Ricky Ponting: సచిన్‌ 100శతకాల రికార్డును కోహ్లీ అధిగమించగలడు!

కెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సాధించిన ఘనతలెన్నో. ఆటలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు మాస్టర్‌ బ్లాస్టర్‌ సొంతం. అందులో ఒకటి 100 సెంచరీల ఘనత.........

Published : 19 Sep 2022 22:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ సాధించిన ఘనతలెన్నో. ఆటలో ఎవరికీ సాధ్యం కాని రికార్డులు ఈ మాస్టర్‌ బ్లాస్టర్‌ సొంతం. అందులో ఒకటి 100 సెంచరీల ఘనత. అయితే, ఈ వంద శతకాల ప్రస్తావన ఎప్పుడు వచ్చినా.. దాన్ని అందుకోగల సామర్థ్యం ప్రస్తుత తరంలో ఒక్క విరాట్‌ కోహ్లీకి మాత్రమే ఉంది అనేది కొందరి అభిప్రాయం. అయితే, ఈ రికార్డును చేరుకోలేడు అనేవారూ లేకపోలేదు. కాగా వంద సెంచరీల అంశంపై ఆస్ట్రేలియా మాజీ దిగ్గజం రికీ పాటింగ్‌ తాజాగా తన మనసులో మాట బయటపెట్టాడు. కోహ్లీ విజయం కోసం పరితపిస్తాడని.. సచిన్‌ 100 శతకాల రికార్డును విరాట్‌ అధిగమించే అవకాశం ఇంకా ఉందని పాటింగ్‌ అభిప్రాయపడ్డాడు. 

ఐసీసీ రివ్యూలో దీనిపై ప్రశ్నించగా పాంటింగ్‌ స్పందించాడు. ‘మూడేళ్ల క్రితం ఈ ప్రశ్న అడిగుంటే కచ్చితంగా ఔననే చెప్పేవాడిని. కానీ కోహ్లీ ఇప్పుడు కాస్త నెమ్మదించాడు. ఆ రికార్డును అధిగమించాలంటే ఇంకా 30సెంచరీలు చేయాల్సిఉంది. అయినప్పటికీ అతడు ఆ రికార్డును బద్దలుకొట్టే అవకాశం ఇంకా ఉంది. ఇందులో అనుమానమే లేదు’ అని అన్నాడు. ‘అతడికి ఇంకా ఎన్నో ఏళ్ల ఆట మిగిలిఉంది. విరాట్‌ ఓ రికార్డును సాధించలేడు అనలేం. ఎందుకంటే అతడి విజయ దాహం తీరనిది’ అని పాటింగ్‌ పేర్కొన్నాడు.

అనేక రోజుల పాటు ఫామ్‌ లేమితో ఇబ్బంది పడిన విరాట్‌ కోహ్లీ ఆసియా కప్‌లో తిరిగి పుంజుకున్నాడు. దాదాపు మూడేళ్ల తర్వాత సెంచరీ సాధించాడు. దీంతో మొత్తంగా 71 శతకాలు సాధించి రికీ పాంటింగ్‌ సరసన చేశారు. అయితే ప్రస్తుత ఆటగాళ్లలో కోహ్లీ దరిదాపుల్లో కూడా ఎవరూ లేరు. మరికొన్నేళ్లపాటు ఫిట్‌నెస్‌, ఫామ్‌ను కొనసాగిస్తే సచిన్‌ 100 శతకాల రికార్డును కోహ్లీ బద్దలుకొడతాడు అనడంలో అతిశయోక్తి లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని