స్మిత్ ఎంతో అమాయకుడట..

భారత ఆటగాడు రిషభ్‌ పంత్‌ గార్డ్‌ మార్క్‌ను చెరిపివేశాడని నిందలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌కు ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మద్దతుగా...

Published : 13 Jan 2021 11:50 IST

వెనకేసుకొచ్చిన ఆసీస్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: భారత ఆటగాడు రిషభ్‌ పంత్‌ గార్డ్‌ మార్క్‌ను చెరిపివేశాడని నిందలు ఎదుర్కొంటున్న ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌స్మిత్‌కు ఆ జట్టు కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌ మద్దతుగా నిలిచాడు. ఆ సంఘటనలో స్మిత్ 100 శాతం అమాయకుడని అన్నాడు. అతడిపై చెత్త వ్యాఖ్యలు చేస్తున్నారని, ఇది ఎంతో హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నాడు. బాలా టాంపరింగ్ వివాదం అనంతరం స్మిత్‌ ఆదర్శప్రాయంగా ఉంటున్నాడని తెలిపాడు. ఇంగ్లాండ్‌ పర్యటనలో అతడిని ఎంతోమంది హేళన చేసినా నవ్వుతూ బ్యాటుతో సమాధానమిచ్చాడని గుర్తుచేశాడు.

‘‘స్మిత్‌పై వచ్చిన కొన్ని చెత్త వార్తలను నమ్మలేకపోయా. అతడి గురించి తెలిసివారు ఎవరైనా స్మిత్‌ చమత్కారమైన పనులు చేస్తాడని చెబుతారు. గత కొన్నేళ్లుగా అతడు చేసే పనులు చూసి మేం సరదాగా నవ్వుకున్నాం. గతంలో కూడా ఈ విషయాన్ని చెప్పాను. అయితే స్మిత్ ఎన్నోసార్లు క్రీజు వద్దకు వెళ్లి అలా చేశాడు. మ్యాచ్‌ పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికే మాత్రమే అలా చేస్తాడు. సిడ్నీ వికెట్‌ ఫ్లాట్‌గా, కాంక్రీట్‌లా ఉంది. క్రీజు వద్దకు వెళ్లి ఏదైనా చేయాలనుకుంటే 15 అంగుళాల స్పైక్స్‌ అవసరం. అయితే స్మిత్‌ క్రీజువద్దకు వెళ్లలేదు. అతడిపై నిందలు రావడం హాస్యాస్పదంగా ఉంది’’ అని లాంగర్‌ అన్నాడు.

సిడ్నీ టెస్టులో చివరి రోజు డ్రింక్స్‌ బ్రేక్‌లో స్మిత్.. పంత్ గార్డ్‌ మార్క్‌ను చెరిపివేసిన వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. దీంతో సామాజిక మాధ్యమాల్లో అతడిపై విమర్శలు వెల్లువెత్తాయి. మాజీ క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్‌, మైకేల్‌ వాన్‌ కూడా అతడిని విమర్శించారు. అయితే వివాదంపై స్మిత్‌ స్పందిస్తూ ఎలాంటి తప్పు చేయలేదని, జనం స్పందన దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పాడు. ‘బ్యాటింగ్‌ క్రీజులోకి వచ్చి మేం ఎక్కడ బౌలింగ్‌ చేస్తున్నాం, బ్యాట్స్‌మెన్‌ మా బౌలర్లను ఎలా ఎదుర్కొంటున్నారు అని ఊహించుకోవడం నాకు అలవాటు. నేనెప్పుడూ సెంటర్లో మార్క్‌ చేస్తా. భారత జట్టు గొప్ప ప్రదర్శన కంటే ఇతర అంశాల గురించి ఎక్కువ చర్చ జరగడం సిగ్గుచేటు’ అని స్మిత్‌ అన్నాడు. అతడికి ఆస్ట్రేలియా కెప్టెన్‌ టిమ్‌ పైన్‌ కూడా మద్దతుగా నిలిచిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి

ముగ్గురు మొనగాళ్లు.. మీ విలువకు సరిలేరు

ఇది సిగ్గుచేటు: వివాదంపై స్పందించిన స్మిత్‌


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని