IND vs AUS: క్రికెట్‌ రూల్‌లోని ‘లూప్‌హోల్‌’ని స్మిత్‌ ప్రయోగించాడు: పార్థివ్‌ పటేల్

ప్యాట్‌ కమిన్స్‌ స్థానంలో భారత్‌తో మూడో టెస్టులో (IND vs AUS) ఆసీస్‌కు స్టీవ్‌ స్మిత్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అద్భుతమైన తన ప్రణాళికలతో విజయం చేకూర్చి పెట్టాడు. అయితే, అతడు నిబంధనలకు విరుద్ధంగా అప్పీళ్లు చేశాడని ఓ అభిమాని సందేహం వ్యక్తం చేయగా.. మాజీ క్రికెటర్‌ సమాధానం ఇచ్చాడు.

Published : 04 Mar 2023 01:45 IST

ఇంటర్నెట్ డెస్క్‌: మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై ఆసీస్‌ (IND vs AUS) 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా (Australia) స్పిన్నర్లు అదరగొట్టిన ఇందౌర్ పిచ్‌పై భారత (Team India) బౌలర్లు తేలిపోయారు. టీమ్‌ఇండియా బ్యాటింగ్‌ చేస్తున్న క్రమంలో ఆ జట్టు సారథి స్టీవ్‌ స్మిత్ (Steve Smith) ఓ ట్రిక్‌ను ప్లే చేశాడని మాజీ క్రికెటర్‌ పార్థివ్‌ పటేల్ (Parthiv Patel) వ్యాఖ్యానించాడు. క్రీజ్‌లో బ్యాటర్‌ ఉన్నాసరే వికెట్‌ కీపర్‌ స్టంప్స్‌ను పడగొట్టేసి మరీ స్మిత్‌తో కలిసి అప్పీలు చేస్తూ కనిపించాడు. దీనిపైనే ఓ అభిమాని ‘ఫ్యాన్ ఆస్క్‌’లో ప్రశ్న సంధించాడు. ‘‘స్టంపింగ్‌ చేసినట్లు బెయిల్స్‌ను పడగొట్టి.. ఇటు క్యాచ్‌ రివ్యూను కూడా ఆసీస్‌ దక్కించుకుంది.. ఇది మీరు గమనించారా..? ఇది సరైన పద్ధతేనా..? డీఆర్‌ఎస్‌లను తమ వద్ద ఉంచుకోవడానికి ఇలా చేశారని మీకు అనిపించడం లేదా..? దీనిపై మీరేం అనుకుంటున్నారు?’’ అని అడిగాడు. ఇందుకు టీమ్‌ఇండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్‌ పటేల్ సమాధానం ఇచ్చాడు. 

‘‘రూల్స్‌లో అక్కడ లూప్‌హోల్‌ (లొసుగు) ఉంది. ఎప్పుడైనా స్టంపింగ్‌ కోసం అప్పీలు చేస్తే.. ఫీల్డ్‌ అంపైర్‌ థర్డ్‌ అంపైర్ సాయం కోరితే ప్రాసెస్‌ ప్రకారం చెక్‌ చేసుకుంటూ రావాలి. అప్పుడు, బ్యాటర్‌ బంతిని ఎడ్జ్‌ చేశాడా..? లేదా.? అని కూడా చూడాలి. దీనిపై స్మిత్‌కు పూర్తి అవగాహన ఉంది. దానిని వినియోగించుకున్నాడు. ఇలాంటి సమస్యకు రెండు మార్గాలు ఉన్నాయి. అందులో ఒకటి, ఫీల్డ్‌ అంపైర్‌ తన నిర్ణయంపై నమ్మకంతో ఉన్నప్పుడు థర్డ్‌ అంపైర్‌కు నివేదించకూడదు. అలాకాకుండా, రెండో మార్గం కూడా ఉంది. ఫీల్డింగ్‌ జట్టు స్టంపింగ్‌ కోసం అప్పీలు చేస్తే.. కేవలం దానిని మాత్రమే థర్డ్‌ అంపైర్‌ చెక్‌ చేస్తే సరిపోతుంది. ఒకవేళ, క్యాచ్‌ ఔట్‌ కూడా సమీక్షించాలంటే.. తప్పనిసరిగా డీఆర్‌ఎస్‌ తీసుకోవాలి. క్యాచ్‌, ఎల్బీ కోసం అప్పీలు చేసినా.. వాటి వరకే చెక్‌ చేస్తే సరిపోతుంది’’ అని పార్థివ్‌ వివరించాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని