DK: ఆ సమయంలో రోహిత్‌పై విమర్శకుల బంతులు దూసుకొచ్చాయి: డీకే

ఎంతటి పెద్ద స్టార్‌ ఆటగాడికైనా టెస్టుల్లో రాణిస్తేనే గుర్తింపు వస్తుంది. తమలోని శక్తి సామర్థ్యాలు టెస్టు క్రికెట్‌ ద్వారానే బయటకొస్తాయి. ప్రస్తుతం టీమ్ఇండియా...

Updated : 19 Aug 2022 13:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంతటి పెద్ద స్టార్‌ ఆటగాడికైనా టెస్టుల్లో రాణిస్తేనే గుర్తింపు వస్తుంది. తమలోని శక్తి సామర్థ్యాలు టెస్టు క్రికెట్‌ ద్వారానే బయటకొస్తాయి. ప్రస్తుతం టీమ్ఇండియా సారథి రోహిత్ శర్మ అంతర్జాతీయ కెరీర్‌ ప్రారంభించిన (2007) ఆరేళ్లకుగానీ టెస్టుల్లో అవకాశం దక్కలేదు. అయితే విండీస్‌తో 2013లో టెస్టుల్లోకి అరంగేట్రం చేసిన రోహిత్ మొదటి మ్యాచ్‌లోనే శతకం (177) కొట్టడం విశేషం. అలానే రెండో టెస్టులోనూ (111*) సెంచరీ బాదేశాడు. అరంగేట్రం చేసిన వెంటనే వరుసగా రెండు శతకాలు చేయడం రోహిత్‌కే సాధ్యమైంది.

అయితే .. ఆ తర్వాత దాదాపు నాలుగేళ్లపాటు రోహిత్‌ ఖాతాలో ఒక్క సెంచరీ లేదు. నాగ్‌పుర్‌ వేదికగా 2017లో శ్రీలంకపై 102 పరుగులు చేసి మళ్లీ ఫామ్‌లోకి వచ్చాడు. కానీ నాలుగో సెంచరీకి మళ్లీ రెండేళ్ల సమయం తీసుకోవాల్సి వచ్చింది. ఈసారి మాత్రం విశాఖపట్నంలో 2019లో దక్షిణాఫ్రికాపై రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ (176, 127) శతకాలు చేసి అబ్బురపరిచాడు. ఇక ఆ తర్వాత జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు. తొలుత మిడిలార్డర్‌లో ఆడిన రోహిత్‌ ఇప్పుడు ఓపెనర్‌గా మారాడు. అంతేకాకుండా టీమ్ఇండియా కెప్టెన్సీ బాధ్యతలను చేపట్టాడు.  అయితే ఫామ్‌ కోల్పోయి జట్టులో స్థానం దక్కని స్థితిలో రోహిత్ చాలా ఇబ్బందిపడ్డాడని టీమ్‌ఇండియా సీనియర్‌ ఆటగాడు దినేశ్‌ కార్తిక్‌ వెల్లడించాడు.

‘‘రోహిత్ ఎప్పుడూ తనపై నమ్మకం ఉంచుకునేవాడు. కెరీర్‌ ఆరంభంలో తప్పకుండా టెస్టు క్రికెట్‌ ఆడతానని భావించేవాడు. అయితే మా మధ్య జరిగిన చర్చల్లో.. చాలాసార్లు కష్టపడినా పరిణామాలు మాత్రం అనుకూలంగా వచ్చేవి కావని బాధపడుతూ ఉండేవాడు. కొన్నిసార్లు నిర్లక్ష్యంగా షాట్లు కొట్టి పెవిలియన్‌కు చేరాడు. అయితే మళ్లీ పుంజుకుంటాననే నమ్మకం మాత్రం విడవలేదు. కానీ అతడు అనుకున్నంత వేగంగా టెస్టుల్లోకి రాలేకపోయినా.. వైట్‌బాల్‌ క్రికెట్‌లో మాత్రం అద్భుతాలు చేశాడు. టెస్టు క్రికెట్‌లో రోహిత్‌ మాదిరిగా అరంగేట్రం ఘనంగా చేసిన ఆటగాళ్లు మరెవరూ లేరనుకుంటా. వచ్చీ రాగానే.. వరుసగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. అదే సమయంలో సచిన్‌ కూడా రిటైర్‌ అయ్యాడు. దీంతో ఇక రోహిత్‌కు తిరుగుండదని చాలా మంది భావించారు. అయితే జీవితం, క్రీడల్లో మనం అనుకున్నవిధంగా జరగదు కదా.. నాలుగేళ్లపాటు ఒక్క సెంచరీ లేక రోహిత్ ఫామ్‌ కోల్పోయి ఇబ్బంది పడటంతో బయట నుంచి అతడిపై ఒక్కసారిగా విమర్శలు కర్వ్‌ బంతుల రూపంలో విరుచుకుపడ్డాయి’’ అని దినేశ్‌ కార్తిక్‌ తెలిపాడు.

రోహిత్ శర్మ ఇప్పటి వరకు 45 టెస్టుల్లో 46కిపైగా సగటుతో 3,137 పరుగులు సాధించాడు. ఇందులో ఒక డబుల్ సెంచరీ, ఎనిమిది శతకాలు, 14 అర్ధశతకాలు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు