బరావమ్మ, అకాడమీ కోచ్‌లు, సిబ్బంది.. శ్రీకాంత్‌ను అభినందించారు. శ్రీకాంత్‌తో కేక్‌ కట్‌ చేయించి సంబరాలు   చేసుకున్నారు. అనంతరం శ్రీకాంత్‌ విలేకరులతో మాట్లాడాడు. వివరాలు అతని మాటల్లోనే..

అత్యుత్తమ దశ

ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు కెంటొ మొమొట ఒక్కడే దూరమయ్యాడు. మిగతా అగ్రశ్రేణి ఆటగాళ్లంతా ఆడారు. ప్రతిష్టాత్మక టోర్నీలో ఫైనల్‌ చేరుకోవడం ఆనందంగా ఉంది. నిజానికి 2017 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలుస్తానని అనుకున్నా. కానీ నిరాశ తప్పలేదు. ఈసారి ఎలాంటి అంచనాలు లేకుండా బరిలో దిగా. అత్యుత్తమంగా ఆడాను. బాగా ఆడితే ఎవరినైనా ఓడించగలనని తెలుసు. 2017లో నాలుగు సూపర్‌ సిరీస్‌లు గెలిచిన సమయంలో కంటే ఇప్పుడే అత్యుత్తమంగా ఆడుతున్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ ప్రదర్శన పట్ల సంతోషంగా, సంతృప్తిగా ఉన్నా. గొప్ప అనుభూతిని పొందుతున్నా. నా కెరీర్‌లో అత్యుత్తమ దశగా భావిస్తున్నా. టోర్నీకి ముందు ఎంత సాధన చేశాం.. ఎంత కసరత్తు చేశామన్నది కాదు. ఆ రోజు.. ఆ గంట ఎలా ఆడాడమన్నదే ముఖ్యం. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో నేను నేర్చుకున్నది అదే.

ఒలింపిక్స్‌ ఒక్కటే కాదు

టోక్యో ఒలింపిక్స్‌లో ఆడకపోవడం నిరాశ కలిగించింది. టోక్యోకు ముందు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో నా స్థానం 14. భారత్‌ తరఫున నాదే అత్యుత్తమ ర్యాంకు. అయినా టోక్యోకు వెళ్లలేకపోయా. గత కొన్నేళ్లలో ఎంత కష్టపడ్డానో చాలామందికి తెలియదు. కొన్నిసార్లు నా నియంత్రణలో లేని కారణాలతో ఇబ్బంది పడ్డా. నేను పూర్తి ఫిట్‌గా.. ఆత్మవిశ్వాసంతో ఉన్నప్పుడు కరోనా మహమ్మారి నష్టం చేసింది. ఒలింపిక్స్‌కు ముందు జరగాల్సిన చాలా అర్హత టోర్నీలు రద్దయ్యాయి. మంచి ఫిట్‌నెస్‌తో ఉన్నా టోర్నీలు ఆడలేకపోయా. టోక్యోకు అర్హత సాధించలేకపోయా. అయితే ఒలింపిక్స్‌తోనే ప్రపంచం ముగిసినట్లు కాదని అర్థం చేసుకున్నా. సత్తాచాటేందుకు ఎన్నో టోర్నీలు ఉన్నాయి. అందుకు తగ్గట్లుగా సన్నద్ధమయ్యా. ఇప్పుడు ఫలితం వచ్చింది.

మళ్లీ నంబర్‌వన్‌గా చూడొచ్చు

నేనేంటో ఎవరికో నిరూపించాల్సిన పనిలేదు. ఇంకా రేసులోనే ఉన్నా.. అత్యుత్తమంగా ఆడగలను అని నాకు నేను చెప్పుకుంటానంతే. ఈస్థాయికి చేరుకున్నందుకు సంతోషంగా ఉంది. ఇకమీదట కూడా తల దించుకునే ఉంటా. టైటిళ్లు గెలిచేందుకు మరింత కష్టపడతా. నా అత్యుత్తమ ఆటతీరు రావాల్సి ఉంది. నన్ను మళ్లీ     నంబర్‌వన్‌గా చూడొచ్చు. రానున్న ఇండియా ఓపెన్‌, ఆల్‌ ఇంగ్లాండ్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, ఆసియా క్రీడల్లో సత్తాచాటాలి. ప్రధాన టోర్నీల్లో నిలకడగా టైటిళ్లు గెలవడానికి గోపీ అన్నతో మాట్లాడి ప్రణాళిక రూపొందించుకుంటా. నేను గోపీచంద్‌ అకాడమీ వీడను. ఇక్కడే ఉంటూ మరిన్ని టైటిళ్లు గెలిచేందుకు ప్రయత్నిస్తా. ఇక టోర్నీలకు సిద్ధం కావాలి. రజతం పతకం సాధించినా.. సంబరాలు చేసుకోవాడానికి సమయం లేదు.

రిటైరయ్యాక చెప్తా

గాయాల కారణంగా 2018, 2019లలో కష్టకాలం ఎదుర్కొన్నా. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ కోసం 2017 కంటే 2, 3 రెట్లు ఎక్కువ కష్టపడ్డా. ఇకమీదట కూడా ఇదే ఆటతీరు కొనసాగిస్తా. నాపై నేను నమ్మకంతో ఉన్నా. మరింత అత్యుత్తమంగా ఆడాలని నాకు నేను చెప్పుకుంటున్నా. ఇంతకంటే బాగా ఆడగలను కూడా. భారత బ్యాడ్మింటన్‌ పురుషుల విభాగంలో నేనే అత్యుత్తమం అని చెప్పలేను. అది బ్యాడ్మింటన్‌ అభిమానులు చెప్పాలి. ఆసియా క్రీడలు, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌, కామన్వెల్త్‌ క్రీడలు, 2024 ఒలింపిక్స్‌ ఉన్నాయి. ఈ టోర్నీల్లో పతకాలు గెలిస్తే రిటైరయ్యాక నేనే అత్యుత్తమా? కాదా? అన్నది చెప్తా. ఇప్పుడైతే చెప్పలేను. యువ ఆటగాళ్లలో లక్ష్యసేన్‌, ప్రియాంషు, సాయిచరణ్‌ బాగా ఆడుతున్నారు.

బుడగ కష్టమే.. కానీ

కరోనా మహమ్మారితో నాకు చాలా నష్టం జరిగింది. టోర్నీలు ఆడుతుంటూనే లయ ఉంటుంది. ఒక టోర్నీ ఆడాక ఆర్నెల్లు విరామం తీసుకుని మరో ఈవెంట్‌ ఆడితే లయ దొరకదు. టోర్నీల అనుభూతి లభించదు. సుదిర్మన్‌ కప్‌, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో నా ప్రదర్శనలే ఇందుకు నిదర్శనం. ఇప్పట్నుంచి టోర్నీలు తప్పనిసరిగా జరుగుతాయని అనుకుంటున్నా. బయో బబుల్‌ వాతావరణం చాలా కష్టం. కానీ తప్పదు. ప్రస్తుత పరిస్థితుల్లో బుడగ ఉండకుండా టోర్నీలు నిర్వహించడం కుదరదు. ఏ టోర్నీలోనైనా మ్యాచ్‌లు గెలుస్తున్నంతసేపు స్టేడియం, హోటల్‌, ఆహారమే నా ప్రపంచం. బుడగ కూడా దాదాపు అంతే. కాకపోతే వారంలో రెండు సార్లు పరీక్షలు చేయించుకోవాలి. అదొక నిమిషం పని.


పొరపాట్లకు శ్రీకాంత్‌ అడ్డుకట్ట వేయాలి: గోపీచంద్‌

దిల్లీ: కిదాంబి శ్రీకాంత్‌ నిలకడగా రాణించాలంటే పొరపాట్లకు అడ్డుకట్ట వేయాలని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నాడు. ‘‘ప్రపంచ ఛాంపియన్‌షిప్‌ సాగుతున్నాకొద్దీ శ్రీకాంత్‌ ఆటతీరు మరింత పదునెక్కింది. ఈ ఏడాది ఆట మొదలుపెట్టినప్పుడు అతనిలో ఆత్మవిశ్వాసం లోపించింది. అయితే లీ జియా, కెంటొ మొమొటలతో మ్యాచ్‌ల అనంతరం శ్రీకాంత్‌లో ఆత్మవిశ్వాసం వచ్చింది. సరైన సమయంలో అతను ఫామ్‌లోకి వచ్చాడు. 2022లో కామన్వెల్త్‌ క్రీడలు, ఆసియా క్రీడల వంటి మెగా టోర్నీలు ఉన్న నేపథ్యంలో నిలకడగా రాణించాలంటే శ్రీకాంత్‌ తన పొరపాట్లకు అడ్డుకట్ట వేయాలి. ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో ముగ్గురు భారత షట్లర్లు క్వార్టర్‌ఫైనల్‌ చేరుకోవడం ఆనందంగా ఉంది. శ్రీకాంత్‌ ఫైనల్‌ చేరుకోగా.. లక్ష్యసేన్‌, ప్రణయ్‌ సత్తాచాటారు. కొన్ని టోర్నీల్లో సాయి ప్రణీత్‌ బాగా ఆడాడు. సమీర్‌వర్మ కూడా లయలో కనిపిస్తున్నాడు’’ అని గోపీచంద్‌ తెలిపాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని